‘దసపల్లా’పై సొంత లా!

ABN , First Publish Date - 2021-06-21T08:45:57+05:30 IST

గజం రూ.1.5 లక్షలు పలికే 63 ఎకరాలు..పారిశ్రామిక అవసరాల కూడలి విశాఖలోనే ఈ భూములున్నాయి.

‘దసపల్లా’పై సొంత లా!

కోర్టు వివాదాలకు తమశైలిలో ‘పరిష్కారం’

దసపల్లాలో వేల కోట్ల విలువైన 63 ఎకరాలు

నిషేధ జాబితాలో ఉన్నా గతంలో కొనుగోళ్లు

‘ఆక్రమణ’లపై తొలుత వైసీపీయే ఫిర్యాదు

భూములు గుప్పిట్లోకి రాగానే గప్‌చుప్‌..

సిట్‌ నివేదికా పక్కనపెట్టి సెటిల్‌మెంట్‌

డెవలప్‌మెంట్‌కు మొత్తం భూములు

60:40 పద్ధతిలో ఫ్లాట్లు తీసుకునేలా డీల్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): గజం రూ.1.5 లక్షలు పలికే 63 ఎకరాలు..పారిశ్రామిక అవసరాల కూడలి విశాఖలోనే ఈ భూములున్నాయి. ఇంకేముంది.. వైసీపీ పెద్దలు దిగిపోయారు. మూడు దశాబ్దాలుగా నలుగుతున్న దసపల్లా హిల్స్‌ భూముల వివాదాన్ని తమకు అనుకూలంగా ‘పరిష్కరించ’డానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం కోర్టు వివాదంలో ఉన్న ఈ భూములపై ‘సొంత లా’ అమలుచేయడం మొదలుపెట్టారు. ఇక్కడి 63 ఎకరాల స్థలంలో భారీ అపార్ట్‌మెంట్లు 


నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఆ భూములు దక్కించుకున్న వారితో ఒక అవగాహనకు వచ్చి...అన్నీ ఓ బిల్డర్‌కు డెవల్‌పమెంట్‌కు ఇచ్చేలా ఒప్పించారు. అందులో వచ్చే ఫ్లాట్లను 60:40 నిష్పత్తిలో పంచుకునేలా ఒప్పందమూ చేసుకున్నారని సమాచారం. భూములు ఇచ్చిన వారికి 60 శాతం, వైసీపీ పెద్దలు, బిల్డర్‌కు 40 శాతం ఫ్లాట్లు దక్కేలా పక్కాగా ప్లాన్‌ చేశారు. అయితే, ఈ భూముల సర్వే నంబర్లన్నీ ప్రభుత్వ భూముల జాబితా 22-ఏలో (నిషేధ జాబితా) ఉన్నాయి. పైగా దానిపై సిట్‌కు ఫిర్యాదులు అంది.. వాటిపై దర్యాప్తు కూడా పూర్తయింది. అలాంటి భూములపై వైసీపీ నేతలు చూపిస్తున్న అమితాసక్తి విస్మయపరుస్తోంది. 

ఇదీ వివాదం..

దసపల్లా హిల్స్‌లోని సర్వే నంబర్లు 1027, 1028, 1196, 1197ల్లో సుమారు 63 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే సర్క్యూట్‌ హౌస్‌ ఉంది. ఇవి ప్రభుత్వ భూములుగా గుర్తించి, 22-ఏ జాబితాలో పెట్టారు. అయితే వి.కోటేశ్వరరావు అనే వ్యక్తి ఈ భూములు తనకు వారసత్వంగా వచ్చాయంటూ బిట్లు బిట్లుగా కొంత అమ్మేశారు. ఈ వివాదాలన్నీ కోర్టుకు చేరాయి. మధ్యలో చెముడు జమీందార్‌ రాణీ కమలాదేవి అవి తమ భూములని కోర్టును ఆశ్రయించారు. ఆమెకు అనుకూలంగా కొన్ని తీర్పులు వచ్చా యి. అయినా అవి 22-ఏ జాబితాలో ఉండడంతో రిజిస్ట్రేషన్ల శాఖ వాటిని రిజిస్టర్‌ చేయలేదు. దాంతో 300 గజాలు, 500 గజాలు, 1000 గజాలు చొప్పున కొనుక్కున్న కొందరు... కోర్టుకెళ్లి ఉత్తర్వులు తెచ్చి, గతంలో రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారు. వాటన్నింటికీ 2014లో అప్పటి కలెక్టర్‌ యువరాజ్‌ చెక్‌ పెట్టారు. మరోసారి వాటిని ప్రభుత్వ భూముల జాబితాలో చేర్చారు. ఆ తరువాత 2017లో విశాఖ నగరం, చుట్టుపక్కల ప్రభుత్వ భూముల ఆక్రమణ, రికార్డుల తారుమారు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దానిపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో దర్యాప్తు చేయించింది. సిట్‌ ఇచ్చిన నివేదికపై గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తగా మరో సిట్‌ వేసి ఆరు నెలల్లో నివేదిక ఇమ్మని ఆదేశించింది. ఆ తరువాత సిట్‌ గడువును పెంచుకుంటూ పోయింది. రెండేళ్లు అవుతోంది. సిట్‌ నివేదిక ఇవ్వలేదు. ఈలోగానే భూ ఆక్రమణదారులంటూ ప్రతిపక్ష నేతల ఆస్తులపై దా డులు చేసి స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు.   

ఫిర్యాదు చేసింది వైసీపీ ఎమ్మెల్యేనే..

అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏర్పాటు చేసిన సిట్‌ బృందం వద్దకు వెళ్లి... దసపల్లా భూముల అక్రమాలపై ప్రత్యేకంగా ఫిర్యాదు చేశారు. డిసెంబరు4, 2019న ఆయన వారిని కలిసి దసపల్లా భూముల్లో ఆక్రమణలపై  సమగ్ర దర్యాప్తు చేయాలని వినతిపత్రం అందించారు. ఇప్పుడు ఆ భూములే.. వైసీపీ అనుకూల వర్గం చేతిలోకి రావడంతో ఎవరూ మాట్లాడటం లేదు. గతంలో కొనుక్కొన్నవారంతా మూకుమ్మడిగా ఇక్కడి వైసీపీ పెద్దను ఆశ్రయించారు. అంతా కలిసి డెవల్‌పమెంట్‌కు ఇస్తే పెద్ద బిల్డర్‌ ద్వారా హైరైజ్డ్‌ అపార్ట్‌మెంట్‌ కట్టవచ్చునని, 60:40 నిష్పత్తిలో పంచుకుందామనే ప్రతిపాదనకు ఇరువర్గాలూ అంగీకారానికి వచ్చాయి.

Updated Date - 2021-06-21T08:45:57+05:30 IST