కరోనా బాధితులకు పరిహారం ఇవ్వండి

ABN , First Publish Date - 2021-06-22T08:25:52+05:30 IST

కరోనా బాధితులకు పరిహారం ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ డిమాండ్‌ చేసింది. కరోనాతో బాధపడి కోలుకున్న వారికి రేషన్‌ కార్డు ఆధారంగా రూ.10 వేలు, కొవిడ్‌ కారణంగా మృతి చెందినవారి కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు

కరోనా బాధితులకు పరిహారం ఇవ్వండి

రేషన్‌ కార్డు దారులకు రూ.10 వేలు

మృతి చెందినవారి కుటుంబాలకు 10 లక్షలు

ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన టీడీపీ 

29న రాష్ట్రవ్యాప్తంగా వర్చువల్‌ నిరసన

పాల్గొననున్న చంద్రబాబు.. ఇతర నేతలు

ఉద్యోగాలపై నిరుద్యోగుల ఆందోళనకు మద్దతు


అమరావతి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): కరోనా బాధితులకు పరిహారం ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ డిమాండ్‌ చేసింది. కరోనాతో బాధపడి కోలుకున్న వారికి రేషన్‌ కార్డు ఆధారంగా రూ.10 వేలు, కొవిడ్‌ కారణంగా మృతి చెందినవారి కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. కరోనా బాధితులకు పరిహారం కోరుతూ సోమవారం చేపట్టిన ఆందోళనకు కొనసాగింపుగా ఈ నెల 29న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వర్చువల్‌గా నిరసనలు తెలిపాలని నిర్ణయించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆ రోజు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళనలో పాల్గొంటారు. ‘‘కరోనా వల్ల కుటుంబాల ఆదాయాలు తలకిందులయ్యాయి. పొరుగు రాష్ట్రాలు కొన్ని ప్యాకేజీలు ప్రకటించి బాధితులను ఆదుకుంటున్నాయి. ఇక్కడ జగన్‌ ప్రభుత్వం స్పందించలేదు. తెల్ల రేషన్‌ కార్డుదారులకు రూ.పది వేలు, కరోనా బారిన పడి మరణించిన వారి కుటుంబాలకు రూ.పది లక్షలు ఇవ్వాలన్న డిమాండ్‌పై ఒత్తిడి పెంచుతాం. ఉద్యమాన్ని కొనసాగిస్తాం’’ అని సోమవారం నిర్వహించిన సమావేశంలో నేతలు తీర్మానం చేశారు.   అదేవిధంగా ఎన్నికలకు ముందు జగన్‌ ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులు, యువత ఆందోళనకు టీడీపీ నేతలు సంఘీభావం ప్రకటించారు. ముఖ్యమంత్రి తన హామీ ప్రకారం 2.3 లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  ధాన్యం రైతులకు బకాయి ఉన్న రూ.3,600 కోట్లు  వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియమ నిబంధనలకు పాతరేసి అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేపట్టి రూ.వేల కోట్లు దోచుకొంటున్నారని, అక్రమ రవాణా చేస్తున్నారని నేతలు విమర్శించారు.  మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో భారీగా ఆస్తి పన్ను పెంచడాన్ని, కొత్తగా చెత్త పన్ను విధించడాన్ని టీడీపీ నేతలు నిరసించారు. 


ఇంత ఘోరమా?

గుంటూరు జిల్లా తాడేపల్లిలో ముఖ్యమంత్రి ఇంటికి చేరువలో యువతిపై గ్యాంగ్‌రేప్‌ జరగడం ఈ ప్రభుత్వ హయాంలో రౌడీలు, అసాంఘిక శక్తులకు లభించిన పెద్ద పీటకు నిదర్శనమని టీడీపీ నేతలు దుయ్యబట్టారు.   సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన రాజప్ప, నారా లోకేశ్‌, దేవినేని ఉమా మహేశ్వరరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, మాజీఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T08:25:52+05:30 IST