మందుపాతరకు ఐటీబీపీ జవాను బలి

ABN , First Publish Date - 2021-02-26T08:31:10+05:30 IST

చత్తీస్గఢ్‌లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి చిత్తూరు జిల్లా కలికిరి మండలం పాలెంకొండలోని ఇండో టిబెటెన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) దళానికి చెందిన జవాను బలయ్యాడు...

మందుపాతరకు ఐటీబీపీ జవాను బలి

  • చత్తీస్గఢ్‌లో మావోయిస్టుల దుశ్చర్య


కలికిరి, ఫిబ్రవరి 25: చత్తీస్గఢ్‌లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి చిత్తూరు జిల్లా కలికిరి మండలం పాలెంకొండలోని ఇండో టిబెటెన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) దళానికి చెందిన జవాను బలయ్యాడు. బుధవారం సాయంత్రం చత్తీ్‌సగడ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన మందుపాతర పేలుడులో ఐటీబీపీ జవాను ఎల్‌.బాలు చామి (32) అశువులు బాశాడు. పేలుడు ధాటికి ఆయనకు తీవ్రగాయాలు కావడంతో, వెంటనే నారాయణపూర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూనే కన్నుమూశాడు. ఆయనతోపాటు చత్తీ్‌సగడ్‌ పోలీసుశాఖకు చెందిన మరో పోలీసు కూడా మృతి చెందినట్లు సమాచారం. కలికిరి ఇండో టిబెటెన్‌ భద్రతా దళానికి చెందిన 53వ బెటాలియన్‌ నుంచి ఐదు కంపెనీల దళాలు మావోయిస్టుల ఏరివేతకు నారాయణపూర్‌ జిల్లాకు వెళ్లాయి. విధి నిర్వహణలో భాగంగా బుధవారం ఉదయం సోన్‌పూర్‌ (సీవోబీ) నుంచి ఒక రోడ్‌ ఓపెనింగ్‌ పార్టీ.. రహదారుల్లో బాంబులను గుర్తించేందుకు వెళ్లి సాయంకాలం విధులు పూర్తి చేసుకుని క్యాంపునకు తిరిగి వస్తున్న సమయంలో సోన్‌పూర్‌ క్యాంపుకు 3 కిలోమీటర్ల దూరంలో మావోయిస్టులు మందుపాతర పేల్చినట్లు ఇక్కడి ఐటీబీపీ బెటాలియన్‌ ధ్రువీకరించింది. ఈ ఘటనలో మరణించిన బాలు చామి తమిళనాడులోని మదురై జిల్లా పోయ్‌కై కరైపట్టి గ్రామానికి చెందినవాడని బెటాలియన్‌ వర్గాలు తెలిపాయి. ఆయనకు భార్య, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. కాగా.. తమ బెటాలియన్‌కు చెందిన జవాను మృతి చెందడంతో కమాండెంట్‌ పంకజ్‌కుమార్‌ వర్మ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బెటాలియన్‌లో వున్న ఇతర అధికారులు, జవాన్లు సహచరుడి మృతికి తీవ్ర సంతాపం తెలిపారు. బాలుచామి భౌతికకాయం ప్రత్యేక విమానంలో బెంగుళూరు చేరుకుందని అసిస్టెంట్‌ కమాండెంట్‌ బి.శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రభుత్వ లాంఛనాలతో ఆయన స్వగ్రామానికి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడి క్యాంపు నుంచి ఐటీబీపీ ఉద్యోగులు భౌతిక కాయాన్ని అనుసరిస్తున్నట్లు వివరించారు.


Updated Date - 2021-02-26T08:31:10+05:30 IST