మళ్లీ రాజమండ్రి జైలుకు ధూళిపాళ్ల
ABN , First Publish Date - 2021-05-13T08:57:34+05:30 IST
సంగం డెయిరీ అక్రమాల ఆరోపణ కేసులో అరెస్టై విజయవాడ ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు

విజయవాడలో వారం నుంచి కరోనా చికిత్స
నెగెటివ్ రావడంతో తిరిగి జైలుకు
వారం ఐసొలేషన్‌లో ఉంచాలని వైద్యుల సూచన
విజయవాడ(ఆంధ్రజ్యోతి), రాజమహేంద్రవరం సిటీ, మే 12: సంగం డెయిరీ అక్రమాల ఆరోపణ కేసులో అరెస్టై విజయవాడ ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. జైల్లో ఉండగా ఆయనతో పాటు సంస్థ ఎండీ గోపాలకృష్ణ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. నరేంద్రకు కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం అందించాలని ఆయన కుటుంబసభ్యులు కోర్టులో పిటిషన్ దాఖలుచేయడంతో విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. వారంరోజులు చికిత్స పొందిన నరేంద్రకు తిరిగి కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. దీంతో ఏసీబీ అధికారులు బుధవారం ఆయనను తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు అప్పగించారు. జైల్లో వారం రోజులు ఆయనను ఐసొలేషన్‌లో ఉంచాలని వైద్యులు సూచించారు. బుధవారం రాత్రి 8.45 గంటలకు ఆయనను సెంట్రల్ జైలుకు తీసుకొచ్చినట్టు జైలు సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. మరోపక్క నరేంద్రను కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, కస్టడీని రీకాల్ చేయాలని నరేంద్ర తరఫున న్యాయవాదులు మరో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ధూళిపాళ్ల అనారోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని ఆయన కుటుంబసభ్యులు హైకోర్టును కోరినట్టు తెలిసింది.