ఇంటి పునాది పడేది ఎన్నడు?

ABN , First Publish Date - 2021-02-28T08:08:14+05:30 IST

లక్షల్లో ఇళ్లంటూ ప్రకటించిన వైసీపీ ప్రభుత్వంలో పక్కా ఇళ్లకు అసలు పునాదులు ఎప్పుడు పడతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. డిసెంబరు 25న ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభమైన రోజే... ఇళ్ల నిర్మాణాల పథకాన్నీ సీఎం జగన్‌ లాంఛనంగా

ఇంటి పునాది పడేది ఎన్నడు?

2 నెలలైనా పూర్తికాని ఆప్షన్లు

అసంపూర్తిగానే టెండర్ల ప్రక్రియ

మౌలిక సదుపాయాలూ ఎక్కడివక్కడే

అయోమయంలో గృహ నిర్మాణ శాఖ


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

లక్షల్లో ఇళ్లంటూ ప్రకటించిన వైసీపీ ప్రభుత్వంలో పక్కా ఇళ్లకు అసలు పునాదులు ఎప్పుడు పడతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. డిసెంబరు 25న ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభమైన రోజే... ఇళ్ల నిర్మాణాల పథకాన్నీ సీఎం జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు. రెండు నెలలు దాటిపోయినా, పునాదులు కాదు కదా, కనీసం లబ్ధిదారులు నిర్మాణంలో ఏ ఆప్షన్‌ తీసుకుంటారనే ప్రాథమిక ప్రక్రియను కూడా ప్రభుత్వం పూర్తిచేయలేకపోయింది. ఇంకా నిర్మాణాలకు అవసరమైన టెండర్ల ప్రక్రియే కొలిక్కి రాలేదు. ఇక మౌలిక సదుపాయాల కల్పన పనుల ఆనవాళ్లు కూడా జగనన్న కాలనీల్లో కనిపించడం లేదు. దీంతో అసలు పేదల పక్కా ఇళ్లు ఇప్పట్లో ప్రారంభమవుతాయా అనే సందేహాలు పట్టాలు పొందిన పేదల్లో నెలకొన్నాయి. ప్రభుత్వ తీరు కూడా ఇళ్ల నిర్మాణాలపై వేగంగా అడుగులు పడే అవకాశాలు లేవనట్టే కనిపిస్తోంది. ఏదో మొక్కుబడిగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడమే తప్ప, నిర్మాణాలను ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.


అన్నిట్లో అస్పష్టతే...

అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలం వరకూ పక్కా ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం ఒక్క మాట మాట్లాడలేదు. ఇటీవల మాత్రం పట్టాల హడావిడి మొదలుపెట్టింది. రెండు నెలల కిందట అదే సమయంలో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. అయితే పేరుకి ప్రారంభించినా వాటిని కార్యరూపం దాల్చే విషయంలో గృహనిర్మాణ శాఖ ఎలాంటి కసరత్తూ చేయలేదు. పేపర్లపై ప్రతిపాదనలే తప్ప క్షేత్రస్థాయి అమలులో సాధ్యాసాధ్యాలను అధికారులు అంచనా వేయలేకపోయారు. అసలు ఇళ్లు పేదలు కట్టుకోవాలా...ప్రభుత్వం కట్టిస్తుందా...అనే దానిపైనే స్పష్టత లేకపోవడం గమనార్హం. 30లక్షల ఇళ్లు కట్టాలనే భారీ లక్ష్యం నిర్దేశించుకున్న ప్రభుత్వం తొలి విడతలో 15లక్షల ఇళ్లు పూర్తి లక్ష్యంగా పెట్టుకుంది. 


కొత్త కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేకుండా నిర్మాణాలు ప్రారంభించలేరు. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్‌ కనెక్షన్లు నిర్మాణాలకు అవసరం అవుతాయి. ఈ పనులపై టెండర్లు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఇక నిర్మాణ బాధ్యత ఎవరిది అనేదానిపై 15లక్షల ఇళ్లకు గాను ఇప్పటివరకూ 8లక్షల మంది నుంచే ఆప్షన్లు స్వీకరించారు. ప్రభుత్వం ఇచ్చే నిర్మాణ సామగ్రి తీసుకుని ఇళ్లు కట్టుకునే ఆప్షన్‌ను లక్షన్నర మంది, ప్రభుత్వం ఇచ్చే రాయితీ తీసుకుని కట్టుకునే అప్షన్‌ను 3లక్షల మంది, ప్రభుత్వమే కట్టించే ఆప్షన్‌ను సుమారు మూడున్నర లక్షల మంది ఎంపిక చేసుకున్నారు. అలాగే నిర్మాణ సామగ్రి కొనుగోలు టెండర్ల ప్రక్రియా ఇంతవరకూ కొలిక్కి రాలేదు.


అయోమయంలో యంత్రాంగం..

గత ప్రభుత్వాల్లో ఎవరి స్థలంలో వారు, ప్రభుత్వ రాయితీతో సొంతంగా పేదలే ఇళ్లు కట్టుకునేవారు. దీంతో గృహనిర్మాణశాఖ బాధ్యత తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఇళ్లు కట్టించే భారం హౌసింగ్‌పై పడింది. అందరికీ ఇళ్లు కట్టిస్తామని తొలుత ప్రభుత్వం ప్రకటించింది. అందరూ అదే ఆప్షన్‌ను పెట్టుకుంటున్నారని గ్రహించి, సొంతంగా కట్టుకునే ఆప్షన్‌ పెట్టుకునేలా పేదలపై ఒత్తిడి తీసుకొచ్చింది. అయినా దాదాపు సగం మంది ప్రభుత్వమే కట్టించాలని ఆప్షన్‌లో ఉన్నారు. ఇప్పుడు వారికి ఇళ్లు ఎలా కట్టించాలనేది యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. పూర్తిగా ప్రభుత్వమే కట్టిస్తుందని చెప్పడంతో లబ్ధిదారులు తమకెలాంటి సంబంధం లేదని తేల్చిచెబుతున్నారు. 


తాపీ మేస్ర్తీలను పెట్టే బాధ్యత కూడా తామెక్కడ తీసుకోవాలని హౌసింగ్‌ యంత్రాంగం అయోమయంలో పడిపోయింది.ప్రభుత్వం ఇచ్చే రూ.1.8లక్షల రాయితీతో ఇల్లు నిర్మించడం దాదాపుగా అసాధ్యమే. కానీ ఆ నిధులతోనే ఇల్లు పూర్తిచేసి లబ్ధిదారునికి అప్పగించాల్సిన బాధ్యత అధికారులపై పడింది. ఈ వ్యవహారం అంతా పెద్ద గందరగోళంగా మారిందని ఆ శాఖ అధికారులే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు అసలు ఎప్పుడు ఇళ్లు ప్రారంభమవుతాయనేదానిపైనా క్షేత్రస్థాయి అధికారులకు ఉన్నతస్థాయి నుంచి సమాచారమే లేదు.

Updated Date - 2021-02-28T08:08:14+05:30 IST