కరోనాకు దూరంగా..!

ABN , First Publish Date - 2021-05-30T09:23:20+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం చదలవాడ పంచాయతీ ఏరువాడ గ్రామం కొండపైన ఉంటుంది. ఈ గ్రామానికి పంచాయతీకి మధ్య 17కి.మీ. దూరం. ఇక్కడ 22 కొండరెడ్ల కుటుంబాలు, 99మంది జనాభా ఉన్నారు

కరోనాకు దూరంగా..!

కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం కకావికలమవుతోంది. పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా ఈ మహమ్మారి అందరి జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. కానీ మన్యంలో రెండు గ్రామాలు మాత్రం ఇంతటి ఉధృతిని కూడా సమర్థంగా తట్టుకొని నిశ్చింతగా ఉంటున్నాయి. ఇక్కడి గ్రామస్థులు ఎంతో బాధ్యత, క్రమశిక్షణతో వ్యవహరిస్తూ, స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతాల కన్నా మిన్నగా... ఊరి ప్రజలంతా కలసికట్టుగా ఉంటే ఎంతటి విపత్కర పరిస్థితినైనా జయించవచ్చనే సత్యాన్ని చాటిచెబుతున్నారు. 


మోతుగూడెం :

మన్యంలో రెండు గ్రామాల ఘనత 

తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం చదలవాడ పంచాయతీ ఏరువాడ గ్రామం కొండపైన ఉంటుంది. ఈ గ్రామానికి పంచాయతీకి మధ్య 17కి.మీ. దూరం. ఇక్కడ 22 కొండరెడ్ల కుటుంబాలు, 99మంది జనాభా ఉన్నారు. ఇక ఎర్రగుంటపాకల. ఈ గ్రామంలో 47 కుటుంబాలు, 166 మంది జనాభా ఉంటున్నారు. ఇది కూడా కొండరెడ్లు నివసించే గ్రామమే. చదలవాడ పంచాయతీకి 4 కి.మీ. దూరంలో ఎత్తయిన ప్రదేశంలో ఉంటుంది. ఈ రెండు గ్రామాల్లోకి బయటివారిని అనుమతించరు. వీరు బయటకు వెళ్లరు. కష్టపడి పనిచేస్తారు. ఆరోగ్యవంతమైన, ప్రకృతి సహజమైన ఆహారాన్ని తీసుకుంటారు. కరోనా మహమ్మారి దరిదాపుల్లోకి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


ప్రజల సహకారంతోనే...

పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. క్రమం తప్పకుండా శానిటేషన్‌ పనులు జరిపిస్తున్నాం. ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు సహకరిస్తుండటంతో కరోనా నియంత్రణ సాధ్యమైంది.

- కుంజా తిరుపతిరావు, సర్పంచ్‌, చదలవాడ


అవగాహన కల్పిస్తున్నాం

కరోనా జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా గ్రామాల్లో బ్లీచింగ్‌, సున్నం మిశ్రమం జల్లడం, హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ చేయడం వంటి పనులు చేపడుతున్నాం. ఈ రెండు గ్రామాల ప్రజలు కలసికట్టుగా ఉండి కరోనాకు దూరంగా ఉంటున్నారు. అన్ని గ్రామాల్లో కూడా ఇలాగే సహకరిస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తాం. 

- పి.అనంతలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి, చదలవాడ

Updated Date - 2021-05-30T09:23:20+05:30 IST