ఆయుర్వేద మందు పంపిణీకి అడ్డంకులు
ABN , First Publish Date - 2021-12-31T07:31:02+05:30 IST
ఆయుర్వేద మందు పంపిణీకి అడ్డంకులు

ఈ విషయంలో పోలీసుల జోక్యాన్ని నిలువరించండి
హైకోర్టులో ఆనందయ్య వ్యాజ్యం.. నేడు విచారణ
అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆయుర్వేద మందు తీసుకొనేందుకు తన ఇంటికి వస్తున్న ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారని.. మందు పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా వారిని నిలువరించాలని కోరుతూ నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నానికి చెందిన బి.ఆనందయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, నెల్లూరు ఎస్పీ, డీఎస్పీ, కృష్ణపట్నం ఎస్‌హెచ్‌వోను ప్రతివాదులుగా చేర్చారు. గురువారం కోర్టు ప్రారంభమైన వెంటనే వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. అయితే దీనిపై శుక్రవారం విచారణ జరుపుతామని న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ స్పష్టం చేశారు. ‘కొత్త వేరియంట్ ఒమైక్రాన్‌కు మందు ఇస్తున్నానంటూ కొందరు చేసిన ప్రచారం వాస్తవం కాదని అధికారులకు వివరణ ఇచ్చాను. ఆ విషయాన్ని పట్టించుకోకుండా పోలీస్ కానిస్టేబుళ్లను నా ఇంటి ముందు ఉంచారు. ఆయుర్వేద మందు కోసం వస్తున్నవారిని అడ్డుకుంటున్నారు. ఆయుర్వేద మందు పంపిణీని అడ్డుకోవడం చట్టవిరుద్ధం. మందు పంపిణీ విషయంలో పోలీసుల జోక్యాన్ని నిలువరించండి. తనకు తగిన పోలీస్ భధ్రత కల్పిస్తూ మందు పంపిణీ సజావుగా సాగేలా ఆదేశాలివ్వండి’ అని ఆనందయ్య కోరారు.