కేవీపీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారా?

ABN , First Publish Date - 2021-12-09T08:54:55+05:30 IST

ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో అప్పటి ముఖ్యమంత్రి

కేవీపీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారా?

ఓఎంసీ కేసులో సీబీఐని ప్రశ్నించిన హైకోర్టు

ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి క్వాష్‌ పిటిషన్‌పై విచారణ


హైదరాబాద్‌, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించిన కేవీపీ రామచంద్రరావు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారా? అని హైకోర్టు సీబీఐని ప్రశ్నించింది. ఓఎంసీ మైనింగ్‌ లీజులకు సంబంధించిన వ్యవహారంలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.


ఈ సందర్భంగా సీబీఐ న్యాయవాది కె.సురేందర్‌ వాదనలు వినిపిస్తూ... ఓఎంసీ మైనింగ్‌ లీజు అక్రమాల కేసులో ఐఏఎస్‌ శ్రీలక్ష్మి పాత్ర స్పష్టంగా ఉందని, ఆమెపై సీబీఐ నమోదుచేసిన కేసును కొట్టేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. లీజు కేటాయించే క్రమంలో శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ సందర్భంగా శశికుమార్‌ అనే సాక్షి స్టేట్‌మెంట్‌ను సీబీఐ న్యాయవాది ఽధర్మాసనానికి చదివి వినిపించారు. మైనింగ్‌ లీజు కోసం అప్పటి ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి వద్దకు వెళ్తే కేవీపీ రామచంద్రరావును కలవాలని ఆమె చెప్పారని సాక్షి వెల్లడించినట్లు తెలిపారు. లీజుకు సంబంధించిన ఇతర అంశాల్లో సహాయం చేయడానికి అప్పటి మైన్స్‌ డైరెక్టర్‌ రాజగోపాల్‌ను కూడా కలవాలని శ్రీలక్ష్మి చెప్పారని తెలిపారు. రూ.8 లక్షలు సమకూర్చాలని శ్రీలక్ష్మి కోరినట్లు సాక్షి వెల్లడించారని తెలిపారు. ఓఎంసీకి చెందిన గాలి జనార్ధన్‌రెడ్డికి లబ్ధి చేకూర్చేందుకు ఇతర దరఖాస్తులను శ్రీలక్ష్మి తొక్కిపెట్టారని తెలిపారు.


ఈ దశలో జోక్యం చేసుకున్న ఽధర్మాసనం... కేవీపీ స్టేట్‌మెంట్‌ను సీబీఐ రికార్డు చేసిందా? అని  ప్రశ్నించింది. రికార్డు చేయలేదని సీబీఐ న్యాయవాది సమాధానం ఇచ్చారు.  శ్రీలక్ష్మి చట్టం ప్రకారం వ్యవహరించారని న్యాయవాది రాఘవాచార్యులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారమే కేటాయింపులు జరిగాయని, పిటిషనర్‌పై నమోదైన కేసును కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. విచారణను కోర్టు గురువారానికి వాయిదావేసింది.


Updated Date - 2021-12-09T08:54:55+05:30 IST