సర్కారు ‘కంత్రి’బ్యూషన్‌!

ABN , First Publish Date - 2021-08-20T07:31:04+05:30 IST

గద్దెనెక్కిన వారంలో కమిటీలు.. గిమిటీలు లేకుండా కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎ్‌స)ను రద్దుచేసేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తానని ఎన్నికల..

సర్కారు ‘కంత్రి’బ్యూషన్‌!

సీపీఎస్‌ ఉద్యోగులతో చెలగాటం

5 నెలలుగా వారి ప్రాన్‌ ఖాతాల్లో జమ కాని కంట్రిబ్యూషన్‌

మార్చి నుంచి జూలై వరకు రూ.500 కోట్ల బకాయిలు

ఉద్యోగుల వాటా పది శాతం జీతాల నుంచి కట్‌

ప్రభుత్వ కంట్రిబ్యూషన్‌గా మరో 10% జోడించాలి

ఐదు నెలల నుంచి తమ ప్రాన్‌ ఖాతాల్లో కంట్రిబూషన్‌ జమ చేయడంలేదని, నిబంధనల ప్రకారం.. ఆ మొత్తాన్ని 8 శాతం వడ్డీతో కలిపి వెంటనే ఇవ్వాలని ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరియదాస్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తాత్సారం చేయడం తగదన్నారు.

సీపీఎస్‌ ఉద్యోగులతో జగన్‌ ప్రభుత్వం ఆటలాడుతోంది. ప్రతి నెలా ఉద్యోగుల జీతం నుంచి వారి కంట్రిబ్యూషన్‌ వాటాను కట్‌ చేస్తోంది. దానితో తన వాటాను కలిపి జమచేయాల్సి ఉండగా.. చెల్లించకుండా సతాయిస్తోంది. 5 నెలలుగా వారి అకౌంట్లలో రూపాయి కూడా పడలేదు. అడిగితే పైసా కూడా పెండింగ్‌ లేదని ట్రెజరీ అధికారులు అనడం వారికి ఆగ్రహం తెప్పిస్తోంది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): గద్దెనెక్కిన వారంలో కమిటీలు.. గిమిటీలు లేకుండా కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎ్‌స)ను రద్దుచేసేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తానని ఎన్నికల సమయంలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆ ఊసే ఎత్తింది లేదు. ఇప్పుడు వారికి చెల్లించాల్సిన తన వాటా సొమ్మును కూడా సర్కారు చెల్లించడం లేదు. సీపీఎస్‌ విధానం ప్రకారం.. పెన్షన్‌ కింద పర్మనెంట్‌ రిటైర్మెంట్‌ అకౌంట్‌ నంబర్‌(ప్రాన్‌) ఖాతాలో ప్రతినెలా ఉద్యోగులు తమ వేతనం నుంచి 10శాతం వాటాగా ఇవ్వాలి. ప్రభుత్వం కూడా అంతే మొత్తం తన కంట్రిబ్యూషన్‌గా జమచేయాలి. ఇలా ప్రతినెలా 20శాతాన్ని ప్రాన్‌ ఖాతా లో ప్రభుత్వం జమ చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా 1,94,000 మంది వరకూ సీపీఎస్‌ ఉద్యోగులున్నారు. వారి జీతాల నుంచి నెలకు 10శాతం అంటే సుమారు రూ.50 కోట్ల వరకూ సర్కారు మినహాయిస్తోంది.


తన వాటాతో కలిపి రూ.100కోట్ల చొప్పున సీపీఎస్‌ ఉద్యోగుల ప్రాన్‌ ఖాతాలో జమ చేయాల్సి ఉంది. అయితే ఈ ఏడాది మార్చి నుంచి జూలై వరకూ.. నెలకు రూ.100కోట్ల లెక్కన రూ.500 కోట్లు జమకాలేదు. దీనిపై ఉద్యోగుల్లో పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రభుత్వ కార్పొరేషన్ల సొమ్మును పీడీ ఖాతాలు సృష్టించి మాయాజాలం చేస్తున్న సర్కారు.. ఈ సొమ్మును కూడా దారి మళ్లించిందా అని సందేహిస్తున్నారు. సీపీఎస్‌ ఉద్యోగుల నుంచి మినహాయించిన సొమ్ము ప్రజా పద్దుల్లోనే ఉంటుంది. అందులో ఉంటే ప్రభుత్వం వాడుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఉద్యోగుల నుంచి మినహాయించిన సొమ్మును 5నెలల నుంచి తన వద్దే పెట్టుకుందని, ఈ డబ్బును ఎటైనా మళ్లించిందా.. లేదా వాడుకుందా అని చర్చ జరుగుతోంది. ప్రతి నెలా ఉద్యోగి ప్రాన్‌ ఖాతాలో 20శాతం కంట్రిబ్యూషన్‌ను జమ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇప్పటికే పింఛను తక్కువగా వస్తోందని, ఏ నెలకానెల జమ చేయకపోవడం వల్ల ఇంకా తగ్గే ప్రమాదం ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రాన్‌ ఖాతాల్లో ఉభయుల వాటాలనూ ప్రభుత్వం ఏ నెలకానెల జమ చేయాలి. ఒకవేళ రెండు నెలలపాటు అలా వేయడంలో ఆలస్యం జరిగితే.. ఆ మొత్తాన్ని 8శాతం వడ్డీతో కలిపి జమ చేయాల్సి ఉంటుంది. అలాంటిదేమీ లేకపోగా.. 5నెలలుగా చెల్లింపులే పడలేదని ఉద్యోగులు అంటున్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని రద్దు చేయాలని ఓపక్క ఉవ్వెత్తున తాము ఉద్యమిస్తుండగా.. ఐదు నెలలుగా ఇలా వాటాలు జమచేయకుండా తమను ఇంకా రెచ్చగొడుతున్నారని మండిపడుతున్నారు. 


జూలై మాత్రమే పెండింగ్‌..!

తమ ప్రాన్‌ ఖాతాల్లో 5 నెలలుగా డబ్బులు పడలేదని సీపీఎస్‌ ఉద్యోగులు చెబుతుంటే.. రాష్ట్ర ట్రెజరీ అధికారులు విభేదిస్తున్నారు. వారికి సంబంధించి పెండింగ్‌ ఏమీ లేదని,. ఒక్క జూలై నెల కంట్రిబ్యూషన్‌ మాత్రమే చెల్లించాల్సి ఉందని.. ఇప్పుడిప్పుడే జీతాలకు సంబంధించి క్లియర్‌ చేస్తున్నామని.. రేపో మాపో అది కూడా క్లియర్‌ అవుతుందని అంటున్నారు. తమ రికార్డుల ప్రకారం.. ప్రభుత్వం వైపు నుంచి సీపీఎస్‌ ఉద్యోగులకు చెల్లించాల్సింది ఏమీ పెండింగ్‌ లేదని, అన్నీ అప్‌డేట్‌గా ఉన్నామని డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ ఎకౌంట్స్‌ మోహనరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఏమైనా మిస్సింగ్‌ గ్రేడ్స్‌ ఉంటే ఉద్యోగులు  సరిచూసుకోవాలని సూచించారు. బిల్లులు పెట్టినప్పుడు మిస్‌ క్లాసిఫికేషన్‌ చేస్తూ ఉంటారని, ఆ హెడ్‌ ఆఫ్‌ ది ఎకౌంట్‌ సరిగా చేయకపోతే మిస్‌ క్లాసిఫికేషన్‌ వస్తుందని చెప్పారు. అయితే అధికారులు చెప్పిన తర్వాత కూడా ఉద్యోగులు తమ ఖాతాలను ఒకటి ఎంరెండు సార్లు చెక్‌ చేసుకున్నారు. ఒక్క రూపాయి కూడా పడలేదని.. నిజంగా చెల్లించి ఉంటే ఖాతాల్లో ఎందుకు కనిపించడం లేదని నిలదీస్తున్నారు. తమ జీతాల నుంచి కట్‌ చేసిన సొమ్ము పబ్లిక్‌ అకౌంట్‌లో ఉంటుందని.. వడ్డీ కట్టే పనిలేదు కాబట్టి దానిని వడ్డీయేతర ఖాతా (నాన్‌ ఇంటరెస్ట్‌ అకౌంట్‌)లో వేసి.. ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుంటున్నట్లుగా ఉందని వారు అంటున్నారు. తమ చెల్లింపులకు సంబంధించిన బిల్లులనే నెలల తరబడి పెట్టడంలేదని.. వాటినే ఏ నెలకా నెల పెట్టనప్పుడు పెండింగే లేదని ప్రభుత్వం ఏ విధంగా చెబుతుందని మండిపడుతున్నారు.


మా వాటా మాత్రం కోస్తున్నారు..

సీపీఎస్‌ ఉద్యోగులుగా వృద్ధాప్యంలో పెన్షన్‌ తక్కువగా వస్తుందనే భయం ఇప్పటికే సీపీఎస్‌ ఉద్యోగుల్లో ఉందని ఏపీసీపీఎ్‌సఈఏ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు యాదవ్‌ అన్నారు. గత మార్చి నుంచి తమ వేతనాల్లో వాటాను కట్‌ చేస్తున్నా.. ప్రభుత్వ వాటాతో కలిపి తమ ప్రాన్‌ ఖాతాల్లో జమచేయలేదని.. వెంటనే జమ చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-08-20T07:31:04+05:30 IST