తూర్పు తీరానికి తుఫాన్‌ ముప్పు!

ABN , First Publish Date - 2021-05-21T09:10:55+05:30 IST

తూర్పు తీరంలో బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఒడిసా, పశ్చిమ బెంగాల్‌కు తుఫాన్‌ ముప్పు పొంచి ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితు ల నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాన్‌

తూర్పు తీరానికి తుఫాన్‌ ముప్పు!

రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం 

పెను తుఫాన్‌గా మారే అవకాశం 

ఒడిసా, బెంగాల్‌పై ఎక్కువ ప్రభావం 

నేడు అండమాన్‌కు నైరుతి పవనాలు

48 గంటల్లో రాష్ట్రానికి వర్షసూచన 


అమరావతి/విశాఖపట్నం/న్యూఢిల్లీ, మే 20 (ఆంధ్రజ్యోతి): తూర్పు తీరంలో బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఒడిసా, పశ్చిమ బెంగాల్‌కు తుఫాన్‌ ముప్పు పొంచి ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితు ల నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాన్‌ తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరించారు. గతేడాది మే నెలలో పశ్చిమ బెంగాల్‌, బం గ్లాదేశ్‌కు తీవ్ర నష్టం కలిగిన ‘యాంపిన్‌’ స్థాయిలో కాకపోయినా, దీని ప్రభావం ఎక్కువగానే ఉంటుందని విశ్లేషించారు. ఈ నెల 22న ఉత్తర అండమాన్‌ సముద్రం, దానికి ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. మరింత బలపడి 24 నాటికి తుఫాన్‌గా మారే అవకాశముంది. ఆ తరువాత ఉత్తర వాయవ్యం దిశగా పయనించి ఈ నెల 26 కల్లా ఉత్తర ఒడిసా, పశ్చిమ బెంగాల్‌ మధ్య తీరానికి దగ్గరగా వస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 27న తుఫాన్‌ తీరం దాటే అవకాశముందని అంచనా వేసింది. తుఫాన్‌గా మారిన తరువాత రెండు, మూడు రోజుల వ్యవధిలో తీరం దాటే అవకాశం ఉంది. దీంతో అతి తీవ్ర తుఫాన్‌ లేదా పెను తుఫాన్‌గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నా యని వాతావరణ శాఖ తెలిపింది. కాగా నైరుతి రుతుపవనాల ఆగమనానికి వాతావరణం అనుకూలంగా మారింది. శుక్రవారం అండమాన్‌ సముద్రం పరిసరాల్లోకి నైరుతి ప్రవేశించే అవకాశముంది. 


నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు 

రుతుపవనాల ప్రభావంతో కోస్తాంధ్రలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గురువారం కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో తేలికపాటి జల్లులు పడ్డాయి.

Updated Date - 2021-05-21T09:10:55+05:30 IST