దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒక్కరోజు అన్నదానం

ABN , First Publish Date - 2021-03-22T09:17:17+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం తిరుమలలో ఒక్కరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది.

దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒక్కరోజు అన్నదానం

తిరుమల, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం తిరుమలలో ఒక్కరోజు అన్నదాన  కార్యక్రమం జరిగింది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద వితరణకు రోజూ రూ.30 లక్షల ఖర్చవుతుంది. ఒక్కరోజు అన్నదానం ఖర్చును విరాళంగా ఇస్తే దాత పేరును భవనంలో డిస్‌ప్లే చేస్తారు. ఏటా దేవాన్ష్‌ పుట్టిన రోజు కానుకగా టీటీడీలో ఒక్కరోజు అన్నదాన వితరణకు అయ్యే వ్యయం రూ. 30లక్షలను విరాళంగా ఇవ్వడం చంద్రబాబు కుటుంబానికి ఆనవాయితీగా వస్తోంది.


కుటుంబ సభ్యులతో కలసి వచ్చి ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనేవారు. గతేడాది కూడా అన్నప్రసాదాల వితరణకోసం టీటీడీకి రూ.30 ల క్షలు పంపారు. అయితే కరోనా కారణంగా అన్నప్రసాద వితరణ జరగలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆ విరాళంతో అన్నప్రసాదాలను వడ్డించాలని టీటీడీకి చంద్రబాబు కుటుంబం  కోరింది. దీంతో ఆదివారం తరిగొండ వెంగమాంబ నిత్యాప్రసాద భవనంలో ‘టుడే డోనర్‌ మాస్టర్‌ నారా దేవాన్ష్‌’ అనే పేరుతో ఒక్కరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 


ఘనంగా దేవాన్ష్‌ పుట్టినరోజు వేడుకలు

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, లోకేశ్‌ కుమారుడు నారా దేవాన్ష్‌ జన్మదిన వేడుకలను ఆదివారం టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి, దేవాన్ష్‌ పుట్టిన రోజు వేడుకలను జరిపారు. ఎమ్మెల్సీ టీడీ జనార్థన్‌, టీడీపీ నేతలు గురజాల మాల్యాద్రి, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, బుచ్చిరామ్‌ప్రసాద్‌, దారపనేని నరేంద్ర, వల్లూరు కుమారస్వామి, బండారు వంశీకృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-22T09:17:17+05:30 IST