అసైన్డ్‌ భూములపై సీఐడీ విచారణ

ABN , First Publish Date - 2021-07-08T09:01:45+05:30 IST

రాజధానిలో అసైన్డ్‌ భూముల విక్రయానికి సంబంధించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదుపై సీఐడీ అధికారులు విచారణ ప్రారంభించారు

అసైన్డ్‌ భూములపై సీఐడీ విచారణ

విజయవాడ, జూలై 7(ఆంధ్రజ్యోతి): రాజధానిలో అసైన్డ్‌ భూముల విక్రయానికి సంబంధించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదుపై సీఐడీ అధికారులు విచారణ ప్రారంభించారు. తొలుత ముగ్గురు నలుగురు రైతులను విజయవాడ పిలిపించి విచారించారు. అనంతరం రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి విచారణ జరిపారు. తాజాగా ఉద్దండరాయునిపాలెం గ్రామానికి దళిత రైతు పూల రవిని బుధవారం సీఐడీ కార్యాలయానికి పిలిపించారు. ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు మూడు గంటలపాటు విచారించారు. రవి తండ్రి శ్యాంసన్‌కు మొత్తం 1.60 ఎకరాల భూమి ఉంది. ఇందులో 60 సెంట్ల భూమిని 2016లో విక్రయించాడు. ఈ భూమికి సంబంధించిన వివరాలను సీఐడీ అధికారులు తెలుసుకున్నారు. అవసరమైతే తదుపరి విచారణకు హాజరుకావాలని అధికారులు సూచించారు.


మాపై ఇంత కక్ష ఎందుకు: పూల రవి

‘‘తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రత్యేక జీవో ద్వారా దళితులు తమకున్న అసైన్డ్‌ భూమిలో కొంత అమ్ముకున్నారు. మా భూమిని నాన్న శ్యాంసన్‌ విక్రయించారు. ఇప్పుడు ఆయన లేరు. దాని గురించి నన్ను ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే ఆర్కేకు మా దళితుల మీద ఇంత కక్ష ఎందుకు? మమ్మల్ని భయపెట్టి భూములు లాక్కున్నారని అంటున్నారు. మేం భయపడిపోవడానికి ఇవేమైనా పాత రోజులా?’’ అని రవి ప్రశ్నించారు.

Updated Date - 2021-07-08T09:01:45+05:30 IST