సిమెంటు మంటలు హడలెత్తిస్తున్న స్టీలు!

ABN , First Publish Date - 2021-01-13T09:15:56+05:30 IST

సిమెంటు ధర మంటలు రేపుతోంది. స్టీల్‌ రేటు ఆల్‌ టైం రికార్డు స్థాయికి చేరుకుంది. ధరల పెరుగుదలకు సంబంధించి కంపెనీల మధ్య చర్చలు జరిగిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు.

సిమెంటు మంటలు హడలెత్తిస్తున్న స్టీలు!

  • సిమెంటు బస్తాకు రూ.70-100 పెంపు.. 
  • టన్నుకు రూ.20వేలు పెరిగిన స్టీల్‌ ధర 
  • వాట్సాప్‌లోనే యాజమాన్యాల చర్చలు..
  •  కాల్‌ రికార్డింగ్‌లు లేకుండా జాగ్రత్తలు 
  • ఉత్పత్తిని తగ్గిస్తూ, డిస్పాచ్‌పై నియంత్రణ.. 
  • నిబంధనలకు విరుద్ధంగా ధరల పెంపు 
  • లబోదిబోమంటున్న నిర్మాణదారులు 


(అమరావతి-ఆంధ్రజ్యోతి) : సిమెంటు ధర మంటలు రేపుతోంది. స్టీల్‌ రేటు ఆల్‌ టైం రికార్డు స్థాయికి చేరుకుంది. ధరల పెరుగుదలకు సంబంధించి కంపెనీల మధ్య చర్చలు జరిగిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. అంతా గప్‌చు్‌పగా జరిగిపోతోంది. అటు ఫోన్‌ కాల్స్‌ లేకుండా, ఇటు ఎస్సెమ్మె్‌సలూ లేకుండా కేవలం వాట్సాప్‌ కాల్స్‌ ద్వారా యాజమాన్యాలు చర్చించుకుంటున్నాయి. సిమెంటు డిస్పాచ్‌ను తగ్గించడం, ధరలు విపరీతంగా పెంచేయడం, స్టీల్‌ ధరలు ఆకాశాన్నంటేలా చేసి లాభాలు ఆర్జించడంతో పాటు మార్కెట్లో సిమెంటు, స్టీల్‌పై ఆధారపడి ఉన్న ఇతర ఉత్పత్తుల ధరలు పెంచేయడం గురించి వీరి చర్చలు సాగుతున్నాయని చెబుతున్నారు. సాధారణ ఫోన్‌కాల్స్‌ అయితే రికార్డవుతాయి. ఎస్సెమ్మెస్‌లు చేసుకుంటే ప్రభుత్వం, నియంత్రణ సంస్థలకు దొరికిపోతామని వాట్సా్‌పలో మాత్రమే మాట్లాడుకుంటున్నారని సమాచారం. తెల్లారేసరికి అన్నిచోట్లా మూకుమ్మడిగా రేట్లు పెంచేస్తున్నారు. రేట్లు ఆకాశానికి ఎగబాకడంతో నిర్మాణరంగం కుదేలవుతోంది. ఇప్పటికే ఇసుక కొరత, కరోనా దెబ్బకు నిర్మాణదారులు దిక్కుతోచని స్థితిలో పడిపోగా... నానాటికీ పెరుగుతున్న సిమెంటు, స్టీలు ధరలతో పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండుపడినట్లుగా తయారైందని వాపోతున్నారు. 


కొవిడ్‌కు ముందు... ఆ తర్వాత 

కరోనా లాక్‌డౌన్‌కు ముందు సిమెంటు బస్తా రూ.260 ఉండేది. అల్ర్టాటెక్‌, కేసీపీ వంటి కంపెనీలవి రూ.300 వరకు అమ్మేవారు. ఇప్పుడు ఇతర సిమెంటు కంపెనీలది బస్తా రూ.320కి చేరిపోగా... అల్ర్టాటెక్‌, కేసీపీ సిమెంట్‌ రిటైల్‌ మార్కెట్‌లో రూ.400కు పెరిగిపోయాయి. అంటే దాదాపు రూ.60-100వరకు సిమెంటు బస్తా ధర పెరిగింది. ఇక స్టీలు ధరలైతే మరీ దారుణం. కొవిడ్‌కు ముందు రూ.46వేలు ఉన్న టన్ను ధర ఇప్పుడు రూ.66 వేలకు పెరిగిపోయింది. గతంలో ఒకటి రెండు రూపాయలు.. మహా అయితే రూ.పది వరకూ పెరిగే సిమెంటు ధర ఇప్పుడు ఏకంగా రూ.వంద పెరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక ధర రెట్టింపు కావడంతో కుదేలవుతున్న నిర్మాణదారులు స్టీల్‌, సిమెంటు ధరలు సైతం ఆకాశాన్నంటడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 


ఉత్పత్తిని నియంత్రించి మాయ  

రాష్ట్రంలో కొవిడ్‌కు ముందున్న పరిస్థితులే దాదాపుగా ఇప్పుడూ ఉన్నాయి. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం నిర్మాణాలు తగ్గుముఖం పట్టాయి. ఈ సమయంలో కూడా సిమెంటు, స్టీల్‌ ధరలు పెరగడం కేవలం కంపెనీల మాయాజాలమేనన్నది బహిరంగ రహస్యమే. ఉద్దేశపూర్వకంగా ఉత్పత్తిని తగ్గించడం, డిస్పాచ్‌ను నియంత్రించడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ధరలను పెంచేస్తున్నారు. కొవిడ్‌ తర్వాత ఇప్పుడిప్పుడే నిర్మాణాలు మొదలవుతుండగా... ఇంతలోనే ధరల పెంపు పెనుభారంగా మారిందని వినియోగదారులు వాపోతున్నారు. సిమెంటు, స్టీల్‌ కంపెనీలు కుమ్మక్కై పెంచిన ధరలు నిర్మాణరంగంతోపాటు కార్మికవర్గం పైనా ప్రభావం చూపుతున్నాయి. దీనిపై ప్రభుత్వాలు తక్షణమే దృష్టిసారించి తగిన చర్యలు తీసుకోకుంటే ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-01-13T09:15:56+05:30 IST