10 వేల మార్కుకు 67 రోజుల్లోనే..

ABN , First Publish Date - 2021-04-23T09:39:30+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ వస్తే.. వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందన్న నిపుణుల అంచనాలు నిజమవుతున్నాయి.

10 వేల మార్కుకు 67 రోజుల్లోనే..

ఈ రెండు నెలల్లో 1,08,563 కేసులు.. కరోనా కాటుకి 378 మంది బలి

గత ఏడాది కంటే రెట్టింపు వేగం.. వైరస్‌ వ్యాప్తిపై వైద్య నిపుణుల ఆందోళన


(అమరావతి - ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌ వస్తే.. వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందన్న నిపుణుల అంచనాలు నిజమవుతున్నాయి. ఆ అంచనాలను కూడా మించిపోతూ మలివిడత కరోనా వ్యాప్తి జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతోంది. రాష్ట్రంలో తొలి విడతలో రోజువారీ కేసుల సంఖ్య 10వేల మార్కుని చేరడానికి సుమారు 165 రోజులు పట్టింది. కానీ సెకండ్‌ వేవ్‌లో కేవలం 67 రోజుల్లోనే ఆ రికార్డును అధిగమించింది. ప్రభుత్వం గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో రోజువారీ కేసుల సంఖ్య 10,759గా నమోదైంది. కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలయ్యాక ఇదే అత్యధికం. ఈ ఏడాది ఫిబ్రవరి 15న అత్యల్పంగా 30 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి నెమ్మదిగా పెరుగుతూ ఇటీవల మరింత వేగం పుంజుకుంది. కొద్దిరోజులుగా సునామీలా చుట్టేయడం మొదలుపెట్టింది. దాని ఫలితమే 67 రోజుల వ్యవధిలోనే 10 వేల కేసులు. ఇది మరింతగా పెరగనుందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పుడే వైరస్‌ వేగంగా వ్యాపించిందని, ఇప్పుడు అలాంటి చర్యలు లేనందున జెట్‌ స్పీడ్‌తో చుట్టేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది మార్చి 15న ఏపీలో తొలి పాజిటివ్‌ కేసు నమోదైంది. అలా పెరుగుతూ ఆగస్టు 26 నాటికి 10వేల మార్కు దాటింది. అప్పట్లో వైరస్‌ నిర్ధారణకు ఆర్‌టీపీసీఆర్‌, యాంటీజెన్‌, ట్రూనాట్‌ పరీక్షలు చేశారు. రోజుకు సగటున 60-75 వేలపైనే పరీక్షలు చేశారు. ఆగస్టు 26న 61వేల మందికి పరీక్షలు చేస్తే 10,830 కేసులు బయటపడ్డాయి. 76 మంది మరణించారు. ఆ నాటికి మరణాల సంఖ్య 3541. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ఇప్పటి వరకు 67 రోజుల వ్యవధిలో 1,08,563 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో 66,249 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ రెండునెఎ లల్లో 378 మంది కరోనాకు బలయ్యారు. ఇది గత గణాంకాలతో పోలిస్తే మూడు రెట్లు అధికమని వైద్యవర్గాలు చెబుతున్నాయి.


గతేడాది తొలికేసు నమోదైన మార్చి 15 నుంచి మే 21 వరకు 67 రోజుల వ్యవధిలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. అప్పుటికి మొత్తం పాజిటివ్‌ కేసులు 2542 కాగా.. యాక్టివ్‌ కేసులు 862. అప్పటికి మొత్తం మరణాలు 45. కానీ మలి విడతకొచ్చేసరికి ఫిబ్రవరి 15 నుంచి ఇప్పటి వరకు అదే 67 రోజుల వ్యవధిలో కరోనా వ్యాప్తి భయంకరంగా సాగుతోంది. పాజిటివిటీ రేటు 17 శాతం ఉన్నప్పుడే ఈ గణాంకాలు నమోదయ్యాయి. ఇప్పుడు పరీక్షలు జరుపుతున్నదాన్ని బట్టి పాజిటివిటీ 25 శాతంగా నమోదవుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఈ తీవ్రతను ప్రభుత్వం అర్థం చేసుకొని ఇప్పటికైనా వైరస్‌ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Updated Date - 2021-04-23T09:39:30+05:30 IST