స్వామీజీల ఆగ్రహంతో సాష్టాంగపడిన ఏపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-02-05T08:34:05+05:30 IST

హిందూ మతాన్ని, హైందవ సమాజాన్ని దెబ్బతీసే విధంగా రాష్ట్రంలో వరుస ఘటనలు జరుగుతున్నాయంటూ పీఠాధిపతులు ఐక్య కార్యాచరణకు నడుం బిగించడంతో జగన్‌ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.

స్వామీజీల ఆగ్రహంతో సాష్టాంగపడిన ఏపీ ప్రభుత్వం

  • విగ్రహాల ధ్వంసంపై స్వామీజీల ఆగ్రహంతో సాష్టాంగపడిన ప్రభుత్వం
  • పీఠాల చుట్టూ ప్రదక్షిణ
  • కొన్ని వారాలుగా వెలంపల్లి ఇదే పనిలో
  • అయినా చల్లబడని పీఠాధిపతులు
  • అనుకున్నట్లే చిత్తూరు హద్దుల్లో భేటీ


(అమరావతి-ఆంధ్రజ్యోతి): హిందూ మతాన్ని, హైందవ సమాజాన్ని దెబ్బతీసే విధంగా రాష్ట్రంలో వరుస ఘటనలు జరుగుతున్నాయంటూ పీఠాధిపతులు ఐక్య కార్యాచరణకు నడుం బిగించడంతో జగన్‌ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఆగ్రహిస్తున్న పీఠాధిపతులు చిత్తూరు జిల్లా సరిహద్దుల్లోని తమిళనాడులో ఒక గ్రామంలో బుధ, గురువారాల్లో కీలక సమావేశాలు నిర్వహించారు. వారు భేటీ కానున్నారని ముందే తెలుసుకున్న సర్కారు.. హుటాహుటిన మంత్రులను రంగంలోకి దించింది. సమావేశాల ఆలోచన విరమించుకోవాలని జరిపిన రాయబారం ఫలించలేదు.  రథాలు తగలబడితే తేనేటీగలు కారణమని, ఆలయాలపై దాడులు జరిగితే పిచ్చోడి చర్య అని, విగ్రహాల విధ్వంసం గుప్తనిధుల వేటగాళ్ల పనేనని రాష్ట్రంలో వరుస ఘటనలపై ప్రభుత్వం వివరణ ఇస్తూ వస్తోంది. ఇదే సమయంలో... ఆంజనేయ స్వామి చెయ్యి విరిగితే రక్తం వస్తుందా? రాముడి విగ్రహం తల తెగిపడితే ప్రాణం పోతుందా? అని  మంత్రి కొడాలి నాని లాంటి వారి వ్యాఖ్యలు సరేసరి! స్వయానా  దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ నివాసానికి సమీపంలో దుర్గమ్మ రథ వెండి సింహాల మాయంపై పొంతనలేని వ్యాఖ్యలు చేసిన పాలకుల తీరును కొన్ని నెలలుగా పీఠాధిపతులు, సాధుసంతులు గమనించారు.


మరోవైపు హిందూ దేవుళ్ల విగ్రహాలను తానే ధ్వంసం చేశానని కాకినాడకు చెందిన పాస్టర్‌ ప్రవీణ్‌చక్రవర్తి విడుదల చేసిన వీడియో స్వామీజీలకు చేరింది. ఈ పరిణామాలపై కలత చెందిన వీరంతా సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు విశాఖలోని రాజగురువు వద్దకు వెళ్లారు. ఆయన సూచన మేరకు పీఠాధిపతుల పాదాలపై పడేందుకు మంత్రులు, శాసన సభ్యులను రంగంలోకి దించారు. 


వినరా.. కనరా...

ఉడుపి శృంగేరి ఉత్తర పీఠాధిపతి భారతీతీర్థ స్వామి శరణు వేడుకోవడానికి జనవరి చివరి వారంలో మంత్రి వెలంపల్లి, వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెళ్లారు. ఏపీలో ఏమీ జరగడంలేదని, చిన్న చిన్న ఘటనలపై కేవలం ప్రచారమేనని వివరించే ప్రయత్నం చేశారు. మైసూరు గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్లి, అంతర్వేది ఆలయ రథాన్ని తయారు చేయించామని, ఫిబ్రవరిలో ఆలయానికి అందజేస్తామని చెప్పారు. కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ముందు సాష్టాంగ నమస్కారం చేసి విగ్రహాల విధ్వంసం జరగడం లేదని, గుప్తనిధుల ముఠాలు చేస్తున్న పనిగా అభివర్ణించే ప్రయత్నం చేశారు. సిద్ధేశ్వరి పీఠాధిపతి కుర్తాళం శంకరాచార్యుల ఆశీస్సుల కోసం ప్రయత్నం చేశారు. సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి పాదాలపై పడి ఆలయాల ఘటనల్లో బాధ్యులపై ప్రభుత్వం చర్య తీసుకుంటుందని తెలిపారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన ఒక మఠాధిపతి గంట గంటకు మత మార్పిళ్లు జరుగుతాయని చెప్పిన పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తినూ చర్యలు తీసుకున్నారా? అని అడిగినట్లు తెలిసింది. జగన్‌ ప్రభుత్వ దూతలు చెప్పినవన్నీ విన్న స్వామీజీలు దూరం నుంచే ఆశీర్వదిస్తూ వెళ్లిరమ్మంటూ చేయి ఊపి సాగనంపినట్టు సమాచారం. కాగా, విశాఖలోని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ సాష్టాంగపడి ఆయన ఆశీర్వచనం పొందారు. 

Updated Date - 2021-02-05T08:34:05+05:30 IST