కరోనా టెస్టులు తగ్గించండి!
ABN , First Publish Date - 2021-03-24T08:56:19+05:30 IST
రాష్ట్రంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ సమయంలో వైరస్ నిర్ధారణ పరీక్షలు బాగా పెంచాలి. కేంద్రం సూచనల ప్రకారం టెస్ట్, ట్రేస్, ట్రీట్ విధానాన్ని పక్కాగా అమలు చేయాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో

ఇంకా తగ్గించండి!
రోజుకు రెండు వేలకు మించొద్దు
జిల్లా అధికారులకు మౌఖిక ఆదేశాలు
గతంలో వారానికి 3 లక్షల టెస్టులు
ఇప్పుడు నెలకు 2 లక్షలు కూడా కష్టమే
కేసుల పెరుగుదలను రాజధాని తరలింపు
ప్రక్రియకు అడ్డంకిగా భావిస్తున్న ప్రభుత్వం?
కేసుల పెరుగుదలను రాజధాని తరలింపు ప్రక్రియకు అడ్డంకిగా భావిస్తున్న ప్రభుత్వం?
ఉద్యోగుల్లో వ్యతిరేకత వస్తుందన్న ఆందోళన
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ సమయంలో వైరస్ నిర్ధారణ పరీక్షలు బాగా పెంచాలి. కేంద్రం సూచనల ప్రకారం టెస్ట్, ట్రేస్, ట్రీట్ విధానాన్ని పక్కాగా అమలు చేయాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కొవిడ్ పరీక్షలు తగ్గించాలంటూ జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారులకు ఆరోగ్యశాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. గతేడాది మార్చితో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధికంగా పాజిటివ్‌లు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో టెస్టుల సంఖ్య రోజుకు 2-3వేలకు మించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14 నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వచ్చాయి. అప్పటినుంచి రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 20 నుంచి 33వేల మందికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. గతంలో వారానికి 3లక్షల మందికి నిర్వహించేవారు. ప్రస్తుతం నెలకు 2లక్షల మందికి కూడా చేయడం లేదు.
దీని వెనుక భారీ స్కెచ్ ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గతంలో పరీక్షలు ఎక్కువ నిర్వహించడం వల్ల కరోనా కేసుల నమోదులో ఏపీ దేశంలోనే రెండోస్థానానికి చేరింది. మనకంటే ఎక్కువ కేసులున్న తెలంగాణ అట్టడుగు స్థానంలో ఉంది. కాబట్టి రాష్ట్రంలో పరీక్షలు తగ్గిస్తే కేసుల సంఖ్య తగ్గిపోతుందని ఆరోగ్యశాఖ భావిస్తోందని పేర్కొంటున్నారు. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో రాజధాని తరలింపు ప్రక్రియ చేపడితే ప్రభుత్వానికి చెడ్డపేరు రావడంతో పాటు ఉద్యోగుల్లో వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో టెస్టుల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం ఆదేశిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.
ఐసీఎంఆర్ ప్రశ్నల వర్షం
రాష్ట్రంలో కరోనా పరీక్షలు తగ్గించడాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. ఇప్పటికే ఐసీఎంఆర్ అధికారులు ఆరోగ్యశాఖపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గతంలో ఏపీలో అత్యధిక పరీక్షలు నిర్వహించేవారు, ఇప్పుడెందుకు తగ్గుతున్నాయని అడుగుతున్నారు. టెస్టులు తగ్గిస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇదే జరిగిందని కేంద్రం స్పష్టం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్యశాఖ నుంచి స్పందన లేదు.
కిట్ల కొరతతో సమస్య
రాష్ట్రంలో ఆర్‌ఎన్‌ఏ ఎక్స్‌ట్రాక్షన్ కిట్లు, ఆర్టీపీసీఆర్ కిట్లకు కొరత ఉందని తెలుస్తోంది. గతంలో ఏ రోజు శ్యాంపిళ్లకు అదే రోజు లేదా రెండోరోజు టెస్టింగ్ పూర్తయ్యేది. ఇప్పుడు రెండు, మూడు రోజుల పాటు వేచి చూడాల్సి వస్తోంది. కిట్‌ల కొరత కారణంగా ల్యాబ్ సిబ్బంది టెస్టింగ్‌ను ఆలస్యం చేస్తున్నారు. మరోవైపు ఆరోగ్యశాఖకు ప్రైవేటు ల్యాబ్‌ల నుంచి సహకారం ఉండటం లేదు.
కరోనా తొలివిడత సమయంలో ప్రభుత్వ ల్యాబ్‌లతో పాటు ప్రైవేటు ల్యాబ్‌ల సేవలను ఉపయోగించుకున్నారు. అత్యవసరమైన శ్యాంపిళ్లకు ప్రైవేటుగా టెస్టులు చేసేవారు. ఆ మేరకు ప్రభుత్వం వారికి బిల్లులు చెల్లించేది. ఇలా కట్టాల్సిన బకాయిలు కోట్ల రూపాయిలకు చేరడంతో ప్రైవేటు ల్యాబ్‌లు ప్రభుత్వానికి పూర్తిగా సహకరించడం లేదు. రాష్ట్రంలో కరోనా టెస్టులు తగ్గడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు.