ఎన్నికల వేళ జగన్ లేఖపై చుట్టుముడుతున్న వివాదం
ABN , First Publish Date - 2021-02-26T17:14:53+05:30 IST
కార్పొరేషన్ ఎన్నికల వేళ... వైసీపీ ప్రభుత్వం బెజవాడలో పేదల ఇళ్ల రెగ్యులైజేషన్ కోసం పావులు కదుపుతోంది! పశ్చిమ పరిధిలోని 56వ డివిజన్‌లోని పాతరాజరాజేశ్వరిపేట ప్రాంతవాసుల...

- రైల్వే మంత్రి పియూష్‌గోయల్‌కు సీఎం జగన్ లేఖ
- రైల్వే ఆక్రమిత స్థలాన్ని రాజరాజేశ్వరీపేటలో అప్పగించండి!
- బదులుగా అజిత్‌సింగ్‌నగర్‌లో 25 ఎకరాలిస్తాం!
- పేటలో ప్రచారం చేసుకుంటున్న వైసీపీ నేతలు
రానున్న ఎన్నికల్లో ప్రతిష్టాత్మక విజయవాడ నగర కార్పొరేషన్‌ను దక్కించుకునేందుకు అఽధికార పార్టీ పావులు కదుపుతోంది. అందుకు తగ్గట్టుగా నగర ప్రజలను ఆకట్టుకునేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు తాయిలాల అందజేతకు సిద్ధమయ్యారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న పాతరాజరాజేశ్వరిపేటలోని రైల్వేస్థలాన్ని పేదలకు పంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈనేపథ్యంలో సీఎం జగన్ రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాయటంపై పలువురు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు.. ఇది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని కొట్టిపడేస్తున్నారు.
విజయవాడ(ఆంధ్రజ్యోతి): కార్పొరేషన్ ఎన్నికల వేళ... వైసీపీ ప్రభుత్వం బెజవాడలో పేదల ఇళ్ల రెగ్యులైజేషన్ కోసం పావులు కదుపుతోంది! పశ్చిమ పరిధిలోని 56వ డివిజన్‌లోని పాతరాజరాజేశ్వరిపేట ప్రాంతవాసుల ఆక్రమణలను క్రమబద్దీకరించేందుకు సిద్ధమైంది! వాస్తవానికి ఇది మంచి విషయమే అయినా.. కార్పొరేషన్ ఎన్నికల ముందు పేదలపై ప్రేమ పొంగుకు రావటం విశేషం. నగర అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు ఈ అంశాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పేదలు ఆక్రమించుకుని నివాసాలను ఏర్పాటు చేసుకున్న రాజరాజశేశ్వరిపేట రైల్వేస్థలాన్ని ప్రభుత్వానికి అందించాలని, ప్రతిగా అజిత్‌సింగ్‌నగర్‌లో 25 ఎకరాల స్థలాన్ని రైల్వేకు అప్పగిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2 రోజుల కిందట లేఖ రాశారు.
దీన్ని వైసీపీ నేతలు క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారానికి వాడుకునేందుకు పావులు కదుపుతున్నారు. పాతరాజరాజేశ్వరిపేట వీఎంసీలో అంతర్భాగంగా ఉంది. 3 దశాబ్దాల కిందటే రైల్వేకు చెందిన 20 ఎకరాలకు పైగా స్థలాన్ని ఆక్రమించుకుని పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కార్పొరేషన్ అధికారులు సైతం రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పాత రాజరాజేశ్వరిపేటలో 800 పైగా గృహాలున్నాయి. 5 వేల మంది జనాభా నివశిస్తున్నారు. కార్పొరేషన్‌లో గతంలో 49వ డివిజన్‌గా, ప్రస్తుతం 56వ డివిజన్‌గా ఉంది. వాస్తవానికి వీరంతా 30 ఏళ్లుగా ఇక్కడే నివశిస్తున్నారు. రైల్వేశాఖ గతంలో ఆక్రమణలకు పాల్పడిన నివాసాలను తొలగించేందుకు మార్కింగ్ చేపట్టింది. దాదాపు 200 ఇళ్లవరకు మార్కింగ్ చేసింది. తర్వాత ప్రజల నుంచి ఆందోళనలు రావటంతో రైల్వేశాఖ వెనక్కు తగ్గింది. ఈ స్థలాన్ని రైల్వే కూడా పెద్దగా ఉపయోగించుకోవటంలేదు. ఈనేపథ్యంలో రైల్వే అవసరాలకు ప్రతిగా అజిత్‌సింగ్‌నగర్‌లోని 25 ఎకరాల స్థలాన్ని అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానికంగా రైల్వే శాఖ కూడా సుముఖంగా ఉన్నందున ఈ విషయాన్ని రైల్వే బోర్డు దృష్టికి తీసుకువెళ్లి సానుకూల నిర్ణయం తీసుకునేలా కృషి చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు, సీఎం జగన్ లేఖ రాశారు.