అడ్మిషన్లపై అయోమయం

ABN , First Publish Date - 2021-12-25T07:50:21+05:30 IST

ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకోవడం.. హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడం మామూలే! కానీ డిగ్రీలో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి సంబంధించి జీవోను రద్దు చేయలేదు.

అడ్మిషన్లపై అయోమయం

  • 20వేలమంది విద్యార్థులతో సర్కారు ఆటలు 
  • డిగ్రీ మేనేజ్‌మెంట్‌ కోటా జీవోతో తంటా
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తొలగింపు
  • మూడింతలు ఫీజు వసూలుకు నిర్ణయం
  • రీయింబర్స్‌ చేయాలని హైకోర్టు తీర్పు


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకోవడం.. హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడం మామూలే! కానీ డిగ్రీలో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి సంబంధించి జీవోను రద్దు చేయలేదు.. హైకోర్టు తీర్పునూ అమలు చేయలేదు.. తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లిందా అంటే అదీ లేదు. సర్కారు ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో దాదాపు 20 వేల మంది విద్యార్థుల డిగ్రీ అడ్మిషన్లపై అయోమయం నెలకొంది. ఒకవైపు డిగ్రీ కళాశాలలు ప్రారంభమై తరగతులు నడుస్తున్నా.. వీరి అడ్మిషన్ల విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలే దు. దీంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఏడాది నుంచి డిగ్రీ కళాశాలల్లో కూడా ప్రభుత్వం మేనేజ్‌మెంట్‌ కోటా ప్రవేశపెట్టింది. 30 శాతం సీట్లు మేనేజ్‌మెంట్‌ కోటాలో భర్తీ చేయాలని కొన్ని నెలల క్రితం నిర్ణయించింది. ఈ కోటాలో భర్తీ చేసే సీట్లకు మూడింతలు ఫీజు కట్టాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వబోమని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే దీనిపై డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. మేనేజ్‌మెంట్‌ కోటా పేరుతో విద్యార్థులను ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దూరం చేయడానికి వీల్లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. ‘‘వందశాతం సీట్లను అందుబాటులో ఉంచకుండా 70ు సీట్లనే ప్రభుత్వం కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయడం ద్వారా పేదలకు అందుబాటులో ఉన్న సీట్లు తగ్గిపోతాయి. మేనేజ్‌మెంట్‌ కోటా 30ు పేరు చెప్పి.. ఆ కోటాలో సీట్లు పొందిన పేదలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వనంటే కుదరదు. ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయాలి’’ అని హైకోర్టు చెప్పింది.

 

ప్రభుత్వానికి మూడు ఆప్షన్లు 

హైకోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వం ముందు మూడు ఆప్షన్లు మిగిలాయి. మేనేజ్‌మెంట్‌ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులకు కూడా హైకోర్టు తీర్పు మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం. లేదంటే మేనేజ్‌మెంట్‌ కోటా ప్రవేశపెడుతూ ఇచ్చిన జీవోను రద్దు చేసి వందశాతం సీట్లనూ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయడం. ఈ రెండూ కాదంటే మూడో ఆప్షన్‌.. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించడం. తీర్పు వచ్చి 20 రోజులు దాటిపోయింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు ఆప్షన్లలో ఏ ఒక్కదాన్నీ ఎంచుకోలేదు. దీంతో అడ్మిషన్లు ఆగిపోయి, విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. కళాశాలల యాజమాన్యాలు ప్రస్తుతానికి మేనేజ్‌మెంట్‌ కోటా కింద విద్యార్థులను చేర్చుకుని చదువు మాత్రం చెబుతున్నాయి. అయితే ఫీజులు ఎవరు కట్టాలి? అసలు విదార్థులు మేనేజ్‌మెంట్‌ కోటాలో చేరినట్లు అనుకోవా లా? కౌన్సెలింగ్‌ ద్వారా చేరినట్లు భావించాలా? అనేది స్పష్టత రావడం లేదు. ప్రస్తుతానికి ప్రతి డిగ్రీ కళాశాలలోను ఇలా చేరినవారు కొంతమంది ఉన్నారు. దీనిపై  ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోకుండా తమ కళాశాలల్లో ప్రవేశం ఇచ్చినట్లుగా కూడా చూపించుకోవడానికి లేదు. పైగా ఆన్‌లైన్‌ అడ్మిషన్‌లో ఐదు కళాశాలలకు ఆప్షన్‌ ఇస్తారు. 


ఇప్పుడు ఒక కళాశాలలో చదువుతూ రేపు ఆన్‌లైన్‌లో మరో కళాశాలలో సీటు వస్తే ఏం చేయాలి? అన్న ప్రశ్న కూడా ఎదురవుతోంది. వాస్తవానికి డిగ్రీలో మేనేజ్‌మెంట్‌ కోటా అన్నది అవసరం లేదన్నది అత్యధికుల అభిప్రాయం. ఇంజనీరింగ్‌, వైద్య కళాశాలల్లో అంటే సీట్లకు పోటీ ఉంటుంది. కళాశాలలు నడిపించుకోవడానికి ఖర్చు ఎక్కువ కాబట్టి మేనేజ్‌మెంట్‌ కోటాకు అనుమతిచ్చారు. కానీ డిగ్రీ కళాశాలలకు ఆ అవసరం లేదు. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో సుమారు 30 శాతం సీట్లు మిగిలిపోతాయి. బీఏ లాంటి డిగ్రీ సీట్లకు పెద్దగా డిమాండ్‌ లేదు. డిమాండ్‌ ఉన్న బీఎస్సీ కంప్యూటర్స్‌, బీఎస్సీ లాంటి సీట్లు అన్నీ భర్తీ అయిపోతాయి. ఈసీట్లకు ఉన్న డిమాండ్‌ను అవకాశంగా తీసుకుని విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడానికి కొన్ని కళాశాలల యాజమాన్యా లు ప్రయత్నించాయని సమాచారం. అదే సమయంలో మేనేజ్‌మెంట్‌ కోటాలో రీయింబర్స్‌మెంట్‌ చేయక్కర్లేదన్న ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది. దీంతో మేనేజ్‌మెంట్‌ కోటాలో సీట్ల కోసం మూడింతలు ఫీజు వసూ లు చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసేసింది. 


సుప్రీం కోర్టుకు వెళ్లే యోచన!

హైకోర్టు తీర్పుపై ఏం చేయాలన్నది నిర్ణయించకుండా ప్రభుత్వం సాగదీస్తోంది. సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే ఈ లోపు విద్యార్థుల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. వారికి అడ్మిషన్లు ఎలా అన్నది అర్థం కావడం లేదు. ఇదే సమయంలో డిగ్రీ క ళాశాలల యాజమాన్యాలు ఉన్నత విద్యామండలికి ఒక ప్రతిపాదన ఇచ్చాయి. మేనేజ్‌మెంట్‌ కోటాలో భర్తీ చేసిన సీట్లకు కూడా మూడింతలు ఫీజు కాకుండా సాధారణ ఫీజే చెల్లించి నా చాలంటున్నాయి.  

Updated Date - 2021-12-25T07:50:21+05:30 IST