అభివృద్ధికి కోతలు...సంక్షేమ పూతలు!

ABN , First Publish Date - 2021-05-21T10:22:35+05:30 IST

కరోనా నేపథ్యంలో రెండు రోజులు మాత్రమే నిర్వహిస్తున్న ‘అసెంబ్లీ ఎక్స్‌ప్రెస్‌’ తొలిరోజున... మంగళవారం బడ్జెట్‌ బండి దూసుకొచ్చింది. ఇది... 2,24,789 కోట్ల బడ్జెట్‌! గత వార్షిక పద్దుతో పోల్చితే దాదాపు 3186 వేల కోట్లు తక్కువే! మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులతోపాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాటలు పరిచే రంగాలకు గతంకంటే కేటాయింపులు

అభివృద్ధికి కోతలు...సంక్షేమ పూతలు!

  • సామాజిక సేవలకు పెద్ద పీట!
  • సాధారణ సేవలు 30%
  • సామాజిక సేవలు 43%
  • ఆర్థికసేవలు 27%

(అమరావతి - ఆంధ్రజ్యోతి)
కరోనా నేపథ్యంలో రెండు రోజులు మాత్రమే నిర్వహిస్తున్న ‘అసెంబ్లీ ఎక్స్‌ప్రెస్‌’ తొలిరోజున... మంగళవారం బడ్జెట్‌ బండి దూసుకొచ్చింది. ఇది... 2,24,789 కోట్ల బడ్జెట్‌! గత వార్షిక పద్దుతో పోల్చితే దాదాపు 3186 వేల కోట్లు తక్కువే! మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులతోపాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాటలు పరిచే రంగాలకు గతంకంటే కేటాయింపులు పెంచడం సహజం! కానీ... ఈసారి అన్నింటికీ కోతలే! వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, కార్మికులు, విద్య, యువత... ఒక్కటేమిటి! అన్ని విభాగాలకు నిధులను తెగ్గోశారు. ప్రభుత్వానికి ప్రియమైన, వ్యక్తిగత లబ్ధిని చేకూర్చే ‘పంపకాల’కు మాత్రం భారీగా పెంచేశారు. ‘మాకు అభివృద్ధి ముఖ్యం కాదు. నేరుగా నగదు పంచి ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవడమే ముఖ్యం’ అని తేల్చేశారు.

పంచడమే అజెండా
గత ఏడాది మొత్తం బడ్జెట్‌లో ‘సంక్షేమం వాటా’ 6.20 శాతం. ఇప్పుడు అది 193.12 శాతానికి పెరిగి... 18.44 శాతానికి చేరింది. ‘ఇంతిస్తున్నాం... అంతిస్తున్నాం’ అని ప్రకటనల ద్వారా ప్రజలకు చెప్పుకోవాలి కదా! అందుకే... సమాచార శాఖకు కేటాయింపులను 39 శాతం పెంచారు. ఇక... సామాజిక భద్రతకూ కేటాయింపులు 28.5 శాతం పెరిగాయి. సంక్షేమానికి కేటాయింపులు పెంచడం స్వాగతించదగిన విషయమే! కానీ... సంక్షేమం, అభివృద్ధి ఒక ఇరుసుకు రెండు చక్రాల వంటివనే సూత్రాన్ని మరిచిపోయారు. రాష్ట్రానికి ఆస్తులు చేకూర్చి, సంపద సృష్టించే సమగ్రాభివృద్ధికి బడ్జెట్‌లో మంగళం పలికారు. ఆర్థిక సేవలు పెరుగుతున్న కొద్దీ ప్రజా సంక్షేమం ప్రాఽధాన్యం పెరగాలి. కానీ దీనికి భిన్నంగా ఆర్థిక సేవలకు కోతపెట్టారు. గత ఏడాది ఈ రంగం వాటా 37.80 శాతం ఉండగా... ఇప్పుడది మైనస్‌ 28.57కు తగ్గిపోయింది. గత బడ్జెట్‌తో పోల్చితే వ్యవసాయానికి 28 శాతం, సాగునీటికి 10 శాతం, సాధారణ విద్యకు 23 శాతం, క్రీడలు-యువజన సేవలకు 54 శాతం నిధులు (మైనస్‌) తగ్గిపోయాయి. చివరికి... దేశానికి పట్టుగొమ్మలైన పల్లెల అభివృద్ధికి కూడా 48 శాతం కేటాయింపులు తగ్గించారు. ఇలా భారీగా కోతకు గురైన రంగాలు అనేకం ఉన్నాయి. ఇదిలా ఉంటే, సంక్షేమ పథకాల ద్వారా నగదు బదిలీ లేదా ప్రత్యక్ష ప్రయోజనం రూపంలో ప్రభుత్వం అందించే సొమ్మును భారీగా పెంచారు. ఇది గత ఏడాది 24,719 కోట్లు. ఇప్పుడు మరో 12,949 కోట్లు చేర్చి 37,659 కోట్లు చేశారు.

పన్నులు తగ్గినా...అంచనాల్లో అతి
2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి సొంతంగా పన్నుల ఆదాయం రూ.58,107 కోట్లు వచ్చింది.  అంతకుముందు ఐదేళ్లలో ప్రతి ఏటా రూ.10 వేల కోట్ల దాకా పెరుగుదల నమోదైంది. కానీ... వైసీపీ వచ్చిన తొలి ఏడాది సొంత పన్నుల ఆదాయం రూ.57,446 కోట్లు వచ్చింది. అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం గతంకంటే పడిపోయిందన్న మాట! అయినప్పటికీ... ఈ సంవత్సరం సొంత పన్నుల ఆదాయం రూ.70,679 కోట్లు వస్తుందని చూపడం గమనార్హం. అసలు విషయం ఏమిటంటే... కరోనా కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండున్నర నెలల్లో వచ్చిన సొంత పన్నుల ఆదాయం కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమే!

ఐదేళ్లలో భారీ లోటుపోటు
గత ఐదేళ్లలో ఎన్నడూలేని స్థాయిలో రెవెన్యూ లోటు నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం రెవెన్యూ లోటు ఏకంగా రూ.26,646 కోట్లు ఉందని సవరించిన అంచనాల్లో పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో రెవెన్యూ లోటు రూ.18,434 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 

అభివృద్ధికి నామమాత్రం
అభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం 2019-20లో టీడీపీ ప్రభుత్వం రూ.19,976 కోట్లు ఖర్చు చేసింది. ఈ  పద్దు కింద వైసీపీ సర్కారు తన తొలి ఏడాది పెట్టిన ఖర్చు రూ.12,845 కోట్లు మాత్రమే! అవి కూడా గత ప్రభుత్వ హయాంలో విదేశీ రుణ సౌకర్యంతో ప్రారంభమై, పురోగతిలో ఉన్న ప్రాజెక్టులే ఉన్నాయి. వెరసి... గత ఏడాదిలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ఏపీ ప్రభుత్వం చేపట్టలేదు. సొంతంగా రూపాయి కూడా ఖర్చు చేయలేదు. పరిస్థితి ఇలా ఉండగా... ఈ ఏడాది మూలధన వ్యయం కింద రూ.29,907 కోట్లు ఖర్చు చేస్తామంటూ భారీ అంచనాలు చూపించారు. 

అప్పుల్లో భారీ జంప్‌
చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి ప్రభుత్వ అప్పు (ప్రజారుణాలు) రూ.2,57,509 కోట్లు! వైసీపీ పాలనలో ఏడాది ముగిసే నాటికి అది రూ.3,02,202 కోట్లకు చేరింది. అంటే ఏడాది కాలంలో కేవలం ప్రజా రుణాల ద్వారా ఏకంగా 45,000 కోట్ల అప్పులు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరికి ఈ అప్పులు రూ.3,48,998 కోట్లకు చేరుకుంటాయని అంచనాలు వేశారు. అంటే.... అంచనా వేసిన జీడీపీలో ఈ అప్పులు 34.55 శాతం. దీంతోపాటు వివిధ కార్పొరేషన్లు, సంస్థలు బ్యాంకుల నుంచి అప్పులు చేసుకునేందుకు ప్రభుత్వం హామీలిచ్చింది. వివిధ సంస్థలు, కార్పొరేషన్లు మొత్తం రూ.67,171 కోట్ల అప్పులు చేశాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం రెవెన్యూ ఆదాయంలో ఇవి 60.49 శాతంగా ఉన్నాయి. 

తిరోగామి బడ్జెట్‌ 
సాధారణంగా గత బడ్జెట్‌కంటే కొత్త బడ్జెట్‌ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఈసారి బడ్జెట్‌ మాత్రం తిరోగమనంలో ఉంది. గత ఏడాది బడ్జెట్‌ కంటే రూ.3186 కోట్లు తక్కువకు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రకటించారు. వాస్తవ పరిస్థితులను గమనిస్తే... ఇది కూడా అంకెల గారడీ అని, నేల విడిచి సాము అని స్పష్టమవుతుంది. కరోనా దెబ్బతో ఆర్థికం అతలాకుతలమైంది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు ఓటాన్‌ అకౌంట్‌లో రూ.70,990 కోట్లు కేటాయించారు. కానీ... ఇందులో కేవలం 24 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలిగారు. అంటే... అంచనాల్లో మూడో వంతు మాత్రమే! అయినప్పటికీ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి బడ్జెట్‌లో భారీ అంకెలను ప్రతిపాదించారు. నిజానికి... గత ఏడాది కరోనా ప్రభావం లేకపోయినప్పటికీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో బడ్జెట్‌ ఖర్చు పెట్టలేకపోయింది. ఉద్యోగులకు వేతనాలు, సంక్షేమ పథకాల కోసం రూ.42,000 కోట్లు, కొన్ని బిల్లుల చెల్లింపులు మినహా రాష్ట్ర అభివృద్ధి కోసం గత బడ్జెట్‌లో చెప్పుకోదగిన ఖర్చులేమీ లేవు.

కేంద్రం నుంచి అంతా?
రెవెన్యూ ఆదాయంలో కేంద్రం నుంచి పన్నుల్లో వాటాగా రూ.32,237.68 కోట్లు, రాష్ట్ర సొంత పన్నుల ద్వారా 70,679 కోట్లు, డిపాజిట్లపై వడ్డీ రూపంలో రూ.17.32 కోట్లు, పన్నేతర, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు కలుపుకొని రూ.59,026 కోట్లు వస్తాయని అంచనా వేశారు.  గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి పన్నుల వాటాగా రూ.28,224 కోట్లు మాత్రమే వచ్చాయి. కరోనా ప్రభావం లేనప్పుడే పన్నుల వాటా తగ్గినప్పుడు కరోనా ప్రభావంతో సతమతమవుతున్న కేంద్రం నుంచి ఈ ఏడాది రాష్ట్రం రూ.32232 కోట్ల వాటా ఆశిస్తుండగం గమనార్హం! కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌పై కూడా ఆర్థిక శాఖ ‘అతి’ ఆశలు పెట్టుకుంది. వాస్తవాలు మరిచి విన్యాసాలు చేసింది. గత బడ్జెట్‌లో ఈ పద్దు కింద రూ.61 వేల కోట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ, వచ్చింది రూ.21,875 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇదీ వాస్తవం! దీనిని కూడా గ్రహించకుండా... ఈసారి  కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా రూ.53,175 కోట్లు వస్తాయని చెప్పడం విశేషం.

కేటాయింపులు 

ఇళ్ల స్థలాలకు 3000(అంకెలు రూ. కోట్లలో)
అమరావతి, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): నవరత్నాల కింద పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల కోసం తాజా బడ్జెట్‌లో రూ.3వేల కోట్లు ప్రతిపాదించారు. గతేడాది రూ.5వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఆ సొమ్మును భూ సేకరణకు వినియోగించింది. తాజాగా కేటాయించిన రూ.3వేల కోట్లను ఇళ్ల స్థలాలకు  భూ సేకరణ, లే అవుట్ల అభివృద్ధికి వినియోగించనున్నారు. ఇదిలావుంటే, రాష్ట్రంలో సమగ్ర భూసర్వే కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు ప్రతిపాదించింది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో రీ సర్వే పైలెట్‌ ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా రాష్ట్రవ్యాప్తంగా రీ సర్వే చేపట్టాలని ఇటీవలే సర్వేశాఖను ప్రభుత్వం ఆదేశించింది. అయితే,  రీ సర్వేకు ఉపయోగపడే రోవర్లు, కార్స్‌ టెక్నాలజీ వినియోగానికి కనీసం రూ.500 కోట్లపైనే వ్యయం కానుందని అధికారులు ప్రతిపాదించారు.

ఆరోగ్యశ్రీకి 2100
వైద్య ఆరోగ్యశాఖకు గతేడాదితో పోల్చితే 20.75 కోట్లు మాత్ర మే అదనపు కేటాయింపులు చేసింది. గతేడాది రూ.11,399.23 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.11,419.98 కోట్లతో సరిపెట్టింది. ఇందులో అత్యధికంగా ఆరోగ్యశ్రీకి రూ.2,100 కోట్లు, నాడు-నేడుకు రూ.1528 కోట్లు, మెడికల్‌ కాలేజీలకు రూ.1122 కోట్లు తదితరాలకు సర్దుకుంటూ వచ్చింది. 108, 104 వాహనాలకు మాత్రం భారీగా కేటాయింపులు చేశారు. 108 అంబులెన్సుల కోసం రూ.266.17 కోట్లు, 104 వాహనాల నిర్వహణకు రూ.204.12 కోట్లు కేటాయించారు. ఆశా వర్కర్ల జీతాలు, ఇతర పథకాలకు మరో రూ.2,294 కోట్లు కేటాయించారు. 

అనంత-అమరావతి ఎక్స్‌ప్రె్‌సవేకు 100
రాయలసీమను అమరావతికి అనుసంధానం చేసే అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారికి బడ్జెట్‌లో రూ.100 కోట్లు ప్రతిపాదించారు. ఈ ఏడాది రోడ్లు-భవనాల శాఖ పరిధిలో 1,900 కి.మీ. జిల్లా ప్రధాన రహదారులు, 100 కి.మీ. జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని బడ్జెట్‌లో సర్కారు ప్రతిపాదించింది. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి రూ.25 కోట్లు ప్రతిపాదించారు. రవాణా, రోడ్లు-భవనాల శాఖలకు కలిపి రూ. 4,500 కోట్లపైనే ప్రతిపాదించారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఎల్‌డబ్ల్యూఈ పనులకు రూ.125 కోట్లు, ఎన్‌డీబీ(న్యూడెవల్‌పమెంట్‌ బ్యాంకు) రుణంతో చేపట్టే మండ ల్‌ కనెక్టివీటీ, బ్రిడ్జిల నిర్మాణ ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా కింద రూ.273 కోట్లు ప్రతిపాదించారు.

విపత్తుల నిర్వహణకు 2000
వైఎస్సాఆర్‌ ఉచిత పంటల బీమా పథకం- ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్‌ కింద గుర్తించబడిన అన్ని పంటలకు రైతువాటా ప్రీమియం చెల్లించడానికి ఈ ఏడాది రూ.500కోట్లు ప్రతిపాదించారు. వడ్డీ లేని రుణాల కింద రూ.1,100 కోట్లు కేటాయించారు. వ్యవసాయ మిషన్‌ నిర్వహణకు రూ.2.61కోట్లు, రాయితీ విత్తనాలకు రూ.200కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.207.83కోట్లు, సమీకృత వ్యవసాయానికి రూ.141.73కోట్లు, ప్రకృతి సేద్యానికి రూ. 225.51 కోట్లు, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.402 కోట్లు కేటాయించారు. విపత్తుల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఈ ఏడాది రూ.2వేల కోట్లు సహాయ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ బడ్జెట్‌లో పొందుపర్చారు. 

పాడి, మత్స్య రంగాలకు 1279
పశుగణాభివృద్ధి, మత్స్యరంగాలకు రూ. 1,279.77 కోట్లు ప్రతిపాదించారు. రూ.50కోట్లతో పశుగణ నష్టపరిహార నిధిని ఏర్పాటు చేశారు. ‘వైఎస్సాఆర్‌ మత్స్యకార భరోసా’, ఇతర పథకాల కింద మత్స్యశాఖకు 299.27కోట్లు, సహకార శాఖకు రూ.248.88 కోట్లు, వ్యవసాయ విద్యుత్‌ రాయితీకి రూ.4450 కోట్లు, వ్యవసాయ అనుబంధ ఉపాధి హామీ పథకం కింద 6,270 కోట్లు  ప్రతిపాదించారు.

కోతలు

ప్రజాపంపిణీకి 20% కోత
అమరావతి, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): ప్రజాపంపిణీ వ్యవస్థకు ప్రభుత్వం నిధుల కోత పెట్టింది. గతేడాదితో పోలిస్తే 20శాతం తగ్గించి నిధులు ప్రతిపాదించింది. 2019-20లో రూ.4429 కోట్లు కేటాయిస్తే, ఈ సంవత్సరానికి రూ.3520 కోట్లే కేటాయించింది. అందులో రూ.3వేల కోట్లు బియ్యంపై రాయి తీ, రూ.100 కోట్లు బియ్యం సంచులకు అని వివరించింది. ప్యాకింగ్‌ సంచుల స్థానంలో తీసుకొస్తున్న వాహనాలతో డోర్‌ డెలివరీ విధానానికి వాహనాల కొనుగోలుకు దాదాపు రూ.400 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. కానీ బడ్జెట్‌లో వాటికి కేటాయింపుల గురించి ప్రస్తావించలేదు.  

పారిశ్రామికంలో 20% తగ్గింపు
తాజా బడ్జెట్‌లో పారిశ్రామిక రంగానికి గతేడాదితో పోలిస్తే దాదాపు 20శాతం కేటాయింపులు తగ్గిపోయాయి.  పరిశ్రమలు, వాణిజ్యానికి 2019-20 బడ్జెట్‌లో రూ.3,416 కోట్లు కేటాయించగా... ఈ బడ్జెట్‌లో రూ.2,705.14 కోట్లే కేటాయించారు. ఐటీ రంగంలో అయితే ఏకంగా సగానికిపైగా కోత పడింది. గత బడ్జెట్‌లో రూ.453 కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది రూ.197.37 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు. 

పాతాళానికి పర్యాటకం
బడ్జెట్‌లో పర్యాటక శాఖకు గతేడాది రూ.240.61 కోట్లు కేటాయించగా, ఇప్పుడు రూ.86.45 కోట్లతో సరిపెట్టారు. పురావస్తు శాఖకు రూ.10.18 కోట్లు, శిల్పారామానికి రూ.2.38 కోట్లు, భవానీ ఐల్యాండ్‌కు రూ.5 కోట్లు కేటాయించారు. క్రీడలకు కూడా ప్రభుత్వం పాతరేసింది. గతేడాది క్రీడలు, యువజన సంక్షేమ శాఖకు కలిపి రూ.316.35 కోట్లు కేటాయించగా, ఇప్పుడు రూ.187.20 కోట్లకు పరిమితం చేసింది. 

కల్యాణ కానుకకు కేటాయింపుల్లేవ్‌!
‘వైఎ్‌సఆర్‌ కల్యాణ కానుక’కు బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. టీడీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ‘చంద్రన్న పెళ్లికానుక’ పథకాన్ని ఈ  ప్రభుత్వం పేరుమార్చి ‘వైఎ్‌సఆర్‌ పెళ్లికానుక’గా నామకరణం చేసింది. కొత్తగా పెళ్లి అయిన ఎస్సీ, ఎస్టీ వధువులకు రూ.లక్ష కానుక ఇవ్వనున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. కానీ ఈ పథకానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. 

బడ్జెట్‌ సమగ్ర స్వరూపంఎక్స్‌ప్రెస్‌ పద్దు
వివరం 2018-19 2019-20 2019-20 2020-21
(బ.అం) (స.అం) (బ.అం) 
1) రెవెన్యూ వసూళ్లు 1,14,670 1,78,697 1,10,871 1,61,958
ఎ)పన్ను ఆదాయం 58,107 75,438 57,447 70,680
బి) పన్నేతర ఆదాయం 4,397 7,355 3,324 5,866
               సి) కేంద్ర పన్నుల్లో వాటా 32,710 34,833 28,224 32,237
డి) గ్రాంట్లు 19,457 61,071 21,876 53,175
2) మూలధన వసూళ్లు 50,170 49,277 63,817 62,831
3) మొత్తం వసూళ్లు 1,64,841 2,27,974 1,74,688 2,24,789
4) రెవెన్యూ వ్యయం 1,28,569 1,80,475 1,37,518 1,80,392
5) మూలధన వ్యయం 19,976 32,293 12,845 29,907
6) రుణాలు, వడ్డీ చెల్లింపు 13,570 13,417 19,037 13,935  
7) మొత్తం వ్యయం 1,63,959 2,27,974 1,74,757 2,24,789
8) రెవెన్యూ లోటు -13,898 -1,778 -26,646 -18,434
9) ద్రవ్య లోటు -35,440 -35,260 -40,493 48,295

Updated Date - 2021-05-21T10:22:35+05:30 IST