కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు

ABN , First Publish Date - 2021-11-09T07:58:00+05:30 IST

పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు ఉన్న బకాయిలను చెల్లించేందుకు విద్యుత్‌ పంపిణీ

కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు

విద్యుత్‌ పంపిణీ సంస్థలపై హైకోర్టు ఆగ్రహం

సౌర, పవన విద్యుత్‌ సంస్థల బకాయిలపై మరో 3 వారాల గడువు

ఆలోగా చెల్లించకపోతే ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ కోరతామని హెచ్చరిక

అమరావతి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు ఉన్న బకాయిలను చెల్లించేందుకు విద్యుత్‌ పంపిణీ సంస్థలకు హైకోర్టు మరో మూడు వారాల గడువు ఇచ్చింది. బకాయిలు చెల్లించడంలో విఫలమైతే ఇకపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ కోరతామని హెచ్చరించింది. నవంబరు 8లోగా బిల్లులు చెల్లిస్తామని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. సామాన్య వ్యాపారిలాగా ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెప్పడం ఏమిటని నిలదీసింది. కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించింది. ఆ సంస్థలు ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌ను వినియోగదారులకు పంపిణీ చేస్తూ.. బకాయిలు చెల్లించకపోవడం ఏమిటని నిలదీసింది. తదుపరి విచారణలోగా బకాయిలు చెల్లించాలని స్పష్టం చేసింది. విచారణను డిసెంబరు 7కు వాయిదా వేసింది. వ్యాజ్యాలపై తుది విచారణ చేపడతామంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏలపై యూనిట్‌ టారిఫ్‌ ధరలను ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) సమీక్షించేందుకు వీలు కల్పిస్తూ 2019లో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు ధర్మాసనం ముందు అప్పీల్‌ చేసిన విషయం తెలిసిందే.  ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు ఉన్న బకాయిలను నవంబరు 8లోగా చెల్లించాలని గత విచారణలో రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలను హైకోర్టు ఆదేశించింది.


ఈ వ్యాజ్యాలపై మరోమారు సోమవారం విచారణ జరిగింది. విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల తరఫున సీనియర్‌ న్యాయవాదులు  బసవ ప్రభుపాటిల్‌, సంజయ్‌ సేన్‌, సంజన్‌ పూవయ్య తదితరులు వాదనలు వినిపించారు. తాత్కాలిక చర్యల్లో భాగంగా పవన విద్యుత్‌ యూనిట్‌కు రూ.2.43, సౌర విద్యుత్‌కు రూ.2.44 చెల్లించాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కూడా డిస్కంలు అమలు చేయలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. నవంబరు 8లోగా చెల్లించాలన్న ఆదేశాలనూ అమలు చేయలేదని,   కోర్టుకు ఏజీ ఇచ్చిన హామీ కూడా అమలుకాలేదని తెలిపారు. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, వాటికి బ్యాంకులు దివాలా నోటీసులు ఇస్తున్నాయన్నారు. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. అయితే, బకాయిల చెల్లింపు కోసం వనరులు సమకూర్చుకుంటున్నామని విద్యుత్‌ పంపిణీ సంస్థల తరఫున ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈనెల 21 నుంచి 24 మధ్య బకాయిలు చెల్లిస్తామన్నారు.  

Updated Date - 2021-11-09T07:58:00+05:30 IST