హైదరాబాద్‌లో పట్టుబడుతున్న ఏపీ మంత్రుల నల్ల డబ్బు: గొల్లపల్లి
ABN , First Publish Date - 2021-12-31T08:34:21+05:30 IST
హైదరాబాద్‌లో పట్టుబడుతున్న ఏపీ మంత్రుల నల్ల డబ్బు: గొల్లపల్లి

అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ‘‘ఐటీ శాఖ హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ కంపెనీలపై దాడులు చేస్తే ఆంధ్రప్రదేశ్ మంత్రుల నల్ల ధనం పట్టుబడుతోంది. ఈ రాష్ట్రాన్ని దోచి సంపాదించిన డబ్బును మంత్రులు ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టి పట్టుబడుతున్నారు. ఇది రాష్ట్రానికి సిగ్గుచేటు’’ అని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఆ పార్టీ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ శాఖ అధికారులు బుధవారం దాడులు చేస్తే లెక్కలు చెప్పని రూ.100 కోట్లు దొరికాయి. ఆ డబ్బు కృష్ణా జిల్లాకు చెందిన ఒక మంత్రిదని పత్రికల్లో వార్తలు వచ్చాయి. రాష్ట్రం దివాలా తీసి ప్రజలు జేబులో రూపా యి లేని స్థితిలో ఉంటే మంత్రులు వందల కోట్లు సంపాదిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయికి చేరిందో దీనిని బట్టి తెలిసిపోతోంది’’ అని అన్నారు. గడ్డం మంత్రి బినామీ కంపెనీ హైదరాబాద్‌లో షామీర్‌పేట శివార్లలో నూట పది ఎకరాల భూమి కొనుగోలు చేసిందని అంటున్నారని, ఎన్ని వందల కోట్లు ఉంటే అంత భూమి కొనుగోలు చేయగలిగారో వారికే తెలియాలని వ్యాఖ్యానించారు. మంత్రుల అక్రమ సంపాదనను లాగి ప్రభుత్వానికి ఇస్తే ఓటీఎస్ పేరుతో పేదలను పీడించి డబ్బు వసూలు చేయాల్సిన అవసరం ఉండదని, ఉచితంగా ఇళ్ల రిజిస్ట్రేషన్ చేయవచ్చని గొల్లపల్లి అన్నారు.