పగలంతా ఓపెన్‌

ABN , First Publish Date - 2021-06-21T09:17:54+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో కర్ఫ్యూ వేళలను ప్రభుత్వం కుదించింది.

పగలంతా ఓపెన్‌

6 నుంచి 6 దాకా సడలింపు

కర్ఫ్యూ సమయాన్ని కుదించిన ప్రభుత్వం

తూర్పుగోదావరిలో మధ్యాహ్నం 2 వరకే


అమరావతి, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో కర్ఫ్యూ వేళలను ప్రభుత్వం కుదించింది. రాష్ట్రంలో ఆదివారం వరకు 16 గంటలు ఉన్న కర్ఫ్యూ సమయాన్ని 12 గంటలకు కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సడలించిన నిబంధనలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంటూ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మాత్రమే ప్రజా కార్యకలాపాలకు అనుమతి ఉంది. సోమవారం దీన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పొడిగించింది. సాయంత్రం ఆరు నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది.


ఈ నెల 30 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా.. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా తూర్పుగోదావరి జిల్లాల్లో మాత్రం పరిస్థితి అదుపులోకి రాలేదు. అక్కడ ప్రతిరోజూ వెయ్యికిపైగా  కేసులు వస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ సమయాన్ని కుదించిన ప్రభుత్వం తూర్పుగోదావరిలో మాత్రం ప్రస్తుతం అమలులో ఉన్న సమయాన్నే కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ జిల్లాల్లో ఈ నెల 30 వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మాత్రమే కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని వెల్లడించింది.

Updated Date - 2021-06-21T09:17:54+05:30 IST