సీఎంపై స్పందనలో ఫిర్యాదు?

ABN , First Publish Date - 2021-06-21T09:02:05+05:30 IST

జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ఊరించి, ఉసూరుమనిపించిన వైసీపీ ప్రభుత్వంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సీఎంపై స్పందనలో ఫిర్యాదు?

జాబ్‌ క్యాలెండర్‌తో మోసం చేశారని నిరుద్యోగి ఆరోపణ

హోంమంత్రిపైనా కేసు నమోదుకు డిమాండ్

రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరిక

సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్


కర్నూలు, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ఊరించి, ఉసూరుమనిపించిన వైసీపీ ప్రభుత్వంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఇలా అరాకొర పోస్టులకు ప్రకటన చేయడమేమిటని మండిపడుతున్నారు. ఇదే విషయమై ఓ నిరుద్యోగి ఏకంగా సీఎం జగన్మోహన్‌రెడ్డి, హోంమంత్రి సుచరితలపై స్పందన కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేశాడు. 2019లో 6,500 పోలీసు పోస్టులు భర్తీ చేస్తామని ఏపీ సీఎం ప్రకటించారని, హోం మంత్రి 2020లో 6,300 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారని, తీరా జాబ్‌ క్యాలెండర్‌లో 450 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారని కర్నూలు జిల్లాకు చెందిన ఆ నిరుద్యోగి శనివారం కాల్‌సెంటర్‌కు ఫోన్‌లో తెలిపాడు. లక్షలాదిమంది నిరుద్యోగులను మోసం చేసినందుకు సీఎం, హోంమంత్రిపై కేసు నమోదు చేయాలని, వారిని కర్నూలు కలెక్టరేట్‌కు పిలిపించాలని ఫిర్యాదులో కోరాడు.


అయితే, సీఎం, హోంమంత్రిపై కేసు నమోదు చేసే అవకాశం లేదని కాల్‌సెంటర్‌ నిర్వాహకులు సమాధానమిచ్చారు. అన్యాయం జరిగితే ఎలాంటి వారిపైనైనా స్పందనలో ఫిర్యాదు చేయవచ్చని సీఎం జగన్‌ స్వయంగా చెప్పారని, అలాంటిది ఆయనపైనే కేసు ఎందుకు నమోదు చేయరని ఆ నిరుద్యోగి నిలదీశాడు. ఫిర్యాదు తీసుకోకపోతే రాష్ట్రపతికి తెలియజేస్తానని హెచ్చరించాడు. ప్రస్తుతం ఈ ఆడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది.

Updated Date - 2021-06-21T09:02:05+05:30 IST