విశాఖలో క్రూయిజ్ బెర్త్
ABN , First Publish Date - 2021-12-09T21:40:15+05:30 IST
ఏపీలోని విశాఖలో క్రూయిజ్ బెర్త్‌ను నిర్మించనున్నట్లు కేంద్రం

న్యూఢిల్లీ: ఏపీలోని విశాఖలో క్రూయిజ్ బెర్త్‌ను నిర్మించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గురువారం రాజ్యసభలో వెల్లడించారు. విజయసాయి ప్రశ్నకు మంత్రి రాత పూర్వకంగా జవాబిచ్చారు. సాగరమాల పథకం కింద విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌లోని ఔటర్ హార్బర్లో క్రూయిజ్ టెర్మినల్ బెర్త్, టెర్మినల్ భవనం నిర్మాణం కోసం పోర్టులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ 96 కోట్లు కేటాయించిందన్నారు.
క్రూయిజ్ కమ్ కోస్టల్ కార్గో టెర్మినల్ నిర్మాణం కోసం పర్యాటక శాఖ 38 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. పర్యాటక రంగాన్ని ప్రభావితం చేసే అంశాల్లో క్రూయిజ్ టూరిజం (నౌకా పర్యాటకం) ఒకటని తమ మంత్రిత్వ శాఖ గుర్తించినట్లు ఆయన చెప్పారు. సముద్రం, నదుల్లో నౌకా పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన మౌలిక వసతులను కల్పించడానికి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.