చిత్తూరు జిల్లాలో కర్ఫ్యూ పెంపు

ABN , First Publish Date - 2021-05-30T09:27:49+05:30 IST

చిత్తూరు జిల్లాలో కర్ఫ్యూ వ్యవధి పొడిగిస్తూ అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపు ఇవ్వాలని నిర్ణయించారు

చిత్తూరు జిల్లాలో కర్ఫ్యూ పెంపు

ఉదయం 6 నుంచి 10 గంటల వరకే సడలింపు

1 నుంచి 15వ తేదీ వరకు అమలు

రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ఠ నిఘా: మంత్రులు


తిరుపతి, మే 29(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో కర్ఫ్యూ వ్యవధి  పొడిగిస్తూ అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపు ఇవ్వాలని  నిర్ణయించారు. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను కఠినంగా అమలు చేయనున్నారు. జూన్‌ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దీన్ని పటిష్ఠంగా అమలు చేయాలని శనివారం తిరుపతిలో జరిగిన కొవిడ్‌ జిల్లా సమీక్షలో మంత్రులు నారాయణ స్వామి, పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్‌ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. తమిళనాడు, కర్ణాటకలకు సరిహద్దులో ఉండటం, ఆ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉండడం, ఆ రాష్ర్టాల నుంచి జిల్లాకు వస్తున్నవారి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెంది, కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వారు తెలిపారు. దీని నియంత్రణకు చెక్‌పోస్టుల వద్ద మరింత పకడ్బందీగా నిఘాను ఏర్పాటుచేయాలని మంత్రులు చెప్పారు. కాగా, ఆనందయ్య మందుపై ఆయుష్‌ తుది నివేదికను ఇంకా ఇవ్వలేదని మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మీడియాకు చెప్పారు. నివేదికలన్నీ వచ్చిన తర్వాత అప్పటి కొవిడ్‌ పరిస్థితుల ఆధారంగా మందుపంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. 

Updated Date - 2021-05-30T09:27:49+05:30 IST