వరదల పాపం జగన్‌ సర్కారుదే!

ABN , First Publish Date - 2021-11-23T09:36:55+05:30 IST

ప్రభుత్వ వైఫల్యం వల్లే వరదల్లో భారీగా ఆస్తి నష్టం...ప్రాణ నష్టం వాటిల్లాయని తెలుగుదేశం పార్టీ విమర్శించింది.

వరదల పాపం జగన్‌ సర్కారుదే!

  • రాష్ట్రంలో కనీవినీ ఎరుగని ఆస్తి ప్రాణ నష్టం
  • ఆకాశంలో తిరిగి చేతులు దులుపుకొన్న సీఎం
  • వివేకా హత్యపై నుంచి దృష్టి మళ్లించడానికే ప్రతిపక్ష నేత చంద్రబాబుపై బూతుల దాడి
  • కొండపల్లి ఎన్నికలో వైసీపీ అడ్డగోలు వ్యవహారం
  • పంచాయతీల నిధులు 3.5 వేల కోట్లు గోల్‌మాల్‌
  • గెలిస్తే నెలలోనే పేదలఇళ్లకు ఉచిత క్రమబద్ధీకరణ
  • టీడీపీ వ్యూహ కమిటీ భేటీలో నిర్ణయం


అమరావతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైఫల్యం వల్లే వరదల్లో భారీగా ఆస్తి నష్టం...ప్రాణ నష్టం వాటిల్లాయని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినా, యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం  విఫలమైందనీ ఆ పార్టీ వ్యూహ కమిటీ సమావేశం ఆరోపించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఈ కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ‘ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఆకాశంలో తిరిగి చేతులు దులుపుకొన్నారు. ఇంత ప్రాణ నష్టం గతంలో ఎన్నడూ జరగలేదు’ అని విమర్శించింది. పార్టీ శ్రేణుల ద్వారా బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చింది. చంద్రబాబు ఈ నెల 23, 24 తేదీల్లో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని సమావేశం నిర్ణయించింది. అమరావతి రాజధానిపై సీఎం జగన్‌ వైఖరితో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆరోపించింది. వైఎస్‌ వివేకానంద రెడ్డిని ఆయన అల్లుడే చంపించాడని కట్టుకథలు అల్లిస్తూ, అసలు దోషులను కాపాడటానికి ప్రభుత్వంలోని పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా సమస్యలు, అవినీతి, వివేకా హత్య తదితర అంశాల నుంచి ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించడానికే చంద్రబాబుపై అధికారపక్ష సభ్యులు బూతుల దాడికి పాల్పడ్డారని నేతలు అభిప్రాయపడ్డారు.


వీటిపై ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. స్థానిక సంస్థలకు పదిహేనో ఆర్థిక సంఘం నుంచి అందిన రూ. మూడున్నర వేల కోట్లను ప్రభుత్వం వాటికి ఇవ్వకుండా దారి మళ్లించి వాడుకొందని  కమిటీ విమర్శించింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే పేదలకు వారి ఇళ్లను నెల రోజుల్లో ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని ఆ పార్టీ ప్రకటించింది. ‘‘వివిధ ప్రభుత్వాలు ఉచితంగా పంపిణీ చేసిన ఇళ్లను క్రమబద్ధీకరిస్తామంటూ వైసీపీ ప్రభుత్వం ఒక్కో పేద కుటుంబం నుంచి రూ.పది వేలు నుంచి ఇరవై వేలు వసూలు చేసి ఖజానా నింపుకోవాలని చూస్తోంది. మేం వస్తే ఉచితంగా చేస్తాం’’ అని ప్రకటించింది. కొండపల్లి మునిసిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో అధికార పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహ రిస్తోందని విమర్శించింది. కోరం ఉన్నా ఎన్నిక నిలిపివేయడంతోపాటు మెజారిటీలేని చోట తమ అభ్యర్థిని చైర్మన్‌ చేయాలని అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంద మండిపడింది. 


నేడు, రేపు వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

అమరావతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): వరదలు తీవ్రంగా ముంచెత్తిన ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మంగళ, బుధవారాల్లో పర్యటించనున్నారు. నష్టం తీవ్రంగా ఉన్నందువల్ల వచ్చి బాధితులను పరామర్శిస్తే బాగుంటుందని పార్టీ నేతలు కోరడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖరారైన కార్యక్రమం ప్రకారం మంగళవారం ఉదయం ఆయన కడప జిల్లాలో రాజంపేటకు చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం తిరుపతిలో పర్యటిస్తారు. ఆ రాత్రి అక్కడే బస చేసి బుధవారం నెల్లూరు జిల్లాకు చేరుకుంటారు.

Updated Date - 2021-11-23T09:36:55+05:30 IST