అధిక వసూళ్లపై కట్టడి చర్యలేవీ?

ABN , First Publish Date - 2021-04-23T09:42:03+05:30 IST

కరోనా చికిత్సకు సంబంధించి ప్రైవేటు ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేయకుండా కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

అధిక వసూళ్లపై కట్టడి చర్యలేవీ?

రోజుకు ఎన్ని పరీక్షలు చేస్తున్నారు?

పరీక్షా ఫలితాల్లో జాప్యం ఎందుకు?

బెడ్లు, ఆక్సిజన్‌ సరిపడా ఉన్నాయా?

పూర్తి వివరాల్తో అఫిడవిట్‌ వేయండి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సకాలంలో కౌంటర్‌ వేయలేరా?

ఇది సరికాదు.. బెంచ్‌ అసహనం


అమరావతి, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): కరోనా చికిత్సకు సంబంధించి ప్రైవేటు ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేయకుండా కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై ఏమి చర్యలు తీసుకున్నారు...రోజుకు ఎన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు....పరీక్షా ఫలితాల వెల్లడిలో జాప్యం ఎందుకు జరుగుతోంది...కరోనా రోగులకు సరిపడా బెడ్లు అందుబాటులో ఉన్నాయా...ఆక్సిజన్‌ లభ్యత ఏమేరకు ఉంది....తదితర వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. గత ఏడాది దాఖలు చేసిన పిల్‌పై ఇప్పటివరకు అఫిడవిట్‌ దాఖలు చేయకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాజ్యాలలో కూడా కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం కోరడం సరికాదని హితవు పలికింది.


విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమర్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులు అధిక ఫీజులను వసూలు చేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని పేర్కొంటూ సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్‌ తోట సురేశ్‌బాబు గత ఏడాది సెప్టెంబరులో హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ....‘‘కరోనా బాధితులను చేర్చుకొనేందుకు ప్రైవేటు ఆస్పత్రులు రూ. 2 లక్షల నుంచి 4లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఏ ఆస్పత్రి ఎంత మంది కరోనా రోగులకు చికిత్స అందించింది...వారి నుంచి ఎంత వసూలు చేశారనే విషయాలపై డీఎంహెచ్‌వో పర్యవేక్షిస్తే అధిక ఫీజుల వసూలును కట్టడి చేయవచ్చు. ప్రస్తుతం కరోనా విస్తృత వ్యాప్తితో రాష్ట్రంలో దయనీయ పరిస్థితులు ఉన్నాయి. ఆస్పత్రుల్లో సరిపడా బెడ్లు అందుబాటులో లేవు. కరోనా పరీక్షల ఫలితాలు వచ్చేందుకు  5నుంచి 7 రోజుల సమయం పడుతోంది. ఈ జాప్యం వల్ల కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది.


ప్రస్తుతం కరోనా కట్టడికి ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగాగా ఉన్నా...అవి సరిపోవు’’ అని అన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ...అధిక ఫీజుల కట్టడికి చర్యలు తీసుకుంటున్నారా అని ప్రభుత్వ న్యాయవాది సి.సుమన్‌ను ప్రశ్నించింది. ‘‘అధిక ఫీజుల వసూలుపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ అందుబాటులోకి తెస్తాం. అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే సంబంధిత ఆస్పత్రులను సీజ్‌ చేస్తాం. కరోనా బాధితులను గుర్తించేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో టెస్టులు చేస్తోంది’’ అని సి.సుమన్‌ వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ... అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై మీఅంతట మీరే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

Updated Date - 2021-04-23T09:42:03+05:30 IST