తనిఖీలు లేకుండా ‘నైపుణ్యం’పై కేసులా?

ABN , First Publish Date - 2021-12-19T08:22:07+05:30 IST

తనిఖీలు లేకుండా ‘నైపుణ్యం’పై కేసులా?

తనిఖీలు లేకుండా ‘నైపుణ్యం’పై కేసులా?

శిక్షణ ఇచ్చిన 40 కళాశాలల ఇన్‌స్పెక్షన్‌కు వస్తారా?

సీఐడీకి అయ్యన్న సవాల్‌

విశాఖపట్నం, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘‘ఒక సంస్థపై ఫిర్యాదు వచ్చినా, ప్రభుత్వం ఆదేశించినా తొలుత భౌతికంగా విచారణ జరిపి నిర్ధారణకు రావాలి. అంతేకాని సీఎం జగన్మోహన్‌రెడ్డి చెప్పారని వెంటనే సోదాలు, అరెస్టులు చేయకూడదు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కోసం 40 కళాశాలల్లో కొనుగోలు చేసిన పరికరాలు, శిక్షణ తదితర అంశాలపై ముందు సీఐడీ తనిఖీలు చేపట్టాలి. తనిఖీలకు నేనుకూడా వస్తా. నా సవాల్‌ని సీఐడీ స్వీకరిస్తుందా?’’ అని అయ్యన్న ప్రశ్నించారు. శనివారం పార్టీ కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి పట్టాభితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి భౌతిక తనిఖీలు చేపట్టకుండా నైపుణ్యాభివృద్ధి సంస్థలో అవినీతి జరిగిందంటూ ఇద్దరు వ్యక్తులపై సీఐడీ కేసులు నమోదు చేయడాన్ని అయ్యన్న తప్పు పట్టారు. సీఐడీ ముఖ్యమంత్రి జేబు సంస్థగా మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో సమస్యలు ఎక్కువగా వచ్చినప్పుడు వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి జగన్‌ ప్రభుత్వం మళ్లింపు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. లక్ష్మీనారాయణను పరామర్శించడానికి వెళ్లిన ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై కూడా కేసులు పెట్టారన్నారు. అవినీతి జరిగిందని చెబుతున్న ప్రభుత్వం, ఆ సంస్థలో కీలకమైన ప్రేమచంద్రారెడ్డిని ఎందుకు విడిచిపెట్టిందని ప్రశ్నించారు. అయితే ఆయన అవినీతి చేశారని తాను చెప్పడం లేదన్నారు. కానీ ఆయన్ను కూడా విచారించాలన్నదే తన భావమని స్పష్టం చేశారు. వారణాశిలో అభివృద్ధి చూడాలని సొంత ఎంపీలకు సూచించిన ప్రధాని మోదీ గతంలో తాను శంకుస్థాపన చేసిన అమరావతిని చూడాలని ఎందుకు చెప్పడం లేదని అయ్యన్న ప్రశ్నించారు. మాజీ సీఎం చంద్రబాబుపై బురదజల్లే ప్రయత్నమే స్కిల్‌ డెవల్‌పమెంట్‌పై కేసు వ్యవహారమని పట్టాభి ఆరోపించారు. సీఐడీ అంటే చిత్తం దొర ఇన్వెస్టిగేషన్‌ డిపార్టుమెంట్‌ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై అయ్యన్న సవాల్‌ను డీజీపీ లేదా సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ స్వీకరిస్తారా అని సవాల్‌ చేశారు. భౌతికంగా తనిఖీలు చేయకుండా అరెస్టులు ఎలా చేస్తారో సీఐడీ చెప్పాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న దాడులను తిప్పికొట్టడానికి అన్ని డాక్యుమెంట్లతో సిద్ధంగా ఉన్నామన్నారు. అదే సాక్షి జీతగాడు ఎప్పుడైనా ఇలా ఆధారాలతో వచ్చారా? అని పట్టాభి ప్రశ్నించారు. రాజధాని పేరుతో ఉత్తరాంధ్రలో రాజన్న రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ తెరిచి, దాని బాధ్యతలు విజయసాయిరెడ్డికి అప్పగించారన్నారు. విశాఖలో పులివెందుల రౌడీయిజం చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని పట్టాభి అన్నారు.

Updated Date - 2021-12-19T08:22:07+05:30 IST