కరోనా కేసులు పైపైకి..రాష్ట్రంలో కొత్తగా 7,224 కేసులు.. 15 మంది మృతి
ABN , First Publish Date - 2021-04-18T08:55:00+05:30 IST
రాష్ట్రంలో కరోనా మళ్లీ తీవ్రరూపం దాలుస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 39,907 శాంపిల్స్ పరీక్షించగా 7,224 మందికి పాజిటివ్ నిర్ధారణైంది. చిత్తూరులో అత్యధికంగా 1051, తూర్పుగోదావరి 906, గుంటూరు 903, నెల్లూరు 624, శ్రీకాకుళం
సీఎస్ ఆదిత్యనాథ్‌కూ కొవిడ్. తూర్పులో సినిమాహాళ్లు, పార్కుల మూత
నేడు బెజవాడలో వ్యాపారసంస్థల మూసివేత.. రాష్ర్టానికి మరో 6 లక్షల టీకా డోసులు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
రాష్ట్రంలో కరోనా మళ్లీ తీవ్రరూపం దాలుస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 39,907 శాంపిల్స్ పరీక్షించగా 7,224 మందికి పాజిటివ్ నిర్ధారణైంది. చిత్తూరులో అత్యధికంగా 1051, తూర్పుగోదావరి 906, గుంటూరు 903, నెల్లూరు 624, శ్రీకాకుళం 662, ప్రకాశం 588, కర్నూలు 507, కృష్ణా 493, విశాఖపట్నం 470, అనంతపురం 420, విజయనగరం 304, కడప 200, పశ్చిమగోదావరిలో 96 కేసులు నమోదయ్యాయి. తాజాగా 15 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,55,455కి, కరోనా మృతుల సంఖ్య 7,388కి చేరింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,332 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశార్చ్ కాగా, ఇంకా 40,469 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 9,07,598కి చేరింది.
సీఎ్‌సకు కరోనా..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నెల 10న స్వల్పంగా దగ్గు రావడంతో కరోనా పరీక్ష చేయించుకున్నారు. వైద్యుల సూచన మేరకు రెండు రోజులు ఎయిమ్స్‌లో చేరారు. డిశ్చార్జ్ అయ్యాక విజయవాడ క్యాంపు నివాసంలోనే హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.
కేర్ సెంటర్లుగా టిడ్కో గృహాలు
కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో బెడ్లకు కొరత లేకుండా చూస్తూనే, టిడ్కో గృహ సముదాయాలను కొవిడ్ కేర్ సెంటర్లుగా మారుస్తున్నారు. తాడేపల్లిగూడెంలోని టిడ్కో సముదాయంలో 500 గృహాలను కేర్ సెంటర్ పరిధిలోకి తేవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
రాష్ర్టానికి ఆరు లక్షల టీకా డోసులు
రాష్ర్టానికి ఆరు లక్షల కొవిడ్ వ్యాక్సిన్ వచ్చింది. ఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానంలో శనివారం ఉదయం కొవిషీల్డ్ ఐదులక్షల డోసులు వచ్చాయి. అలాగే హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన కొవ్యాక్సిన్ లక్ష డోసులు వచ్చాయి. వ్యాక్సిన్లను ప్రత్యేక వాహనాల్లో 13 జిల్లాలకు తరలించారు. కాగా ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ వర్కర్లకు రాబోయే 72 గంటల్లో వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్లకు వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఆదేశాలు జారీచేశారు.
రేపటి నుంచి విజయవాడలో 6 వరకే దుకాణాలు
కరోనా కేసులు భారీగా పెరగడంతో శనివారం నుంచి కాకినాడలోని అన్ని పార్కులను మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి రాజమహేంద్రవరంలోనూ కూడా పార్కులు, కమ్యూనిటీ హాళ్లు మూసి వేయాలని నిర్ణయించారు. శనివారం జిల్లావ్యాప్తంగా 30 సినిమా హాళ్లను మూసివేశారు. విజయవాడలోని అన్ని వ్యాపార సంస్థలు పూర్తిగా మూసివేస్తున్నట్టు విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు తెలిపారు. ఈ నెల 19 నుంచి 30 వరకు సాయంత్రం 6 గంటలకే దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేయాలని నిర్ణయించామన్నారు.