బద్వేలు ఓట్ల లెక్కింపు నేడే

ABN , First Publish Date - 2021-11-02T07:44:28+05:30 IST

బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం మంగళవారం తేలిపోనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది.

బద్వేలు ఓట్ల లెక్కింపు నేడే

  • ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్‌
  • హుజూరాబాద్‌ విజేత తేలేదీ నేడే


బద్వేలు, నవంబరు 1: బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం మంగళవారం తేలిపోనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఇక్కడ మరణించిన వైసీపీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్‌ సుధను అధికార పార్టీ పోటీలో నిలపడంతో.. గత ఆనవాయితీ ప్రకారం టీడీపీ ఇక్కడ పోటీ విరమించుకుంది. జనసేన కూడా అదే పాటించింది. బీజేపీ నుంచి పి.సురేశ్‌, కాంగ్రెస్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే కమలమ్మ బరిలోకి దిగారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కేతన్‌ గార్గ్‌ సోమవారం కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాట్లు పరిశీలించారు. మధ్యాహ్నానికి తుది ఫలితాలు వెల్లడవుతాయి. 


మెజారిటీ, ఓట్లపై పందేలు..

ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బరిలో లేకపోవడంతో లక్ష మెజారిటీ సాధించాలని వైసీపీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. బీజేపీకి 20 వేల ఓట్లు వస్తాయని కొందరు.. రావని ఇంకొందరు.. వైసీపీకి 80 వేల నుంచి లక్ష వరకు మెజారిటీ వస్తుందని మరికొందరు మూడు రోజులుగా రూ.కోట్లు పందేలు కాశారు. కాగా.. తెలంగాణలోని హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ కూడా మంగళవారమే జరుగనుంది. 

Updated Date - 2021-11-02T07:44:28+05:30 IST