లీటర్‌కు 50 పైసల బోనస్
ABN , First Publish Date - 2021-12-30T08:07:19+05:30 IST
‘సంవత్సరంలో ఆరు నెలలు పాలు పోసిన పాడి రైతులకు ఏడాది చివర్లో ప్రతి లీటర్‌కు 50 పైసలు అమూల్ బోన్‌సగా ఇస్తుంది.

- అమూల్ పాల ఉత్పత్తిదారులకు ఏటా చెల్లింపు
- పాలు పోసిన పది రోజుల్లో ఖాతాల్లో డబ్బు జమ
- 30,951 మంది మహిళా రైతులకు రూ.71 కోట్లు చెల్లింపు
- ఇతర డెయిరీలు ఇచ్చే దానికంటే 10కోట్లు అదనంగా మేలు
- వచ్చే సెప్టెంబరుకు 17,629 గ్రామాల నుంచి పాల సేకరణ
- పాలు పోసే పాడి రైతులందరూ అమూల్ యజమానులే
- కృష్ణా జిల్లాలో ‘పాలవెల్లువ’ను ప్రారంభించిన సీఎం జగన్
అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘సంవత్సరంలో ఆరు నెలలు పాలు పోసిన పాడి రైతులకు ఏడాది చివర్లో ప్రతి లీటర్‌కు 50 పైసలు అమూల్ బోన్‌సగా ఇస్తుంది. ఇతర డెయిరీలతో పోల్చితే అమూల్ పాల సేకరణ ధర అధికం. పోసిన పాలకు పది రోజుల్లోనే బిల్లులు నేరుగా రైతు ఖాతాల్లోనే జమ చేస్తోంది’ అని సీఎం జగన్ అన్నారు. కృష్ణాజిల్లాలో ‘జగనన్న పాల వెల్లువ’ కార్యక్రమాన్ని ఆయన క్యాంప్ ఆఫీస్ నుంచి బుధవారం వర్చ్యువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో పాడి ఎక్కువగా ఉన్న 4,796 గ్రామాలను గుర్తించి, మహిళా పాడి రైతుల సహకార సంఘాలను ప్రోత్సహించేలా బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను రూ.979 కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి మహిళా డెయిరీకి అనుబంధ గ్రామాల్లో కూడా పాల సేకరణకు 12,883 ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లను రూ.1,600కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాలు పోసేవారికి భరోసా వస్తుంది. వాళ్లే స్వయంగా మీటరుతో వెన్న శాతం తెలుసుకోవచ్చు. ఎవరి ప్రమేయం లేకుండా బిల్లు వస్తుంది. అమూల్ రాకతో పాల రేట్లు పెరుగుతున్నాయి’ అని చెప్పారు. ఏడాదిలోనే ఆరు జిల్లాలోకి ప్రవేశించిన అమూల్... రాబోయే రోజుల్లో మిగతా ఏడు జిల్లాల్లో విస్తరించనుందన్నారు. వచ్చే సెప్టెంబరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా 17,629 గ్రామాల నుంచి పూర్తిగా పాలసేకరణకు ప్రణాళికలు రచించామని చెప్పారు. ఐదు జిల్లాల్లో 30,951 మంది మహిళా రైతుల నుంచి 168.5 లక్షల లీటర్ల పాల సేకరణకు రూ.71కోట్లు చెల్లించగా, ఇతర డెయిరీలు చెల్లించే దానికంటే రూ.10కోట్లు అదనంగా మేలు జరిగిందన్నారు. అమూల్‌కు లాభాపేక్ష లేదని, అదో సహకార రంగ సంస్థ అన్నారు. పాలు పోసే వారంతా అమూల్ యజమానులేనని సీఎం స్పష్టం చేశారు. పాలకు అత్యధిక ధర ఇస్తారని, లాభాలను కూడా బోన్‌సగా తిరిగి ఇచ్చేస్తారని సీఎం పేర్కొన్నారు.
డెయిరీలను అక్రమించుకున్నారు
సహకార డెయిరీల్లో బాగున్న వాటిల్లో కొన్నింటిని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు పూర్తిగా అక్రమించుకున్నారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అవి వాళ్ల ప్రైవేట్ ఆస్తుల కింద మారిపోయాయని, ప్రభుత్వానికి ఇదో సమస్య అయితే, ప్రభుత్వంలోని వ్యక్తులకు ప్రైవేటు డెయిరీల్లో వాటాలు ఉండటంతో పాలు పోసే అక్కచెల్లెమ్మలకు మంచి ధర ఇప్పించాలన్న తపన, తాపత్రయం ఉండేది కాదని ఆరోపించారు. ఈ పరిస్థితిని మార్చాలని రకరకాల కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా రాష్ట్రానికి అమూల్‌ను తీసుకొచ్చినట్లు చెప్పారు. రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధిని పెట్టి, మార్కెట్ జోక్యం ద్వారా ప్రభుత్వమే వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోందని సీఎం అన్నారు. దీనివల్ల దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను ఇబ్బంది పెట్టడాన్ని సవాల్ చేసిందన్నారు. లీటర్ మంచినీళ్ల ధర, లీటరు పాల ధర ఒకేలా ఉన్న విషయాన్ని పాదయాత్రలో రైతులు తన దృష్టికి తెచ్చినందున పాల నుంచి చాకెట్ల తయారీ స్థాయికి ఎదిగిన అమూల్‌ని తెచ్చామని సీఎం వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీదిరి అప్పలరాజు, వెలంపల్లి శ్రీనివాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సబర్ డెయిరీ ఎండీ బీఎం పటేల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.