ఈ-వాచ్‌ యాప్‌ 9 వరకు తేవొద్దు!

ABN , First Publish Date - 2021-02-06T07:52:54+05:30 IST

పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) రూపొందించిన ఈ-వాచ్‌ యాప్‌ ఈ నెల 9వ తేదీవరకు వినియోగంలోకి తీసుకురావద్దని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీచేసింది.

ఈ-వాచ్‌ యాప్‌ 9 వరకు తేవొద్దు!

ఎస్‌ఈసీకి హైకోర్టు మధ్యంతర ఆదేశం

ఆ యాప్‌ సర్టిఫికేషన్‌ ప్రక్రియను 

కొనసాగించాలని ప్రభుత్వానికి సూచన


అమరావతి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) రూపొందించిన ఈ-వాచ్‌ యాప్‌ ఈ నెల 9వ తేదీవరకు వినియోగంలోకి తీసుకురావద్దని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. మరోవైపు.. ఈ యాప్‌ సెక్యూరిటీ ఆడిట్‌ సర్టిఫికేషన్‌ ప్రక్రియను కొనసాగించాలని.. ఇందుకు తమ ఉత్తర్వులు అడ్డంకి కాదని రాష్ట్రప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ-వాచ్‌ యాప్‌ సెక్యూరిటీ ఆడిట్‌ సర్టిఫికెట్‌ పొందేందుకు ఎస్‌ఈసీ కార్యదర్శి ఈ నెల 4న యాప్‌ ధ్రువీకరణ నోడల్‌ ఏజెన్సీ ఏపీ టెక్నాలజీ సర్వీసె్‌స(ఏపీటీఎ్‌స)కు లేఖ రాశారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. సర్టిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఐదు రోజుల సమయం పడుతుందన్నారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న నాయస్థానం విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి. ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయితీ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఎస్‌ఈసీ ఈ-వాచ్‌ యాప్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.


ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన సీ-విజిల్‌, నిఘా యాప్‌లను వినియోగించకుండా ఎస్‌ఈసీ సొంతగా ప్రైవేటు యాప్‌ తీసుకొచ్చిందంటూ హైకోర్టులో మూడు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.  ప్రకాశం జిల్లా ఇంకొల్లుకు చెందిన న్యాయవాది సుధాకర్‌, గుంటూరు వాసి ఎ.నాగేశ్వరావు, వి. అడుసుమల్లి వే ర్వేరుగా వీటిని దాఖలు చేశారు. శుక్రవారం ధర్మాసనం వీటిని విచారించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు శ్రీరాంబట్ల శరత్‌, వీఆర్‌ రెడ్డి కొవ్వూరి, జీఆర్‌ సుధాకర్‌ వాదనలు వినిపించారు. ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణ కోసం ఇప్పటికే సీ విజిల్‌, నిఘా యాప్‌లు అందుబాటులో ఉన్నాయని.. ఇవి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని తెలిపారు. ఎస్‌ఈసీ తెచ్చిన ఈ-వాచ్‌ యాప్‌ విషయంలో సెక్యూరిటీ ఆడిట్‌ జరగలేదన్నారు. దీంతో దీనిపై సందేహాలు కలుగుతున్నాయని.. యాప్‌ వల్ల వినియోగదారుల గోప్యతకు ముప్పు ఉందని తెలిపారు.


వాటికి విచారణార్హత లేదు.. 

ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీ కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. యాప్‌ను సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్లకు విచారణార్హత లేదన్నారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం యాప్‌ను అభివృద్ధి చేసుకొనేందుకు ఎస్‌ఈసీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రోత్సహిస్తోందని.. అందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌ ఎస్‌ఈసీ కూడా సొంతగా యాప్‌ను తీసుకొచ్చిందని తెలిపారు. మన రాష్ట్రంలో కూడా తీసుకొచ్చేందుకు గత ఎనిమిది నెలలుగా ఎస్‌ఈసీ కృషి చేస్తోందని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన యాప్‌ పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల కోసం తయారుచేసిందని.. ఇది పంచాయతీ ఎన్నికలకు సరిపడదని తెలిపారు. యాప్‌ను గుర్తించేందుకు నిర్వహించిన ప్రక్రియ, కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వంతో ఎస్‌ఈసీ జరిపిన సంప్రదింపుల వివరాలను సీల్డ్‌ కవర్‌లో అందజేస్తామన్నారు. సీల్డ్‌ కవర్‌లో ఇస్తామనడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘నో సీల్డ్‌ కవర్‌ బిజినెస్‌’ అని వ్యాఖ్యానించింది. అశ్వనీకుమార్‌ వాదనలు కొనసాగిస్తూ.. యాప్‌ వినియోగంతో వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లదన్నారు. దీని ద్వారా కేవలం ఫిర్యాదులు మాత్రమే తీసుకుంటామని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. పంచాయతీరాజ్‌ శాఖ రూపొందించిన నిఘా యాప్‌ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ఎస్‌ఈసీని ప్రశ్నించింది. ఈ-వాచ్‌ యాప్‌ను ఎవరు రూపొందించారు.. ఇందుకోసం ఎంత ఖర్చు చేశారని ఆరాతీసింది. ప్రభుత్వాన్ని సంప్రదించి యాప్‌ను రూపొందించామని.. ఎంత ఖర్చు చేశారనే సమాచారం అందుబాటులో లేదని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది తెలిపారు. ప్రభుత్వ యాప్‌లపై ఆధారపడకుండా సొంతవి రూపొందించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రోత్సహిస్తోందన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఎస్‌ఈసీ పరిధిలోని అంశమని.. తమ పాత్ర ఉండదని కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వివరించారు.


సర్టిఫికేషన్‌కు 4న లేఖ రాశారు

ప్రభుత్వం తరఫు న్యాయవాది సి.సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. ఈ-వాచ్‌ యాప్‌కు సెక్యూరిటీ ఆడిట్‌ సర్టిఫికేషన్‌ కోసం ఎస్‌ఈసీ కార్యదర్శి ఈ నెల 4వతేదీన ఏపీటీఎస్‌కు లేఖ రాశారన్నారు. ఏపీ స్టేట్‌ డేటా సెంటర్‌ సర్వర్‌లో యాప్‌ను హోస్ట్‌ చేసేందుకు సెక్యూరిటీ ఆడిట్‌ సర్టిఫికెట్‌ అవసరమని తెలిపారు. సర్టిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి కావడానికి 5 రోజులు పడుతుందన్నారు. ఈ ఆడిట్‌ సర్టిఫికెట్‌ లేకుండా యాప్‌ను వినియోగించడానికి లేదన్నారు. 

Updated Date - 2021-02-06T07:52:54+05:30 IST