కబ్జా కోరలు

ABN , First Publish Date - 2021-02-01T08:25:57+05:30 IST

అధికారం చేతిలో ఉంటే సొంత ఊరే కాదు.

కబ్జా కోరలు

  • గుంటూరు జిల్లా భూములపై
  • రాజంపేట ఎమ్మెల్యే కుమారుడి కన్ను
  • విలువ రూ.60 కోట్ల పైనే
  • తప్పుడు జీపీతో పేదలకు బెదిరింపులు
  •  ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలని హుకుం
  •  రెవెన్యూ, పోలీసు అధికారుల సహకారం
  • హోంమంత్రి సొంత నియోజకవర్గంలో దారుణం
  • బాధితుల ఆందోళన..రాస్తారోకో


(గుంటూరు-ఆంధ్రజ్యోతి): అధికారం చేతిలో ఉంటే సొంత ఊరే కాదు.. రాష్ట్రంలో ఎక్కడైనా కబ్జా చేసేయొచ్చన్నట్టు ఉన్నాయి వైసీపీ నేతల చర్యలు. గుంటూరు జిల్లా నల్లపాడు సమీపంలోని ఖరీదైన భూమిపై కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జునరెడ్డి తనయుడు మేడా వెంకటరామిరెడ్డి కన్ను పడింది. సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత సొంత నియోజకవర్గంలోనే ఈ కబ్జా పర్వం కొనసాగుతుండటం గమనార్హం. ఆ భూమికి చెందిన పూర్వపు హక్కుదారుల కుటుంబసభ్యులతో చేతులు కలిపి డెవల్‌పమెంట్‌ పేరుతో తప్పుడు జీపీని రాయించుకొన్నారు. అక్కడ దశాబ్దాలుగా నివసిస్తున్నవారిని ఖాళీ చేయాలని ప్రస్తుతం బెదిరింపులకు దిగారు. రెవెన్యూ అధికారుల అండదండలతో పేదలపై ఒత్తిడి పెంచుతోన్నారు. అధికారపార్టీ నేత కుమారుడి వ్యవహారం కావడంతో పోలీసులు కూడా ఆయన పక్షానే మాట్లాడుతున్నారు.


బాధితులు ఫిర్యాదులు చేసినా తీసుకోవడం లేదు. దీంతో తమ ఇళ్లను కూల్చి వేస్తారేమోనని కొన్ని నెలలుగా బాధితులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. నల్లపాడులోని సర్వే నెంబరు. 563/5లో 8.74 ఎకరాల భూమిని 1942లో చల్లా చలమారెడ్డి కొనుగోలు చేసి గుంటూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఆ తర్వాత వేరే సర్వే నెంబరు(422/ఏ)లోని 8.5 సెంట్ల స్థలంలో ఉన్న పెంకుటిల్లుతో కలిపి మొత్తం 8.8250 ఎకరాల భూమిని రిజిస్టర్‌ చేయించుకున్నారు. 1950లో ఈ మొత్తం భూమిని నల్లూరి రామస్వామి వద్ద తాకట్టు పెట్టి రుణం తీసుకొన్నారు. ఆ రుణం తిరిగి చెల్లించకపోవడంతో 1956లో రామస్వామి గుంటూరు మున్సిఫ్‌ కోర్టులో తన పేరు మీద ఆ స్థలానికి డిక్రీ పొందారు. 1958లో సేల్‌ కోసం దాఖలు చేయగా 1959లో కోర్టు సేల్‌ సర్టిఫికేట్‌ జారీ చేసింది.


 ఇందులోని 8.50 సెంట్ల స్థలాన్ని చల్లా కోటమ్మకు 1961లోనే రామస్వామి విక్రయించారు. మిగిలిన 8.74 ఎకరాల భూమిని షేక్‌ అబ్దుల్‌ రజాక్‌, ఆళ్ల సుందరరామిరెడ్డి, ఆళ్ల పిచ్చిరెడ్డిలకు విక్రయించారు. ఈ భూమిని 1969-70లో వారు 170-700 గజాల చొప్పున 120 ప్లాట్లుగా చేసి విక్రయించారు. ఆ సమయంలో సర్వే నెంబరు 563/5కి బదులుగా 563/ఏగా రాశారు. 1971లో ఆ స్థలాన్ని రీసర్వే చేసి 563/5గా మార్చారు. అక్కడ 31 మంది పక్కా భవనాలు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. మరికొంత మంది ఇళ్లు నిర్మించుకొంటున్నారు. ప్రస్తుతం మాతృశ్రీ అనసూయాంబనగర్‌గా ఈ ప్రాంతాన్ని పిలుస్తున్నారు. కాగా, చల్లా చలమారెడ్డి వారసులు ఆ భూమి తమదేనని, తమకు వ్యవసాయ పట్టా ఇవ్వాలని గుంటూరు ఆర్‌డీవోకు అర్జీ పెట్టుకొన్నారు. దీనిపై ఎంజాయ్‌మెంట్‌ సర్వే చేయకుండా సదరు అర్జీపై తమను ఎవరూ సంప్రదించలేదంటూ రెవెన్యూ అధికారులు జనవరి 5న చల్లా శ్రీనివాసరెడ్డి పేరుతో అడంగల్‌లో పట్టా పాసుపుస్తకాలు జారీ చేశారు. జనవరి 6నే  చలమారెడ్డి భార్య అచ్చమ్మతో ఆ భూమిని డెవల్‌పమెంట్‌ కోసమంటూ రాజంపేట ఎమ్మెల్యే కుమారుడు మేడా వెంకటరామిరెడ్డి తప్పుడు జీపీ చేయించుకొన్నారు. దాని ప్రకారం ఇళ్లు ఖాళీ చేయాలని పేదలపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. 


గుంటూరు-హైదరాబాద్‌ రహదారిపై రాస్తారోకో..

నల్లపాడులోని మాతృశ్రీ అనసూయాంబనగర్‌లో నివాసితులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. గుంటూరు-హైదరాబాద్‌ రహదారిపైనా కొద్దిసేపు రాస్తారోకో చేశారు. తమ నివాస స్థలాలను ఆక్రమించుకునేందుకు రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. సర్వే నెంబరు 563/5లోని 8.74 ఎకరాల భూమి(విలువ రూ.60 కోట్లు)తాను డెవల్‌పమెంట్‌ కోసం తీసుకొన్నానంటూ మేడా వెంకటరామ్‌రెడ్డి పేరున సృష్టించిన తప్పుడు ఒప్పందాలతో బెదిరిస్తున్నారని తెలిపారు. దాదాపు 60 సంవత్సరాలుగా ఈ స్థలాలు అనేక మంది చేతులు మారాయని, ఇప్పుడొచ్చి ఆ భూములు తమవి అనడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు.


ఇప్పటికే నివాసాలు ఉంటున్న ఈ స్థలంలో ఇంకేం అభివృద్ధి చేస్తారని నిలదీశారు. ఎమ్మెల్యేకు స్థానిక అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. అధికారుల వద్దకు వెళ్తే తమపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోయారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్‌ చేశారు. హోంమంత్రి కూడా తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-02-01T08:25:57+05:30 IST