Kuppam లో వరుస ఓటములకు కారణమదే.. చంద్రబాబు కీలక నిర్ణయం..
ABN , First Publish Date - 2021-12-09T12:40:23+05:30 IST
Kuppam లో వరుస ఓటములకు కారణమదే.. చంద్రబాబు కీలక నిర్ణయం..

చిత్తూరు జిల్లా/కుప్పం : కుప్పంలో సొంత ఇల్లు కట్టుకుంటానని, అది కూడా పది నెలల్లోపే జరుగుతుందని టీడీపీ అధినేత, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు వెల్లడించారు. వీలైనన్ని ఎక్కువరోజులు కుప్పంలోనే గడుపుతూ, క్షేత్ర స్థాయి పర్యటనలతో పార్టీ బలోపేతానికి స్వయంగా రంగంలో దిగుతానని స్పష్టం చేశారు. తాడేపల్లెలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల పోస్టుమార్టంలో ఆయనీ ప్రకటన చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు చంద్రబాబు ఏమన్నారంటే... ‘కుప్పంలో పార్టీని, కేడర్‌ను పట్టించుకునేవారు ఎవరూ లేకుండా పోయారు. ఒకప్పుడు క్రియాశీలంగా పనిచేసిన వారందరూ ఇప్పుడు ధైర్యం కోల్పోయారు. నా బొమ్మ పెట్టుకుని, నా పేరుతోనే పబ్బం గడుపుతున్నారు తప్ప, సొంతంగా ప్రజల్లోకి వెళ్లి, కార్యకర్తలకు భరోసా ఇచ్చేవారు ఎవరూ కనబడడంలేదు. కుప్పంలో ఈ వరుస ఓటములకు ప్రధాన కారణం అదే. ఇక ఉపేక్షిస్తే లాభం లేదు. కుప్పంలోనే ఇల్లు కట్టుకుంటా. ఇంటి నిర్మాణాన్ని పది నెలల్లో పూర్తి చేస్తా. తరచూ కుప్పానికి వచ్చి, వారంపది రోజులపాటు స్టే చేస్తా. తొలుత ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఎలా తిరిగానో,అలాగే నియోజకవర్గంలోని గ్రామగ్రామానా పర్యటించి, కేడర్‌తో పాటు ప్రజలనూ కలుస్తా. దేని గురించి చెప్పాలనుకున్నా కార్యకర్తలు, క్షేత్ర స్థాయి నాయకులు నేరుగా నాతోనే టచ్‌లో ఉండండి. నేనే మీ బాగోగులు చూస్తా. మీతో కలసి నడుస్తా. ఎవరూ అధైర్యపడొద్దు. మీవెంటే నేనుంటా’ అంటూ చంద్రబాబు కుప్పం శ్రేణులకు భరోసా ఇచ్చినట్టు తెలిసింది.