ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు రఘురామ కుట్ర

ABN , First Publish Date - 2021-05-20T08:38:02+05:30 IST

ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎంపీ రఘురామకృష్ణంరాజు కుట్ర పన్నారని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. బెయిల్‌ కోసం సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌కు

ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు రఘురామ కుట్ర

రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి ప్రయత్నించారు 

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌ 


న్యూఢిల్లీ, మే 19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎంపీ రఘురామకృష్ణంరాజు కుట్ర పన్నారని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. బెయిల్‌ కోసం సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకించింది. ఆయా కులాలు లేదా మతాల ప్రజలు ఒకరినొకరు చంపుకోవాలని పిలుపునివ్వడానికి కూడా రఘురామరాజు సంకోచించలేదని తీవ్ర ఆరోపణ చేసింది. దురుద్దేశంతో ఆయా వర్గాల ప్రజల మధ్య శతృత్వాన్ని సృష్టించడానికి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొంది. కులాలు, మతాల వారీగా ప్రజలను విభజించి రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి ప్రయత్నించారని ఆరోపించింది.


ఈ పరిస్థితుల రీత్యా చర్యలు తీసుకోవడం మినహా మరో మార్గం లేకపోయిందని, ఏడాదిగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని వివరించింది. కాగా, అరెస్టు చేసినరోజు రాత్రి పోలీసులు ఆయనను హింసించారని చేసిన ప్రకటనలో వాస్తవం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రఘురామ బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది. 

Updated Date - 2021-05-20T08:38:02+05:30 IST