రాష్ట్రంలో పౌర హక్కులపై దాడి

ABN , First Publish Date - 2021-05-18T08:03:35+05:30 IST

‘రాష్ట్రంలో పౌర హక్కులపై దాడి జరుగుతోంది. ఎంపీ రఘురామరాజు వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జగన్‌రెడ్డికి చెంపపెట్టు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరం కలిసికట్టుగా పని చేయాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపిచ్చారు...

రాష్ట్రంలో పౌర హక్కులపై  దాడి

  • తప్పుడు కేసులు పెడితే మాట్లాడకూడదా?
  • ప్రత్యర్థులపై దేశద్రోహం కేసు పెడతారా?
  • 43 ఏళ్లలో మొదటిసారి చూస్తున్నా
  • రఘురామ అరెస్టులో నిబంధనలు పాటించలేదు
  • ఆయనవి హేట్‌ స్పీచ్‌లైతే మీవి హేట్‌ స్పీచ్‌లు కాదా?
  • మీరు కులం గురించి మాట్లాడలేదా?
  • సుప్రీం ఆదేశాలు జగన్‌రెడ్డికి చెంపపెట్టు
  • భావ వ్యక్తీకరణను కాపాడుకుందాం
  • చట్ట వ్యతిరేక చర్యలను ప్రతిఘటిద్దాం
  • కరోనాపై అఖిలపక్షం వేయాలి
  • పౌరహక్కుల సంఘం ఆన్‌లైన్‌ భేటీలో
  • చంద్రబాబు, పలువురు నేతల పిలుపు



కులాల గురించి కేసులు పెట్టాల్సి వస్తే.. మొదట వైసీపీ నేతలపైనే సుమోటోగా కేసులు పెట్టాలి. ఎంపీపై పెట్టిన కేసులన్నీ మనం చూశాం. ఆయనవి హేట్‌ స్పీచ్‌లైతే మీవి (సీఎంవి) హేట్‌ స్పీచ్‌లు కాదా? మీరు కులం గురించి మాట్లాడలేదా? అధికారం ఉందని ఏదైనా చేయవచ్చనుకుంటున్నారు. -చంద్రబాబు


అమరావతి/రాజమహేంద్రవరం, మే 17 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో పౌర హక్కులపై దాడి జరుగుతోంది. ఎంపీ రఘురామరాజు వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జగన్‌రెడ్డికి చెంపపెట్టు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరం కలిసికట్టుగా పని చేయాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపిచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురవుతోందన్నారు. రఘురామపై తప్పుడు కేసులు పెడితే తాము మాట్లాడకూడదా అని ప్రశ్నించారు. ఎవరికి అన్యాయం జరిగినా నిలదీసేందుకు టీడీపీ ముందుంటుందన్నారు. ‘ప్రజాస్వామ్యం-భావవ్యక్తీకరణ స్వేచ్ఛ’ అనే అంశంపై సోమవారం రాజమహేంద్రవరం నుంచి ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం, ప్రజా సంఘాల నాయకులు వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీసీఎల్‌సీ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు అధ్యక్షత వహించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, రాజ్యాంగ  హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమిద్దామని, ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం తీసుకురావాలని, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పిలుపిచ్చారు. చంద్రబాబుతోపాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌, సీపీఎం నేత ఎంవీఎస్‌ శర్మ, పౌరహక్కుల నేతలు ప్రసంగించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రం అంటే ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం కాదన్నారు. రఘురామ అరెస్టులో పోలీసులు నిబంధనలు పాటించలేదని.. అధికారులు హద్దులు మీరి ప్రవర్తించడం సరికాదని, చట్టానికి లోబడే పని చేయాలని సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న అధికారులు కూడా శిక్షార్హులే అవుతారని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..


నన్ను ఎన్ని అన్నారు..?

రాజకీయాల్లో నేను 43 ఏళ్ల నుంచి ఉన్నా. అనేక మంది ముఖ్యమంత్రులను చూశా. ప్రత్యర్థులపై దేశ ద్రోహం కేసు ఉంటుందని నాకు తెలియదు. మొదటిసారి చూస్తున్నా. నోటీసు ఇవ్వకుండా కేసులు పెడుతున్నారు. మీడియాను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏబీఎన్‌, టీవీ5పై రాజద్రోహం కేసులు పెట్టారు. జగన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను తుపాకీతో కాల్చేయాలని, చెప్పులతో కొట్టాలని, చీపుర్లతో కొట్టాలని, బంగాళాఖాతంలో పడేయాలని, ఉరి తీయాలని మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం పడిపోతుందని మాట్లాడారు. అయినప్పటికీ మేం ఏనాడూ కేసులు, రాజద్రోహం కేసులు పెట్టలేదు. నన్ను అసెంబ్లీలోనే తిట్టారు. కులం గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు. ఎంపీపై పెట్టిన కేసులన్నీ మనం చూశాం. ఆయనవి హేట్‌ స్పీచ్‌లైతే మీవి (సీఎంవి) హేట్‌ స్పీచ్‌లు కాదా? మీరు కులం గురించి మాట్లాడలేదా? అధికారం ఉందని ఏదైనా చేయవచ్చనుకుంటున్నారు. రఘురామరాజు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంటే జైల్లో కొడతారు. ఆయన కాలికి గాయాలు చూశాం. ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురైతే అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది.




కులాల గురించి మాట్లాడిందే మీరు: రామకృష్ణ

కులాల గురించి మాట్లాడిందే మీరు! అమరావతిని ధ్వంసం చేసేందుకు కులాన్ని ముందుకు తెచ్చారు? రఘురామ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జగన్‌రెడ్డికి చెంపపెట్టు. మీపై నమ్మకం లేకే ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. జగన్‌రెడ్డి సీఎం స్థానంలో ఉండి కరోనా అసలు ఎజెండానే కాదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. సొంత ఎజెండాతో ముందుకెళ్తున్నారు. కక్ష సాధింపులు మరో ఎజెండా. రాష్ట్రంలో స్వేచ్ఛలేదు.




ఫాసిస్ట్‌ మనస్తత్వం: శైలజానాథ్‌

కేంద్రంలో, రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తున్నారు. జగన్‌రెడ్డిది ఫాసిస్ట్‌ మనస్తత్వం. రఘురామ విషయంలో తప్పొప్పులు పక్కనపెడితే .. ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. రఘురామ భాష గురించి వైసీపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది.


విమర్శిస్తే దేశద్రోహం కేసా: ఎంవీఎస్‌ శర్మ

అధికార పార్టీకి చెందిన ఎంపీపైనే దేశ ద్రోహం కింద కేసులు పెట్టారు. అలాంటప్పుడు వైసీపీలోనే ఎందుకు కొనసాగించారు? ప్రజలు ఛీత్కరించుకుంటారనే స్పృహ కూడా లేదు. రఘురామకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే దేశద్రోహం కేసులు పెడతారా? 


కక్ష సాధింపు చర్యలు: ముప్పాళ్ల

ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ హక్కు ఉందని ప్రభుత్వంపై విమర్శలను సద్విమర్శలుగా భావించకుండా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. చట్టాలను, న్యాయస్థానాల ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారు. వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. 


ఇవే తీర్మానాలు..

‘భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ప్రభుత్వదాడిని ఉపసంహరించుకోవాలి. మానవ హక్కుల  కమిషన్‌కు పూర్తిస్థాయి కార్యాలయం, వసతులు కల్పించి, తక్షణం పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మీడియా స్వేచ్ఛపై దాడి చేయడమే కాకుండా  దేశద్రోహం, కుట్ర కేసులు పెట్టడం దురదృష్టకరం. వాటిని బేషరతుగా ఉపసంహరించుకోవాలి. హక్కుల ఉద్యమకారులు మీద, ప్రశ్నించేవారి మీద ‘ఉపా’ వంటి నల్లచట్టాలను ప్రయోగించి, అక్రమ కేసులు బనాయించడం ఆపాలి’ అని సమావేశంలో తీర్మానించారు. 


Updated Date - 2021-05-18T08:03:35+05:30 IST