చిత్తూరు చోరీ కేసులో రూ. 3.04 కోట్ల సొత్తు స్వాధీనం
ABN , First Publish Date - 2021-05-08T08:56:18+05:30 IST
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్తూరు మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు సోదరుడు, పారిశ్రామికవేత్త డీకే బద్రీనారాయణ ఇంట్లో భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు

అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
వారం రోజుల్లోనే కేసు ఛేదన ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడి
చిత్తూరు, మే 7: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్తూరు మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు సోదరుడు, పారిశ్రామికవేత్త డీకే బద్రీనారాయణ ఇంట్లో భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.3.04 కోట్ల విలువైన వజ్రాలు, బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం చిత్తూరులో ఎస్పీ సెంథిల్‌కుమార్ ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు. చిత్తూరులోని బీవీరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న డీకే బద్రీనారాయణ ఇంట్లో గత నెల 28వ తేదీ రాత్రి దొంగలు బంగారు ఆభరణాలు, వజ్రాలు, నగదు దోచుకెళ్లారు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సమాచారాన్ని సేకరించారు. విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం ఉదయం రెడ్డిగుంట సర్కిల్‌కు పోలీసులు వెళ్లారు.
ఆ సమయంలో బుల్లెట్‌లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా.. చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విశాఖ జిల్లా కొత్తగాజువాకకు చెందిన కర్రి సతీశ్ (37), తెలంగాణలోని నల్గొండ జిల్లా చెన్నేపేట్ మండలం బాపంమోర్ తాండాకు చెందిన ఎన్.నరేంద్రగా గుర్తించారు. బద్రీనారాయణ ఇంట్లో చోరీకి పాల్పడినట్లు విచారణలో అంగీకరించారు. కడప జిల్లా రాయచోటికి చెందిన కుమార్ ఆచారి వద్ద 50 గ్రాముల బంగారాన్ని కుదువ పెట్టినట్టు తెలిపారు. వీరి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ కేసులో నిందితుడైన సతీ్‌షపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లె, కాకినాడ, విజయవాడ, నెల్లూరు తదితర చోట్ల మొత్తం 70 కేసులున్నాయి. రెండో నిందితుడైన నరేంద్రపై హైదరాబాద్‌లోని వివిధ పోలీ్‌సస్టేషన్లలో 14, తమిళనాడులో రెండు కేసులు ఉన్నాయి. చోరీ కేసును వారం రోజుల్లోనే ఛేదించిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రమేశ్, రెండో పట్టణ సీఐ యుగంధర్, ఎస్‌ఐలు మల్లికార్జున, మోహన్‌కుమార్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.