ఆనందయ్యకు పెరుగుతున్న ప్రజాదరణ.. క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో వైసీపీ నేతలు!

ABN , First Publish Date - 2021-05-24T20:59:17+05:30 IST

ఆనందయ్య మందుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ మందులో ఎలాంటి హానికర పదార్థాలు లేవని ఆయుష్ తేల్చింది.

ఆనందయ్యకు పెరుగుతున్న ప్రజాదరణ.. క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో వైసీపీ నేతలు!

నెల్లూరు: ఆనందయ్య మందుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ మందులో ఎలాంటి హానికర పదార్థాలు లేవని ఆయుష్ తేల్చింది. అయితే ఐసీఎంఆర్ ఏం నివేదిక ఇస్తుందన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా ఆనందయ్య మందు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. జనం నుండి అనూహ్య మద్దతు వస్తుండటంతో మందుపై శాస్త్రీయ అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఆయూష్ ప్రతినిధుల సమక్షంలో ఆనందయ్య ఈ మందును తయారు చేశారు. వాడుతున్న మూలికలను, తయారీ పద్ధతిని పరిశీలించిన ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు ఈ మందులో ఎలాంటి హానికర పదాదార్థాలను వాడటం లేదని గుర్తించామన్నారు. అయినప్పటికీ శాస్త్రీయత ధృవీకరణ జరిగే వరకు ఆనందయ్య మందును నాటుమందుగానే పరిగణిస్తామని రాములు చెప్పారు. కళ్లలో వేసే డ్రాప్స్‌లో కూడా సాధారణ పదార్థాలే వాడుతున్నారని అన్నారు. అయితే ఆనందయ్య మందు రోగులపై పనిచేస్తుందా లేదా అనేది ఆయుర్వేద డాక్టర్ల బృందం తేల్చుతుందని, డాక్టర్ల బృందం పరిశీలన అనంతరం తమ నివేదికను సీసీఆర్ఎఎస్‌‌కు పంపుతుందున్నారు. 


తన మందుపై అపోహలు, అనుమానాలు నివృత్తి చేసేందుకు ఐసీఎంఆర్ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆనందయ్య అన్నారు. మందు పంపిణీపై సీఎం సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని తెలిపారు. అధికారికంగా ఐసీఎంఆర్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఐసీఎంఆర్ బృందం ఎదుట ఆనందయ్య ఈ మందును తయారు చేసి చూపించనున్నారు. దీంతో పాటు మందు వాడిన వారి నుంచి వివరాలు సేకరించిన తర్వాత ఐసీఎంఆర్ నివేదక ఇవ్వనుంది.


ప్రస్తుతం ఆనందయ్య పోలీసుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయనను కలిసేందుకు పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. అయితే ప్రభుత్వానికి చెందిన ముఖ్యనేత ఆనందయ్యతో చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం సహకారంతో మందు పంపిణీ చేసేందుకు ముఖ్యనేత ఒప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆనందయ్యకు ఉన్న ప్రజాదరణను అనుకూలంగా మలచుకునేందుకు అధికారపార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయన మందుపై తమ ఫేస్ బుక్ పేజీలలో ప్రత్యేకంగా ప్రస్తావించడం లాంటివి చేస్తూ... ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు కార్పొరేట్‌ శక్తుల నుంచి ఆనందయ్యకు బంపర్ ఆఫర్‌ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ఆఫర్‌ను ఆనందయ్య తిరస్కరించినట్లు చెబుతున్నారు.

Updated Date - 2021-05-24T20:59:17+05:30 IST