ఇక సినిమా హాళ్లు ‘ఫుల్‌’

ABN , First Publish Date - 2021-10-14T08:18:05+05:30 IST

ఇక సినిమా హాళ్లు ‘ఫుల్‌’

ఇక సినిమా హాళ్లు ‘ఫుల్‌’

రాష్ట్రంలో 100 శాతం సీటింగ్‌కు అనుమతి

రాత్రి 12 నుంచి ఉదయం 5 వరకూ కర్ఫ్యూ

పెళ్లిళ్లు, ఫంక్షన్లలో 250 మందికి అనుమతి

కొవిడ్‌ నిబంధనలు సడలించిన రాష్ట్ర ప్రభుత్వం


అమరావతి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సినిమా హాళ్లలో 100 శాతం సీటింగ్‌కు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. థియేటర్లతోపాటు ఫిక్స్‌డ్‌ సీటింగ్‌ ఉన్న ఫంక్షన్‌ హాళ్లు, సమావేశ మందిరాల్లోనూ వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతిచ్చింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. తాజా మార్గదర్శకాలు గురువారం నుంచి ఈ నెల 31 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు థియేటర్లు, ఫంక్షన్‌ హాళ్లు, సమావేశ మందిరాల్లో 50 శాతం సీటింగ్‌కే అనుమతి ఉండేది. కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతుండడంతో నిబంధనలు సడలిస్తూ ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. పెళ్లిళ్లు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సభలు, సమావేశాల్లో 250 మందికి అనుమతిచ్చింది. కానీ, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించింది. తప్పనిసరిగా ఽమాస్క్‌ ధరించాలని, శానిటైజర్‌ వాడాలని, భౌతిక దూరం పాటించాలని పేర్కొంది. రాత్రి కర్ఫ్యూ వేళలనూ కుదించింది. ఇప్పటి వరకు రాత్రి 11 నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉండేది. దీన్ని రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు పరిమితం చేసింది. 

Updated Date - 2021-10-14T08:18:05+05:30 IST