విశాఖలో మరో ఏడు కేసులు
ABN , First Publish Date - 2021-05-24T10:19:47+05:30 IST
విశాఖ జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా ఏడుగురికి వ్యాధి నిర్ధారణ కావడంతో కేజీహెచ్‌లో చికిత్స

బ్లాక్ ఫంగస్‌తో మరొకరి మృతి
29కి చేరిన బాధితుల సంఖ్య
విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి), అనకాపల్లి టౌన్, మే 23: విశాఖ జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా ఏడుగురికి వ్యాధి నిర్ధారణ కావడంతో కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. కేజీహెచ్‌లోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న వారిసంఖ్య 27కి చేరింది. ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, ప్లాస్టిక్‌సర్జరీ విభాగాధిపతి పీవీ సుధాకర్ ఆధ్వర్యంలోని వైద్యబృందం ఆదివారం రోగుల పరిస్థితిని పరిశీలించారు. మధురవాడకు చెందిన మహిళ(35) బ్లాక్ ఫంగస్ లక్షణాలతో నాలుగురోజుల కిందట మృతిచెందగా.. మరొక వ్యక్తి ఇవే లక్షణాలతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనకాపల్లికి చెందిన మద్దాల గణేష్(64) కూడా బ్లాక్ ఫంగస్ లక్షణాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
స్థానిక పప్పులవీధిలో నివాసముండే గణేష్ 8నెలల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. షుగర్ ఉంది. పది రోజుల క్రితం కరోనా నిర్ధారణ కావడంతో విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ముక్కు నుంచి రక్తస్రావం మొదలైంది. వైద్యులు బ్లాక్‌ఫంగస్ లక్షణాలున్నాయని చెప్పడంతో కేజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు. అయితే ఆయన కొవిడ్‌తోనే మృతి చెందినట్టు కేజీహెచ్ వైద్యులు డెత్ సర్టిఫికెట్ ఇచ్చారని కుటుంబసభ్యులు వెల్లడించారు.