విద్యుత్‌ బాదుడుపై సమరం

ABN , First Publish Date - 2021-09-03T09:23:07+05:30 IST

కరెంటు బిల్లుల బాదుడుకు వ్యతిరేకంగా బలంగా పోరాడాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.

విద్యుత్‌ బాదుడుపై సమరం

  • ప్రజలపై వేల కోట్ల భారం దుర్మార్గం: టీడీపీ
  • జిల్లాల నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌


అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): కరెంటు బిల్లుల బాదుడుకు వ్యతిరేకంగా బలంగా పోరాడాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు గురువారం అన్ని నియోజకవర్గ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఈమేరకు నిర్ణయం తీసుకొన్నారు. రాష్ట్ర ప్రజలపై రూ.వేల కోట్లు భారాన్ని కరెంటు బిల్లుల రూపంలో మోపాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గమని ఆ పార్టీ విమర్శించింది. ‘‘రెండున్నరేళ్లలో రూ.9,000 కోట్లు మేర కరెంటు చార్జీలు పెంచారు. విద్యుత్‌ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని సాకు చూపిస్తున్నారు. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ పేరుతో తెచ్చిన రూ.33 వేల కోట్లు విద్యుత్‌ సంస్థలకు ఇవ్వకుండా దారి మళ్లించి మళ్లీ అదనంగా ప్రజలపై చార్జీల భారం మోపుతున్నారు’’ అని పలువురు నేతలు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం సహా అనేక విషయాల్లో రూ.వేల కోట్ల మేర కుంభకోణాలకు పాల్పడ్డారని, వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. 


మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారికి 21 రోజుల్లో శిక్ష వేయిస్తామని చేసిన ప్రకటనను నిలుపుకోలేనందుకు నిరసనగా దిశ పోలీస్‌ స్టేషన్ల ముందు నిరసన తలపెట్టిన మహిళ, యువత నేతలను పోలీసులు అరెస్టు చేయడాన్ని సమావేశం ఖండించింది. తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరాం చినబాబుపై పోలీసులు దౌర్జన్యం చేయడం దుర్మార్గమని సమావేశం వ్యాఖ్యానించింది. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్న పోలీస్‌ అధికారులపై ప్రైవేటు కేసులు వేయాలని సమావేశం నిర్ణయించింది. కాగా, అధికారాన్ని అడ్డు పెట్టుకొని వైసీపీ నేతలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని, వారి చేష్టలు తాలిబన్లను మించి పోయి ఉంటున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘‘ఉన్మాదుల మాదిరిగా గత రెండేళ్లుగా టీడీపీ నేతలను రకరకాలుగా వేధించారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేనిని అరెస్టుచేసి వేధించారు. జగన్‌రెడ్డి అరాచక విధానాలకు కొందరు పోలీసులు బానిసలయ్యారు. వారిని వదిలిపెట్టం. వారిందరిపైనా ప్రైవేటు కేసులు వేస్తాం’’ అని హెచ్చరించారు. కొందరు పార్టీ నేతల్లో ఇంకా పోరాట స్ఫూర్తి రావాల్సినంతగా రావడం లేదని, పోరాడలేకపోతే పక్కకు తప్పుకోవడం మంచిదని  రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కాగా, పవన్‌ కల్యాణ్‌కు చంద్రబాబు ట్విటర్‌ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 


విద్యుత్‌ చార్జీలు పెంచారా..! లేదా?

ఈ రెండున్నరేళ్లలో రూ.9,000 కోట్ల మేర విద్యుత్‌ చార్జీలు పెంచారా? లేదా? అన్నది వైసీపీ చెప్పాలని టీడీపీ డిమాండ్‌ చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం విలేకరులతో మాట్లాడారు. ‘‘జగన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికి మూడుసార్లు కరెంటు చార్జీలు పెంచారు. నాలుగోసారి పెంచబోతున్నారు. అన్నీ కలిపితే రూ.9,000 కోట్లు దాటిపోతున్నాయి’’ అని చెప్పారు. అప్పులపై సజ్జల రామకృష్ణారెడ్డి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు.


పోలీసుల దుశ్చర్యలు ఎక్కువయ్యాయి: అచ్చెన్న

దిశా పోలీస్‌ స్టేషన్ల ముందు నిరసనలకు దిగిన టీడీపీ నేతలను అరెస్టు చేయడంపై అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్క్చేశారు. తిరుపతిలో పోలీసు లు వ్యవహరించిన తీరును ఆయన ఖండించారు.


విజయమ్మా.. కొడుకు దుర్మార్గాలపై మాట్లాడవేం?: వర్ల

తెలంగాణలో సభలు పెట్టి, అక్కడ రాజకీయాలు చేస్తున్న విజయలక్ష్మి, షర్మిల ఏపీలో జగన్మోహన్‌రెడ్డి అరాచక పాలనకు వ్యతిరేకంగా ఎందుకు పోరాడటం లేదని వర్ల రామయ్య నిలదీశారు. జగన్‌ పాలనకు వ్యతిరేకంగా విజయలక్ష్మి, షర్మిల విజయవాడలో ధర్నా చేయాలని, తామూ మద్దతుగా ధర్నాకు కూర్చుంటామని చెప్పారు. 

Updated Date - 2021-09-03T09:23:07+05:30 IST