ప్రభుత్వ లిక్కర్‌ షాపుల్లో కల్తీ మద్యం

ABN , First Publish Date - 2021-05-30T08:49:46+05:30 IST

సర్కారీ మద్యం దుకాణాల్లో కల్తీ బాగోతం బయటపడింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో శనివారం ఈ ఘటన వెలుగు చూసింది

ప్రభుత్వ లిక్కర్‌ షాపుల్లో కల్తీ మద్యం

రాజమహేంద్రవరం, మే 29(ఆంధ్రజ్యోతి): సర్కారీ మద్యం దుకాణాల్లో కల్తీ బాగోతం బయటపడింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో శనివారం ఈ ఘటన వెలుగు చూసింది. రా జమహేంద్రవరం రూరల్‌ ధవళ్వేరంలో కొనసాగుతున్న 448 నంబర్‌ ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్‌వైజర్‌గా ఆనాల సతీష్‌, సేల్స్‌మన్‌లుగా దాసరి దుర్గాలక్ష్మీకుమార్‌, మైలపల్లినాగరాజు, కోలటివెంకటే్‌షలు పనిచేస్తున్నారు. గతంలో ఓ ప్రైవేట్‌ మద్యం షాపుల్లో పనిచేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న దొడ్డి జోగేశ్వరరావు, చదరం గోవింద్‌లతో వారు ముఠాగా ఏర్పడ్డారు. మద్యం డిపో నుంచి వచ్చిన చీప్‌లిక్కర్‌ బాటిల్‌, ఇతర లిక్కర్‌ బాటిల్‌ ఒక్కోదాని నుంచి 30ఎంఎల్‌ లిక్కర్‌ తీసి, ఆ గ్యాప్‌ను నీళ్లతో ఫిల్‌ చేసి సీల్‌ వేస్తున్నారు. జోగేశ్వరరావు, గోవింద్‌ల ఇళ్లల్లో కలర్‌ ప్రింటర్‌ పెట్టుకుని, నకిలీ లేబుల్స్‌ తయారు చేయిస్తున్నారు. పాత సామాన్ల వ్యాపారుల నుంచి పాత చీప్‌ లిక్కర్‌ బాటిల్స్‌ సేకరించి, వాటిపై లేబుళ్లు అతికించి, వాటిలో కొంత చీప్‌ లిక్కర్‌, నీళ్లు పోసి కొత్త బాటిల్‌గా తయారు చేసేస్తున్నారు. ఇంకేముంది... నకిలీ మద్యంతో కొత్త లిక్కర్‌ బాటిల్‌ తయారైపోయినట్టే కదా. దానిని నేరుగా సర్కారీ మద్యం షాపుల్లో కాకుండా బెల్టు షాపులకు తరలించేస్తున్నారు. అంతేకాకుండా బెల్టు షాపుల్లో ఈ బాటిళ్లను అధికఽ దరలకు విక్రయిస్తున్నారు. ఇలా ఒక్కో బాక్స్‌లోని 48 బాటిల్స్‌ నుంచి కొంత మద్యం తీసి, అదనంగా 11నుంచి 12 బాటిల్స్‌ తయారు చేస్తున్నారు. ఒక నెలలో 480 బాటిల్స్‌ వరకూ తయారు చేస్తున్నారు. మూడు నెలలుగా గుట్టుగా సాగుతున్న ఈ దందాపై ఎస్‌ఈబీ అధికారులు శనివారం దాడి చేశారు. ఈ దాడిలో ప్రభుత్వ మద్యం దుకాణంలో 209 బాటిళ్లు, బెల్టు షాపులో 139 బాటిళ్లు దొరికాయి. ఆపై ఈ ముఠాలోని మొత్తం ఆరుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-05-30T08:49:46+05:30 IST