టీ-రాజకీయాల్లో వేలు పెట్టను!
ABN , First Publish Date - 2021-07-09T07:45:23+05:30 IST
ఒకవైపు చెల్లెలు షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్న సమయంలోనే... ఆమె సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు
పొరుగు రాష్ట్రాలతో విభేదాలు కోరుకోలేదు
పాలకుల మధ్య సఖ్యత ఉండాలి
ఇష్టానుసారం తెలంగాణ మంత్రుల మాటలు
విభజన తర్వాత 3 ప్రాంతాలకూ నీటి కేటాయింపులు
సీమకు 146 టీఎంసీలు, కోస్తాకు 367 టీఎంసీలు తెలంగాణకు 298 టీఎంసీలు కేటాయించారు
రెండు రాష్ట్రాలు, కేంద్రం సంతకాలు చేశాయి
800 అడుగుల్లోపే తెలంగాణ నీళ్లు తీసుకుంటోంది
796 అడుగుల్లోనూ విద్యుదుత్పత్తి చేస్తున్నారు
అందుకే మేమూ రాయలసీమ లిఫ్టు పెట్టాం
మా వాటా నీటిని మేం వాడుకుంటే తప్పేంటి?
తెలంగాణకు సీఎం జగన్ ప్రశ్న
మీకు (తెలంగాణకు) కేటాయించిన నీటిని శ్రీశైలంలో 800 అడుగుల్లోపు వాడుకోవడం మీకు తప్పు కానప్పుడు.. అదే 800 అడుగుల్లో మేం కూడా రాయలసీమ లిఫ్టు పెట్టి మాకు హక్కుగా ఇచ్చిన నీటిని వాడుకుంటే తప్పేముంది?
- సీఎం జగన్
అనంతపురం/కడప, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఒకవైపు చెల్లెలు షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్న సమయంలోనే... ఆమె సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ రాజకీయాల్లో నేను వేలు పెట్టలేదు. ఇకపైనా పెట్టను’ అని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల పాలకుల మధ్య సఖ్యత ఉండాలంటూ ఈ మాటలు చెప్పినప్పటికీ... సరిగ్గా తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ ఆవిర్భావ సమయంలోనే జగన్ ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. గురువారం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా రాయదుర్గంలో, కడప జిల్లా పులివెందులలో జరిగిన రైతు దినోత్సవ బహిరంగ సభల్లో జగన్ మాట్లాడారు. ‘‘ఏ ఒక్క పొరుగు రాష్ట్రంతో విభేదాలు పెట్టుకోం. ఎవరితోనైనా సత్సంబంధాలు ఉండాలనే కోరుకుంటాం. పక్క రాష్ట్రంలో, ఇక్కడ ప్రజలు చల్లగా బాగుండాలని.. అలా ఉండాలంటే పాలకుల మధ్య సఖ్యత ఉండాలి. అందుకే తెలంగాణ రాజకీయాల్లో నేను వేలు పెట్టలేదు. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లోనూ వేలు పెట్టలేదు. రాబోయే రోజుల్లో కూడా పెట్టను’’ అని జగన్ తెలిపారు. సఖ్యతతో సమస్యలను పరిష్కరించుకోవాలన్నదే తన అభిమతమని చెప్పారు.
మా నీళ్లే వాడుకుంటాం...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ప్రస్తావించకుండానే... జగన్ ‘జలజగడం’పై స్పందించారు. కృష్ణా జలాల వాడకంపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణల కలయిక అని, దశాబ్దాల తరబడి మూడు ప్రాంతాల మధ్య నీటి కేటాయింపులు ఆ మేరకు ఉన్నాయని.. రాష్ట్రం విడిపోయిన తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి తెలంగాణ, ఏపీ, కేంద్ర ప్రభుత్వం కలిసి సంతకాలు చేశాయని గుర్తుచేశారు. 811 టీఎంసీల్లో.. సీమకు 146 టీఎంసీలు, కోస్తాకు 367 టీఎంసీలు, తెలంగాణకు 298 టీఎంసీలు కేటాయించారన్నారు. ‘దేవుడి దయతో ఈ రెండేళ్లు మంచి వర్షాలు కురిశాయి. ఈ రెండేళ్లను పక్కనబెట్టి.. 20 ఏళ్ల లెక్కలను చూస్తే... శ్రీశైలంలో 881 అడుగులపైన నీళ్లు కేవలం 20, 25 రోజులు ఉన్నాయని చెప్పలేని పరిస్థితి ఉంది. మరోవైపు తెలంగాణ లోని పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి కెపాసిటీ పెంచి ప్రస్తుతం నీళ్లు వాడుకుంటున్నారు. 800 అడుగులలోపే నీళ్లు తీసుకునే పరిస్థితి ఆ రాష్ట్రానికి ఉంది. 796 అడుగుల్లోనే కరెంటును ఉత్పత్తి చేస్తోంది. 800 అడుగుల్లోపు మీకు కేటాయించిన నీటిని వాడుకోవడం మీకు తప్పు లేనప్పుడు.. అదే 800 అడుగుల్లో మేం కూడా రాయలసీమ లిఫ్టు పెట్టి మాకు కేటాయించిన నీటిని వాడుకుంటే తప్పేముంది’ అని ప్రశ్నించారు. రైతు ఎక్కడున్నా.. రైతేనన్నారు.
నీళ్లు ఎవరికైనా ప్రియమేనని.. అక్కడి వాళ్లు బతకాలి... మనం కూడా బతకాలని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు... పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను కడుతుంటే ఆయన గాడిదలు కాస్తున్నారా అని ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి అంతకు ముందు రాయదుర్గం మార్కెట్ యార్డులో ఉన్న వైఎ్‌సఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ సెంటర్, కస్టమ్ హైరింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం తనకెంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతన్నలకు మరింత మేలు చేకూర్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే పెట్టుబడి సాగు కింద రూ.13,500 నేరుగా రైతుల ఖాతాలకు జమ చేస్తున్నామన్నారు. రెండేళ్ల కాలంలో 52.38 లక్షల మంది రైతులకు రూ.17,987 కోట్లు ఇచ్చామన్నారు.
పులివెందుల అభివృద్ధికి 1160.19 కోట్లు
పేద పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యానికి అనుగుణంగా వారిని తీర్చిదిద్ది ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. పులివెందులతో పాటు రాష్ట్రంలో 26 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి కేంద్రానికి రూ.35 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే పులివెందులను ఆదర్శ పట్టణంగా మార్చేందుకు రూ.650.19 కోట్లతో పనులు, రూ.450 కోట్ల వాటర్‌గ్రిడ్ తదితర పనులకు శంకుస్థాపన చేశారు. రూ.27 కోట్లతో నిర్మించిన నల్లచెరువుపల్లె 132 సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ.. నీటి కష్టాలు తీర్చేందుకు రూ.5వేల కోట్లతో చేపట్టిన గాలేరు-నగరి, హంద్రీనీవా లిఫ్ట్ పనులను 2024లోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పులివెందుల సభ అనంతరం ఇడుపులపాయకు చేరుకుని సతీమణి భారతితో కలిసి వైఎ్‌సఆర్ ఘాట్‌లో రాజశేఖర్‌రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాయదుర్గం సభలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, మాలగుండ్ల శంకర్‌నారాయణ, గుమ్మనూరు జయరాం, సీదిరి అప్పలరాజు.. పులివెందుల సభలో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, మంత్రులు ఆదిమూలపు సురేశ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి.. స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.