Chandrababu సంచలన వ్యాఖ్యలపై CM YS Jagan రియాక్షన్ ఇదీ..

ABN , First Publish Date - 2021-11-26T19:51:56+05:30 IST

రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన ప్రాణనష్టాన్ని దాచిపెట్టలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు.

Chandrababu సంచలన వ్యాఖ్యలపై CM YS Jagan రియాక్షన్ ఇదీ..

  • వరదల వల్ల మూడు జిల్లాలకు ఎక్కువ నష్టం

అమరావతి: రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన ప్రాణనష్టాన్ని దాచిపెట్టలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం సభలో ఆయన మాట్లాడుతూ బాధితులకు సాయం చేయడానికి ఏ మాత్రం వెనుకాడలేదన్నారు. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు వర్షం పడిందని, వరద బాధితులను ఆదుకునే ప్రయత్నాలు చేశామని చెప్పారు. వరదల వల్ల మూడు జిల్లాలకు ఎక్కువ నష్టం జరిగిందన్నారు. పింఛా ప్రాజెక్ట్‌ ఔట్‌ ఫ్లో సామర్థ్యం కంటే.. మూడు రెట్లు ఎక్కువగా ఇన్‌ఫ్లో వచ్చిందన్నారు. తిరుమల, తిరుపతిలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు. 2, 3 గంటల వ్యవధిలోనే వరద వచ్చి చేరిందన్నారు.


ఓ బస్సు వరదలో చిక్కుకోవడంతో ప్రాణనష్టం జరిగిందని సీఎం జగన్‌ అన్నారు. సగటున 10.7 సెం.మీ వర్షపాతం నమోదైందని, వరద ఉధృతికి ప్రాజెక్టుల కట్టలు తెగిపోయాయన్నారు. పీలేరు, రాయచోటిలో అధిక వర్షపాతం నమోదైందన్నారు. అనూహ్యంగా వరద వచ్చిందని, ఏడాది మొత్తం కురిసిన వర్షాలకు కూడా.. పూర్తిగా నిండని జలాశయాలు ఉన్నాయని.. రెండురోజుల వర్షానికే జలాశయాలు నిండాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు కట్టలు తెగాయని, అన్నమయ్యలో ఇన్‌ఫ్లో 2.3 లక్షల క్యూసెక్కులయితే.. విడుదల సామర్థ్యం 2.17 లక్షల క్యూసెక్కులని అన్నారు. అర్థరాత్రి కూడా జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైందని, 900 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారని చెప్పారు. ప్రతిపక్షాలు వరదల్ని రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. వందేళ్లలో కనీవినీ ఎరుగని విధంగా.. కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయన్నారు.


బాబు కామెంట్స్‌కు జగన్ రియాక్షన్..

ఎప్పటికప్పుడు వరద సహాయక చర్యలు సమీక్షిస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేశానన్నారు. గాలిలోనే వచ్చాను.. గాల్లోనే పోతానని అంటున్నారని, వైఎస్‌ కూడా కాలగర్భంలో కలిసిపోయారు అన్నారు.. అసలు ప్రతిపక్ష నేత చంద్రబాబు అక్కడికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. కడప తన సొంత జిల్లా అని, ఆ జిల్లాపై తనకు ప్రేమ ఎక్కువేనన్నారు. తాను వరద బాధితుల కోసం పర్యటనకు వెళ్తే..అధికారులంతా తన పర్యటనపైనే దృష్టిపెడతారని, దీంతో పనులు జరగవనే ఉద్దేశంతోనే వెళ్లలేదని వివరణ ఇచ్చారు. పనులు జరగడం కావాలని, పర్యటనలు ముఖ్యంకాదన్నారు. ప్రతి గేట్లు ఉన్న రిజర్వాయర్లకు ఆన్‌లైన్‌లో మానిటర్‌ చేసేందుకు ఆటోమేషన్‌ ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు.



Updated Date - 2021-11-26T19:51:56+05:30 IST