విమానం రానంటోంది

ABN , First Publish Date - 2021-08-21T07:43:46+05:30 IST

రాష్ట్ర యవనికపై తనదైన ముద్ర వేసిన విజయవాడ విమానాశ్రయం ప్రస్తుతం మసక బారుతోంది!

విమానం రానంటోంది

వెలవెలబోతున్న బెజవాడ ఎయిర్‌పోర్ట్‌

2 నెలలు సర్వీసుల్లేవన్న స్పైస్‌ జెట్‌

ఇప్పటికే నిలిచిన ట్రూ జెట్‌, అలయన్స్‌ ఎయిర్‌

టీడీపీ ప్రభుత్వం హయాంలో 60 సర్వీసులతో కళకళ

నేడు 16 సర్వీసులతో కునారిల్లుతున్న వైనం


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): రాష్ట్ర యవనికపై తనదైన ముద్ర వేసిన విజయవాడ విమానాశ్రయం ప్రస్తుతం మసక బారుతోంది! మిలియన్‌ మంది ప్రయాణికుల రాకపోకలకు వేదికైన ఎయిర్‌పోర్టు... ఇప్పుడు అందులో పావు వంతు కూడా ఆదరణ లేక కునారిల్లుతోంది. రాజధాని అమరావతి ఖ్యాతి మసకబారడం, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నెమ్మదించడం, సందర్శకులు, పర్యాటకుల సంఖ్య పూర్తిగా తగ్గిపోవడం, తాజాగా కొవిడ్‌ విపత్కర పరిస్థితులు... అన్నింటి ప్రభావం విమాన ప్రయాణాలపై బలంగానే పడింది. ఈ నేపథ్యంలో విజయవాడ విమానాశ్రయం నుంచి ట్రూ జెట్‌, అలయెన్స్‌ ఎయిర్‌ తమ సర్వీసులను పూర్తిగా రద్దు చేసుకోగా... తాజాగా స్పైస్‌ జెట్‌ ఆ జాబితాలో చేరడంతో విమానాశ్రయం బోసి పోతోంది. అక్టోబరు 30 వరకు సర్వీసులను నడపలేమని విమానాశ్రయ అధికారులకు ఆ సంస్థ లేఖ రాసింది. 


ఆరంభం ఇలా...

2009లో విజయవాడ విమానాశ్రయాన్ని పునరుద్ధరించిన తర్వాత కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ముందుగా కాలుమోపింది. ఆ తర్వాత 2012లో  స్పైస్‌జెట్‌ ప్రవేశించింది. స్పైస్‌ రాకతో హైదరాబాద్‌కు కనెక్టివిటీ పెరిగింది. 2014లో స్పైస్‌జెట్‌ తన సర్వీసులను విజయవాడ నుంచి మరింత విస్తృత పరిచింది. కింగ్‌ఫిషర్‌ సంక్షోభంతో విజయవాడ నుంచి ఏకైక  ఎయిర్‌లైన్స్‌గా స్పైస్‌ జెట్‌ నిలిచింది. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత విజయవాడ ఎయిర్‌పోర్టు రాష్ర్టానికే తలమానికంగా మారిం ది. 2015 నుంచి 2018 వరకు స్పైస్‌జెట్‌ ముంబైకి 1, బెంగళూరుకు 3, హైదరాబాద్‌కు 2, చెన్నైకు 1, విశాఖపట్నం 1 చొప్పున ఎనిమిది సర్వీసులను నడిపింది. నాడు 80 శాతం ఆక్యుపెన్సీతో నడిచిన విమానాల్లో నేడు 30 శాతం కూడా ఆక్యుపెన్సీ ఉండడం లేదని ఆ సంస్థ వాపోతోంది. గత ఆరు నెలలుగా వరుసగా సర్వీసులను రద్దు చేస్తూ వస్తోన్న స్పైస్‌... ఇప్పుడు మొత్తానికే చేతులెత్తేసింది.


రాష్ట్ర ప్రభుత్వం నిరాదరణ

ప్రాంతీయ విమానయానాన్ని పెంపొందించటం కోసం కేంద్ర ప్రభుత్వం ఉడాన్‌ స్కీమ్‌ను తీసుకు వచ్చింది. ఈ స్కీమ్‌లో భాగంగా ట్రూజెట్‌ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 2, కడపకు 1 సర్వీసు చొప్పున నడిపింది. కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌ ఒప్పందాలను గౌరవించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ట్రూజెట్‌ సంస్థకు ఉడాన్‌ స్కీమ్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.3 కోట్లను చెల్లించలేదు. వేచి చూసిని ట్రూజెట్‌ తప్పనిసరి పరిస్థితులలో తన సర్వీసులను రద్దు చేసుకుంది. విశాఖపట్నం - విజయవాడ మధ్య విమాన సర్వీసును నడిపిన అలయెన్స్‌ ఎయిర్‌ కూడా తన సర్వీసును ఉపసంహరించుకుంది. 


గత మెంతో ఘనం...

నవ్యాంధ్రప్రదేశ్‌కు తలమానికంగా నిలిచిన విజయవాడ ఎయిర్‌పోర్టు టీడీపీ ప్రభుత్వం హయాం లో దేశంలోని మెట్రోపాలిటన్‌ విమానాశ్రయాలకు ధీటుగా అభివృద్ధి చెందింది. గన్నవరం ఎయిర్‌పోర్టుకు 2015 - 2018 మధ్య కాలం సువర్ణ అధ్యాయమే. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయ అభివృద్ధికి, విస్తరణకు ఎంతో కృషి చేసింది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియాకు సహకరించింది. విజయవాడ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించటానికి కృషి చేసింది. విమానాశ్రయ విస్తరణ కోసం 700 ఎకరాల భూములను సమీకరించి అప్పగించింది. దీంతో విమానాశ్రయం లో రూ.1,000 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు బీజం పడింది. మాస్టర్‌ ప్లాన్‌కు రూపకల్పన జరిగింది. ఈ క్రమంలో భాగంగా పాత టెర్మినల్‌ ఆధునీకరణ, తాత్కాలిక టెర్మినల్‌ బిల్డింగ్‌, రన్‌వే విస్తరణ, టాక్సీ వే, పార్కింగ్‌ బే, ఫైర్‌ స్టేషన్‌  ఆధునీకరణ వంటి పనులు జరిగాయి. ప్రస్తుతం శాశ్వత ప్రాతిపదికన నిర్మాణం జరుగుతున్న డొమెస్టిక్‌, ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులకు కూడా అప్పట్లోనే బీజం పడింది. ఇవన్నీ ఒక ఎత్తైతే విమానయాన రంగాన్ని ప్రోత్సహించేందుకు రాయితీలను ప్రకటించింది. సింగపూర్‌ విమాన సర్వీసును నడపడానికి పోత్సాహకంగా వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌ను ప్రకటించింది. ఈ చర్యల నేపథ్యంలో 2017- 18 ఆర్థిక సంవత్సరంలో ఒక మిలియన్‌ ప్రయాణీకుల రాకపోకలతో రికార్డును నమోదు చేసింది.


పడిపోయిన విమానయాన గ్రాఫ్‌ ఇలా...

టీడీపీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు 2014లో విజయవాడ విమానాశ్రయం నుంచి 16 విమానాలు నడిచేవి. ఇందులో 8 వచ్చేవి, ఎనిమిది వెళ్లేవి. ఐదేళ్ల టీడీపీ హయాంలో ఈ సంఖ్య అమాంతం పెరిగింది. ఢిల్లీ సర్వీసులు ఒకటి నుంచి మూడుకు పెరిగాయి. హైదరాబాద్‌కు 2 నుంచి 8కి, బెంగళూరుకు 1 నుంచి 6కు సర్వీసులు పెరిగాయి. ముంబై, వారణాసి, తిరుపతి, విశాఖపట్నంకూ సర్వీసులు నడిచేవి. ఇలా 2018 నాటికి ఈ విమానాశ్రయం నుంచి 60 సర్వీసులు నడిచాయి. ఇందులో 30 అరైవల్స్‌ , 30 డిపార్చర్స్‌ ఉండే వి. ఇప్పుడు 2014 సీన్‌ రిపీట్‌ అయింది. కేవలం 8 అరైవల్స్‌ , 8 డిపార్చర్స్‌కి మాత్రమే పరిమితమయింది.


రద్దయిన సర్వీసులు ఇవే...   

ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విజయవాడ నుంచి ఢిల్లీకి నడుపుతున్న తమ సర్వీసులను (ఒక్కొక్కటి చొప్పున) రద్దు చేశాయి. స్పైస్‌జెట్‌కు సంబంధించిన 8 విమాన సర్వీసులు రద్దు కాగా... వీటిలో ముంబైకి 1, బెంగళూరుకు 3, హైదరాబాద్‌కు 2, చెన్నైకు 1, విశాఖకు 1 చొప్పున ఉన్నాయి. ట్రూజెట్‌ హైదరాబాద్‌కు 2, కడపకు 1 సర్వీసును రద్దు చేసింది. ఇండిగో ఢిల్లీ సర్వీసు ఒకటి రద్దు అయింది. ప్రస్తుతం విజయవాడ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి 1, చెన్నైకు 1, హైదరాబాద్‌కు 4, బెంగళూరుకు 2 సర్వీసులు నడుస్తున్నాయి.


కర్నూలు విమానాశ్రయంలో తగ్గిన రద్దీ

కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు వద్ద నిర్మించిన విమానాశ్రయానికి ప్రయాణికుల రద్దీ తగ్గింది. ఈ విమానాశ్రయానికి ఈ ఏడాది మార్చి 28 నుంచి చెన్నై, బెంగళూరు, వైజాగ్‌కు ఇండిగో విమాన సర్వీసులను ప్రారంభించింది. మొదటి రోజు 67 మంది ప్రయాణికులు విమాన సేవలను ఉపయోగించుకున్నారు. వ్యాపార వర్గాలు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు విమాన సేవలను ఉపయోగించుకోవడానికి మొగ్గుచూపడంతో ప్రయాణికుల సంఖ్య నెమ్మదిగా పెరిగి సుమారుగా 200కు చేరింది. ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. కొవిడ్‌ నేపథ్యంలో వ్యాపార లావాదేవీలు బాగా తగ్గడం, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేయడం దీనికి ప్రధాన కారణమని భావిస్తున్నారు.

- ఓర్వకల్లు

Updated Date - 2021-08-21T07:43:46+05:30 IST