CJI NV Ramana కీలక వ్యాఖ్యలు..

ABN , First Publish Date - 2021-12-26T20:11:26+05:30 IST

స్వగ్రామానికి విచ్చేసిన సీజేఐ ఎన్వీ రమణ కానూరులోని సిద్ధార్థ బీటెక్‌ కాలేజీలో జస్టిస్‌ లావు వెంకటేశ్వరరావు స్మారకోపన్యాస సభలో పాల్గొన్నారు....

CJI NV Ramana కీలక వ్యాఖ్యలు..

గుంటూరు : స్వగ్రామానికి విచ్చేసిన సీజేఐ ఎన్వీ రమణ కానూరులోని సిద్ధార్థ బీటెక్‌ కాలేజీలో జస్టిస్‌ లావు వెంకటేశ్వరరావు స్మారకోపన్యాస సభలో పాల్గొన్నారు. వెంకటేశ్వరరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో రమణ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్లుగా న్యాయవ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. వ్యక్తుల స్వేచ్ఛను కాపాడడంలో న్యాయవ్యవస్థది కీలక పాత్ర అని సీజేఐ వ్యాఖ్యానించారు. ఎగ్జిక్యూటివ్, శాసన వ్యవస్థల్లో ఉల్లంఘనలు జరిగితే దాన్ని సరిదిద్దే పాత్ర న్యాయవ్యవస్థదే. పరిపాలన వ్యవస్థ నుంచి సరైన సహకారం లేకపోవడం కూడా.. న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లలో ప్రధానమైంది. ఇంటర్‌నెట్ కేంద్రంగా ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. పరువుకు భంగం కలిగించే కంటెంట్‌ను ఇంటర్‌నెట్‌లో ప్రచారం చేస్తున్నారు. ఇలాంటివన్నీ న్యాయవ్యవస్థకు సవాళ్లుగా మారాయి. మనీ లాండరింగ్, వర్చువల్ కరెన్సీ ద్వారా క్రైమ్ ఫండింగ్ చేస్తున్నారు. క్రిమినల్ చట్టంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. న్యాయవ్యవస్థలో సాంకేతిక నిపుణులకు భాగస్వామ్యం ఉండాలి అని ఎన్వీ రమణ చెప్పుకొచ్చారు.


ఇది దురదృష్టకరం..!

చట్టాలు చేసే ముందు న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. చట్టం రాజ్యాంగబద్ధంగా ఉందా.. లేదా..? అనేది సమీక్షించుకోవాలి. ఇటీవల జడ్జిలపై భౌతికదాడులు పెరిగాయి. అనుకూల తీర్పులు రాకుంటే జడ్జిలపై విమర్శలు చేస్తున్నారు. ఈ తరహా ఘటనలపై విచారణ జరపాలని కోర్టులు ఆదేశిస్తేనే విచారణ ముందుకెళ్తోంది.. ఇది దురదృష్టకరం. జడ్జిలకు స్వేచ్ఛ వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. జడ్జిల నియామకంలో అనేక వ్యవస్థల పాత్ర ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత జడ్జిలకు సరైన భద్రత ఉండడం లేదు. గృహ, వైద్య సదుపాయాలు కూడా సరిగా ఉండడం లేదు. 4.60 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ కేసుల్లో 46 శాతం ప్రభుత్వ కేసులే ఉన్నాయి. వాటిల్లో ఎక్కువగా భూ సంబంధిత వ్యవహారాల కేసులే. అందరి సహకారం ఉంటేనే న్యాయవ్యవస్థ సమర్థవంతంగా పని చేయగలదు అని సీజేఐ వ్యాఖ్యానించారు.Updated Date - 2021-12-26T20:11:26+05:30 IST