చీఫ్‌ సెక్రటరీ... చీప్‌ లెక్కలు

ABN , First Publish Date - 2021-12-08T07:36:04+05:30 IST

చీఫ్‌ సెక్రటరీ... చీప్‌ లెక్కలు

చీఫ్‌ సెక్రటరీ... చీప్‌ లెక్కలు

వారం వారం మద్యంపై నేరుగా సమీక్షలు

అమ్మండి బాబూ.. అమ్మండి

‘సేల్స్‌’ పెంచాలని కలెక్టర్లకు ఆదేశాలు

ప్రాంతాల వారీగా అమ్మకాలపై రివ్యూ

సేల్స్‌ ఎందుకు తగ్గాయంటూ ప్రశ్నలు

బడ్వైజర్‌ బీరు పంపాలన్న ఐఏఎస్‌లు

ఉన్నవే అమ్మి సొమ్ములివ్వాలన్న సీఎస్‌

‘లిక్కర్‌ సేల్స్‌మెన్‌’లా మారామని

వాపోతున్న జిల్లా కలెక్టర్లు

గతంలో ఎస్పీలతోనూ రివ్యూ

తీరు నచ్చక ఐపీఎస్‌ల డుమ్మా!


నాడు పోలవారం.. నేడు బీరువారం

సోమవారం రాగానే ‘పోలవరం’ ప్రాజెక్టుపై గత ప్రభుత్వం సమీక్షించేది. ఇప్పుడు సోమవారం వస్తే మందువారం జరుపుతున్నారు. మద్యం అమ్మకాలపై ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకు ఠంచనుగా సీఎస్‌ సమీక్షిస్తున్నారు. ఒక జిల్లాలో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చేయాల్సిన పనిని ఆయన చేస్తున్నారు. లిక్కర్‌ సేల్స్‌పై, పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా అడ్డుకోవాల్సిన  స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) సరిగా పనిచేయకపోవడంపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సీఎస్‌ క్లాస్‌ తీసుకుంటున్నారు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘ఏమయ్యా! ఇవాళ ఎన్ని కేసుల బీర్లు అమ్మారు? మద్యం ఎంత అమ్ముడయింది? ఆ ఊర్లో సేల్స్‌ తగ్గినట్లున్నాయే! పోయినవారం వచ్చినంత కూడా లేదే. వ్యాపారం ఇలా జరిగితే డబ్బులెట్లా వస్తాయయ్యా! కుదరదు. అమ్మకాలు బాగా పెంచండి. జనానికి కిక్కు ఎక్కాలి. మనకు లెక్క రావాలి. ఈ విషయంలో తగ్గొద్దు’... 

- ఇవి మద్యం వ్యాపారి తన దుకాణాల సిబ్బందికి ఇస్తున్న ఆదేశాలనుకుంటున్నారా? కానే కాదు! రాష్ట్రంలోనే సీనియర్‌ మోస్ట్‌ ఐఏఎస్‌ అధికారి, పాలనా యంత్రాంగానికి సారథి, దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులకు అధిపతి, 190మంది ఐఏఎ్‌సలు, 110 మంది ఐపీఎ్‌సలకు ఏకైక దళపతి అయిన చీఫ్‌ సెక్రటరీ సమీర్‌ శర్మ... కలెక్టర్లు, ఎస్పీలకు జారీ చేస్తున్న ఆదేశాలివి! ‘దశలవారీ మద్య నిషేధం’ అంటూనే... మద్యం ధరలు భారీగా పెంచి, మూడు వేల షాపుల నుంచి ముప్పైవేల కోట్ల రాబడి లక్ష్యంగా పెట్టుకున్న జగన్‌ సర్కారు ఇలా ఐఏఎ్‌సలకూ ‘కిక్కు లెక్కల’ టార్గెట్లు పెట్టింది. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ పెట్టి... ‘లిక్కర్‌ సేల్స్‌’పై రివ్యూ చేస్తున్నారు. కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు వరద తాకిడికి అతలాకుతలమై అనేకమంది ప్రాణాలు కోల్పోయి, వేలాది మంది నిరాశ్రయులైతే ఆయన ఒక్కటంటే ఒక్క గట్టి సమీక్షా సమావేశం కూడా పెట్టలేదు. మద్యం అమ్మకాలపై మాత్రం క్రమం తప్పకుండా వారం వారం కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. ఏవారం లెక్క ఆ వారానిదే.. ఆదాయం ఎంతొచ్చింది.. ఈ వారం ఎంత పెంచారు.. సర్కారు మద్యం ఎంత తాగించారు.. ఇంకా తాగించాల్సిందే. ఎక్కడ తక్కువ తాగారు.. ఎందుకు వ్యాపారం తగ్గింది అనే వాటిపై క్షుణ్ణంగా సమీక్షిస్తూ కలెక్టర్లకు కర్తవ్య బోధ చేస్తున్నారు. జిల్లా మొత్తం ఒడిసిపట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందుంచాల్సిన కలెక్టర్లు... ఈ బీర్లు, బాటిళ్ల లెక్కలు చెప్పలేక సిగ్గుతో తల దించుకొంటున్నారు. మొత్తం ఆదాయార్జన శాఖలపై సమీక్షించి... అందులో భాగంగా ఎక్సైజ్‌ పైనా రివ్యూ చేస్తే అదో పద్ధతి! కానీ... అచ్చం మద్యంపైనే సీఎస్‌ రివ్యూ చేయడం, అందులో తాము పాల్గొనాల్సి రావడం ఇబ్బందికరంగా ఉందని కలెక్టర్లు వాపోతున్నారు.


రివ్యూకు ఎస్పీలు డుమ్మా

పొరుగు మద్యానికి అడ్డుకట్ట వేయడంలో పోలీసులు సైతం సమర్థవంతంగా వ్యవహరించడం లేదంటూ జిల్లాల ఎస్పీలను వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ క్లాస్‌ పీకుతున్నారు. చెక్‌పోస్టుల వద్ద తాత్కాలికంగా నియమించిన సిబ్బందికి జీతాల్లేవని, అవి చెల్లించాలని పోలీసులు కోరినప్పుడు... ‘ఆ సంగతి మాత్రం అడగొద్దు’ అని సీఎస్‌ బదులిచ్చినట్లు తెలుస్తోంది. ‘‘శాంతి భద్రతలు, సహాయ చర్యలు... ఇలా ఏ అంశంపైన అయినా రివ్యూ చేసి ఆదేశాలు జారీ చేస్తే పాటించవచ్చు. కానీ... వారం వారం ఇదెక్కడి గోల! ఎక్కడో మద్యం విక్రయాలు తగ్గితే మేమేం చేయగలం? ఎక్సైజ్‌ నుంచి 70శాతం మంది సిబ్బందిని తీసుకుని, ప్రతి మూడు పోలీసు స్టేషన్ల పరిధిలో ఒక సెబ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసుకుని, సెబ్‌ ద్వారా సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు పెట్టి మరీ ప్రభుత్వం కట్టడి చేస్తున్నారు. ఇంకా మేమేం చేయాలి? పోలీసులు శాంతి భద్రతల నిర్వహణ వదిలేసి మద్యం వ్యాపారాల కోసం చూడాలా?’’ అని ఎస్పీలు కస్సుమంటున్నారు. ఇదే విషయం డీజీపీ దృష్టికి తీసుకెళ్లి... సోమవారం సీఎస్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు అందరూ ముఖం చాటేసినట్లు ప్రచారం జరుగుతోంది.  


డ్రస్‌ వేసుకుని ఇవేం డ్యూటీలో!

పొరుగు మద్యం రాష్ట్రంలోకి రాకుండా, నాటుసారా తయారు చేయకుండా నిరోధించేందుకు సెబ్‌ రాత్రింబవళ్లు పనిచేస్తోందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేనివిధంగా గత 18నెలల్లో 1.64లక్షల కేసులు అక్రమ మద్యం, నాటుసారాకు సంబంధించి నమోదు చేసినట్లు రికార్డులు చూపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.18లక్షల మందిని అరెస్టు చేశామని, 12.89లక్షల లీటర్ల మద్యం, బీరు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. నాటుసారా 1.12లక్షల లీటర్లు సీజ్‌ చేసి సుమారు మూడు కోట్ల లీటర్ల నాటు ఊట ధ్వంసం చేసినట్లు సెబ్‌ వివరిస్తోంది. అక్రమ మద్యం తరలిస్తున్న అన్ని రకాల వాహనాలు కలిపి 40,700 వరకూ సీజ్‌ చేయడం రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ జరగలేదంటున్నారు. అయితే, ఇంత చేసినా సేల్స్‌ పెరగడం లేదని సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో సీఎస్‌ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. పోలీసు యూనిఫామ్‌ వేసుకుని మద్యం షాపుల్లో లిక్కర్‌ సేల్స్‌ గురించి సమీక్షించాల్సి రావడం అసహ్యంగా ఉందని సెబ్‌ అధికారులు వాపోతున్నారు. ‘వీడియో కాన్ఫరెన్స్‌ పెట్టి మద్యం అమ్మకాల టార్గెట్లు ఎందుకు పూర్తికావడం లేదని అడుగుతుంటే ఏం చేయాలో తోచడంలేదు. లిక్కర్‌ షాపుల ముందు నిల్చుని దారినపోయే వాహనాలు ఆపి మందుబాటిల్‌ కొనిపించమని ఆదేశిస్తారేమో’ అంటూ సిబ్బంది వాపోతున్నారు.


ఖిన్నులైన కలెక్టర్లు... 

ఐఏఎ్‌సలుగా మారి చివరకు మద్యం డ్యూటీలు చేయాల్సివస్తోందని ఒకరిద్దరు కలెక్టర్లు ప్రైవేటు సంభాషణల్లో తమ అంతరంగం బయటపెట్టుకున్నారు. ‘మీ జిల్లాలో ఫలానా ప్రాంతంలో సేల్స్‌ తగ్గాయే’ అని సీఎస్‌ అడగ్గా... ‘‘సార్‌, బడ్‌వైజర్‌ బీర్‌కు బాగా డిమాండ్‌ ఉంది. అవి పంపితే సేల్స్‌ పెరుగుతాయి’ అని కొందరు కలెక్టర్లు సూచించారట! అయితే.. వాటితో తనకు సంబంధం లేదని, అందుబాటులో ఉన్న బ్రాండ్లతోనే మంచి ఫలితాలు సాధించాలని ఆయన తేల్చిచెప్పారట! దీంతో కలెక్టర్లు తల పట్టుకున్నారు. 


‘‘జిల్లాల్లో వరదలొచ్చాయ్‌...వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనండి అంటే సిబ్బందిని తీసుకుని మరీ వెళ్తాం. బందోబస్తు డ్యూటీ చేయమంటే రాత్రింబవళ్లు రోడ్లపైనే డ్యూటీ చేస్తాం. కానీ మద్యం అమ్మకాలు పడిపోయాయని మమ్మల్ని పట్టుకుని అడగడం ఏమిటి?’’  

- ఓ జిల్లా ఎస్పీ అంతరంగం

Updated Date - 2021-12-08T07:36:04+05:30 IST