బాబుపై నిందలు బుద్ధితక్కువతనానికి నిదర్శనం: బుద్దా

ABN , First Publish Date - 2021-05-18T09:08:55+05:30 IST

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును అక్రమంగా అరెస్టు చేసి నానా ఇబ్బందులు పెడుతున్నది చాలక..

బాబుపై నిందలు బుద్ధితక్కువతనానికి నిదర్శనం: బుద్దా

విజయవాడ, మే 17(ఆంధ్రజ్యోతి): నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును అక్రమంగా అరెస్టు చేసి నానా ఇబ్బందులు పెడుతున్నది చాలక.. చంద్రబాబుపై నిందలు వేయడం ప్రభుత్వ పెద్దల బుద్ధితక్కువతనానికి నిదర్శనమని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. చంద్రబాబు చెబితేనే ఎంపీ రఘురామరాజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనడం పచ్చి అబద్ధాలకు పరాకాష్ఠ అన్నారు. సోమవారం ఆయన విజయవాడలోని తన నివాసం నుంచి జూమ్‌ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు చెబితే రఘురామరాజు మాట్లాడటానికి టీడీపీలో ఎంపీలు లేరా? అధికార పార్టీకి చెందిన ఎంపీ, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడేలా చేసింది సొంత పార్టీవారు కాదా? రఘురామరాజు కులాల గురించి మాట్లాడటం తప్పయితే.. ఇంతకుముందు వైసీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఖరికి సీఎం సహా అందరూ కులాలపై మాట్లాడారు. ఒక కులాన్ని పనిగట్టుకుని ఆడిపోసుకున్నవారే’’ అని విమర్శించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై, మీడియా సంస్థలపై దాడులను వివరిస్తూ చంద్రబాబు, రాష్ట్రపతికి లేఖ రాశారని తెలిపారు. పొద్దున్న లేస్తే చంద్రబాబు జపం చేయందే వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు నిద్ర పట్టడం లేదని మండిపడ్డారు. 

Updated Date - 2021-05-18T09:08:55+05:30 IST