మా పోరాటంలో న్యాయముంది

ABN , First Publish Date - 2021-03-14T09:55:16+05:30 IST

తమ పోరాటంలో న్యాయం ఉందని, అక్రమ కేసులకు భయపడేది లేదని రాజధాని రైతులు ఉద్ఘాటించారు. రాజధాని అమరావతికి భూములిచ్చి రోడ్డున పడిన రైతుల గోడు

మా పోరాటంలో న్యాయముంది

అక్రమ కేసులకు భయపడేదిలేదు ..

452వ రోజు రాజధాని రైతుల ఆందోళన


తుళ్లూరు/తాడికొండ, మార్చి 13: తమ పోరాటంలో న్యాయం ఉందని, అక్రమ కేసులకు భయపడేది లేదని రాజధాని రైతులు ఉద్ఘాటించారు. రాజధాని అమరావతికి భూములిచ్చి రోడ్డున పడిన రైతుల గోడు వినని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలని, మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమం శనివారం 452వ రోజుకు చేరుకుంది. రాజధాని రైతులపై ప్రభుత్వం వివక్షత చూపుతోందన్నారు. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం,యర్రబాలెం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, దొండపాడు, బేతపూడి, ఉండవల్లి తదితర గ్రామాల్లో శిబిరాలలో రైతులు ఆందోళనలు కొనసాగించారు. 


రాజధాని రైతులపై మరో కేసు

రాజధాని రైతులు, మహిళలపై తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా దుర్గమ్మ గుడికి వెళుతున్న మహిళలను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో కొంతమంది మహిళలకు గాయాలయ్యాయి. మరుసటి రోజు వారిని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తుళ్లూరు దీక్ష శిబిరానికి వచ్చారు. ఆ సమయంలో పోలీసు అధికారుల విధులను ఆటంక పరిచారని, తమపై రైతులు, మహిళలు  దౌర్జన్యం చేశారని ఎస్‌ఐ సోమేశ్వరావు ఫిర్యాదు మేరకు నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద తుళ్లూరు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

Updated Date - 2021-03-14T09:55:16+05:30 IST