సహకార ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే!

ABN , First Publish Date - 2021-05-02T09:08:26+05:30 IST

రాష్ట్రంలో సహకార సంఘాల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. సహకార సంస్థలకు జనవరిలో అధికారిక పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీలను ప్రభుత్వం నియమించింది

సహకార ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే!

హైకోర్టులో ఇంకా తేలని వ్యాజ్యం

కరోనా తగ్గేవరకూ నిర్వహించలేం

తేల్చిచెబుతున్న ప్రభుత్వ వర్గాలు

ముందుగా పాలనా సంస్కరణలు 

ఆ తర్వాతే ఎన్నికల నిర్వహణ 

అవసరమైతే ఆర్డినెన్స్‌కు సిద్ధం 

ప్రభుత్వ పెద్దల యోచన 

అప్పటివరకూ పర్సన్‌ ఇన్‌చార్జిల పాలనే

గడువు తీరాక వారినే కొనసాగించే చాన్స్‌ 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో సహకార సంఘాల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. సహకార సంస్థలకు జనవరిలో అధికారిక పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీలను ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలు వచ్చే జూలై వరకు కొనసాగనున్నాయి. అయితే మే, జూన్‌ నెలల్లో రెండు దశలుగా సహకార ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించినట్లు హైకోర్టుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా తెలిపింది. ఎన్నికల షెడ్యూల్‌ను కూడా అధికారులు సిద్ధం చేసినట్లు పేర్కొంది. కానీ సహకార రంగంలో పాలనాపరమైన సంస్కరణలు తీసుకురావాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. దీంతో ఎన్నికల కంటే ముందే సంస్కరణలు తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో 2018 నుంచి సహకార ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. గత ప్రభుత్వం పాత పాలకవర్గాలనే ఏడాదిన్నర పాటు పొడిగించగా, జగన్‌ సర్కారు సైతం వాయిదా వేసుకుంటూ వస్తోంది. అందులో భాగంగా 2019 ఆగస్టులో పీఏసీఎ్‌సల్లో త్రిసభ్య కమిటీలు, డీసీసీబీ, డీసీఎంఎ్‌సలకు ఏడుగురు సభ్యులతో నామినేటెడ్‌ కమిటీలను నియమించింది. వాటి గడువు ఈ ఏడాది జనవరితో ముగియడంతో, అవే కమిటీలను పొడిగించాలని భావించింది. కానీ స్థానిక ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున అధికారేతర కమిటీల కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 


దీంతో 2,050 పీఏసీఎ్‌సలకు సహకార శాఖాధికారులను పర్సన్‌ ఇన్‌చార్జిలుగా ప్రభుత్వం నియమించింది. 13 డీసీసీబీ, 13 డీసీఎంఎ్‌సలకు జాయింట్‌ కలెక్టర్‌(రైతుభరోసా)లను పర్సన్‌ ఇన్‌చార్జిలుగా వేసింది. అప్పటికే సహకార ఎన్నికలపై హైకోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని సహకార శాఖను కోర్టు వివరణ కోరగా, ప్రభుత్వం గడువు కోరడంతో కేసు వాయిదా పడింది. ఇదే తరుణంలో సంస్కరణలు తెచ్చాకే ఎన్నికలు జరపాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. దీనికోసం అవసరమైతే ఆర్డినెన్స్‌ తీసుకొచ్చేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ప్రస్తుతం కొవిడ్‌ వ్యాప్తి ఉధృతంగా ఉన్నందున కేసులు తగ్గే వరకు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదంటున్నారు. ఎన్నికలపై కోర్టు తీర్పు ఇంకా రాకపోవడంతో అధికారులు, అధికార పార్టీ నేతలు ఎన్నికల ఊసెత్తడం లేదు. ఎన్నికలు నిర్వహించాలంటే, కనీసం 45రోజులు ముందస్తు కసరత్తు చేయాల్సి ఉంటుందని సహకార శాఖ అధికారులు చెబుతున్నారు. కరోనా తీవ్రత తగ్గితే గానీ ఎన్నికలు జరిపే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు నిర్ణయించిన నమూనా షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశం కన్పించడం లేదు. దీంతో అధికారిక పర్సన్‌ ఇన్‌చార్జిల గడువు తీరాక వారినే మరో 6నెలలు కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. 

Updated Date - 2021-05-02T09:08:26+05:30 IST